బిసి మహా పాదయాత్ర జాక్ నేతలకు ఊరూరా ఘన స్వాగతం

 



చట్టసభల్లో వాటా కోసం కొనసాగుతున్న బి.సి మహా పాదయాత్ర

ఊరూరా సామాజిక, ప్రగతిశీల సంఘాల ఘన స్వాగతం

తొమ్మిదవ రోజు భువనగిరికి చేరుకున్న బి.సి పాదయాత్ర



బెల్లి లలితకునివాళులు అర్పించిన జాక్ నాయకులు


   


 చట్టసభల్లో బి సి వాటా సాధన కోసం కొనసాగుతున్న ఏడవ రోజు పాదయాత్ర తెలంగాణ ఎం.బి.సి మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, ఎఐసిసి నాయకులు కేతురి వెంకటేష్, ఎం.బి.సి, సంచార జాతుల సమాఖ్య నాయకులు పాండు వంశరాజుల, జల్సావంత్ గిరి మందుల, సినీ హీరో, నవ సంఘర్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పంజాల జైహింద్ గౌడ్ లు ఘన స్వాగతం పలికి పాదయాత్రను ఉద్దేశించి ప్రసంగించారు. చట్టసభల్లో బి.సి వాటా పోరాటం న్యాయమైందని వాటా సాధించేవరకు అండగా ఉంటామని వారు అన్నారు. 


పాదయాత్ర మహిళలకు ఘన సన్మానం


   ఎనిమిదవ రోజు ఘట్కేసర్ కు చేరుకున్న పాదయాత్ర బృందానికి స్థానిక సామాజిక సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం వద్ద పూలమాలలు వేసి సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చట్టసభల్లో వాటా కోసం పాదయాత్ర చేస్తున్న మహిళా నాయకులు వెలుగు వనిత, పటేల్ వనజ, ఏటిగడ్డ అరుణ పటేల్, సూరారపు రమారెడ్డి, గడిపె విమల, సింగారపు అరుణ, వెలుగు వెన్నెల లను ఘనంగా సన్మానించారు. మీరు చేస్తున్న పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని అలాంటి యాత్రకు సామాజిక సంఘాల మద్దతు ఎప్పటికీ ఉంటుందని వారన్నారు.


   సకల సామాజిక రంగాల్లో మేమంతమందిమో మాకంత వాటా ఉద్యమంలో బాగంగా చట్టసభల్లో బి.సి వాటా సాధన కోసం ఆల్ ఇండియా ఒబిసి జాక్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బి.సి మహా పాదయాత్ర బృందం తొమ్మిదవ రోజు  శనివారం భువనగిరి జిల్లా కేంద్రం చేరుకుంది. జాక్ నాయకులు సాయిని నరేందర్, మేకపోతుల నరేందర్, బత్తుల సిద్ధేశ్వర్, ఎర్ర శ్రీహరి, కొంగ నరహరి స్థానిక నాయకులు భువనగిరి శ్రీనివాస్ నేతతో కలిసి బెల్లి లలితక్క సమాధి వద్దకు వెళ్ళి ఆమెకు నివాళి అర్పించారు. భువనగిరి సెంటర్ లోని మహాత్మా జ్యోతరావు పూలే విగ్రహం, అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి మాట్లాడారు. 

   


    సమాజ నిర్మాణం కోసం, తెలంగాణ సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన బి.సి లంటే నేడు ఎవరికి లెక్క లేదని, గత 70 ఏండ్లుగా జనగణన కోసం, సమాన అవకాశాల కోసం బి.సి లు ఎన్నో పోరాటాలు చేస్తున్నా భారతదేశ పాలకులు పట్టించుకోవడం లేదని వారు అన్నారు. బెల్లి లలితక్క, మారోజు వీరన్న, శ్రీకాంతాచారి, సాంబశివుడు, మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి వీరుల స్పూర్తితో ఉద్యమించి చట్టసభల్లో బి.సి వాటా సాధిస్తామని అన్నారు. చట్టసభల్లో వాటా సాధన కోసం 162 కిలోమీటర్ల దూరం పాదయాత్ర పూర్తి చేసి భువనగిరి చేరుకున్నామని, చట్టసభల్లో బి.సి వాటా సాధన కోసం ప్రజాస్వామ్యంలో అత్యున్నత పోరాట రూపమైన పాదయాత్రను ఎంచుకున్నామని అన్నారు. మొదటి దఫా పాదయాత్ర మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం మిరిగోన్  పల్లి గ్రామం వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ ప్రారంభమై కొండా లక్ష్మణ్ బాపూజీ, బెల్లి లలితక్క, శ్రీకాంతచారి, మారోజు వీరన్న, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మల ప్రాంతాలను సందర్శిస్తూ మహా వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న ఖిలాషాపూర్ లో ఈనెల 20 న ముగుస్తుందని వారు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశ రాజధాని ఢిల్లీ వరకు బి.సి దండయాత్ర కొనసాగుతుందని అన్నారు. గత తొమ్మిది రోజులుగా ఎండలను కూడా లెక్కచేయకుండా మహిళలు సైతం ఈ పాదయాత్రలో కొనసాగడం గొప్ప విషయం. చట్టసభల్లో బి.సి వాటా కోసం జరిగే ఈ పాదయాత్రలో మేధావులు, బుద్ధిజీవులు, మహిళలు, విద్యార్థులు, యువత, కార్మికులు, కర్షకులు పార్టీలకతీతంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 

     ఈ కార్యక్రమంలో ఎఐఒబిసి జాక్ వైస్ చైర్మన్లు పటేల్ వనజ, వెలుగు వనిత, నాయకులు బిక్షపతి, సింగారపు అరుణ, విమల, విశ్వపథి, చెన్న శ్రావణ్ కుమార్, రామ్ ప్రసాద్, ఎర్రమల్ల శ్రీను, బుచ్చిబాబు, బాలస్వామి, చాపర్తి కుమార్ గాడ్గే, అజయ్ పటేల్, సుదర్శన్, మహేష్ గౌడ్, ఆంజనేయులు గౌడ్ తదితరలు పాదయాత్ర బృందంలో ఉన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు