మారోజు వీరన్న బాట - చట్టసభల్లో బి.సి వాటా

 


మారోజు వీరన్న బాట - చట్టసభల్లో బి.సి వాటా


లాల్ నీల్ సిద్ధాంత కర్త మారోజు వీరన్న 


మారోజు వీరన్న స్పూర్తితో బహుజన రాజ్య స్థాపన


  మహాత్మా జ్యోతి బా పూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్, చదువుల తల్లి, ఆరోగ్య మాత సావిత్రి బాయి పూలే, సాహుమహారాజ్, పెరియార్, కాన్షీరామ్ ల నిజమైన వారసుడుగా నిలబడి కలబడిన కామ్రేడ్ మారోజు వీరన్న తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలో ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసి పీడిత ప్రజలకు అండగా నిలిచాడు. ఆచరణే గీటురాయి, ఆచరణే సిద్ధాంతాన్ని పదును పెడుతుందని బోధించి ఉద్యమకారులను ముందుకు నడిపిన  నాయకుడు మారోజు వీరన్న. ప్రజల ఆపదను తన ఆపదగా చేసుకుని తాను ముందు నిలబడు వాడే నిజమైన విప్లవకారుడని బోధించి ఆచరణాత్మక ఉద్యమాలు చేసిన కామ్రేడ్ మరోజు వీరన్న మాటలు తూటాలుగా, సిద్ధాంతం విప్లవాత్మక మార్పు దిశగా, ఆచరణ పీడిత ప్రజల విముక్తికి దోహదం చేసేదిగా ఉండేది. చూడ్డానికి కళ్ళుండాలని, లక్ష్యం పట్ల చిత్తశుద్ధి ఉండాలని, ఆచరించే దమ్ముండాలని, అన్నింటికీ మించి ప్రజల పట్ల ప్రేముండాలని బోధించి ఆచరించిన వాడు వీరన్న. ఆనాడు వీరన్న చెప్పిన మాటలను, తన ఆచరణాత్మక ఉద్యమాన్ని గుర్తు చేసుకోవడమంటే నేటి దోపిడి పాలనలో ఉద్యమకారులుగా, సంఘాలుగా, ప్రగతిశీల శక్తులుగా, మేధావులుగా, విద్యావంతులుగా, బుద్ధిజీవులుగా, బాద్యత గల ప్రజలుగా ఎలాంటి ఉద్యమాలు చేయాలో నిర్ధేశించుకోవాలి. మనుధర్మ సిద్ధాంతంతో వేల సంవత్సరాలుగా అణచివేయబడిన దేశ మెజార్టీ ప్రజలు గత 40 ఏండ్లుగా ప్రపంచీకరణ, ప్రేవేటీకరణ, సరళీకరణ, పట్టణీకరణ, అవినీతి పాలనతో దోపిడికి గురవుతున్నారు. కులాల వెనుకబాటుకు వర్గ అణచివేతలు తోడై దేశంలో ఓపక్క ప్రపంచ కుబేరులు పెరుగుతుంటే మరో పక్క నానాటికి పేదలు మరింత పేదలుగా మారి ఆర్థిక అసమానతలు పెరిగి బతకలేక బలిదానాలు చేసుకుంటున్నారు. దేశంలోని పాలక పార్టీలు అణగారిన ప్రజలను చాకిరి చేసే కులాలుగా, ప్రలోభ కులాలుగా, ఓట్లేసే యంత్రాలుగా, మత బానిసలుగా మాత్రమే చూస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మారోజు వీరన్న లాంటి సిద్ధాంతం, ఆయన వేసిన బాట మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం చేపట్టడానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా జనాభాలో 60 శాతంగా ఉన్న బి.సి ల విముక్తికి, చట్టసభల్లో బి.సి వాటా సాధనకు ఉపయోగపడుతుంది.  

    మారోజు వీరన్న ఒక విద్యార్థి నాయకుడుగా, గాయకుడుగా ఎన్నో ఉద్యమాలను నిర్వహించి ప్రగతిశీల విద్యార్థి విభాగాన్ని నిలబెట్టాడు. క్యాపిటేషన్ పీజుకు వ్యతిరేకంగా, బడుగు బలహీన వర్గాలకు ట్యూషన్ ఫీజు గురుంచి ఉద్యమించి పాలకుల పీఠాలను కదిలించాడు. దేశంలో సగానికి పైగా జనాభా గల బి.సి లకు విద్యా, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్ కల్పించిన మండల్ కమీషన్ కు వ్యతిరేకంగా ఆధిపత్య కులాలు చేసిన తప్పుడు ఉద్యమానికి వ్యతిరేకంగా, మండల్ అనుకూల ఉద్యమంలో అందరికంటే వీరన్న ముందు నిలిచారు. మతవాద విద్యార్థి ఉద్యమాలను ఎదిరించి పోరాడిన ఘనత వీరన్న ప్రజా యుద్ధ నౌక గద్దరన్న పై కాల్పుల సందర్భంలో కూడా అందరికన్నా ముందే వీధుల్లోకి వచ్చి ఉద్యమించాడు.  రాష్ట్రంలో ఉన్న కరువు పరిస్థితులపై జల సాధన ఉద్యమాన్ని ముందుకు తెచ్చి పల్లెల్లో ప్రజలను, విద్యార్థుల తల్లిదండ్రులను రైతాంగ జలసాధన ఉద్యమాల్లో బాగం చేశారు. వీరన్న ఉద్యమంలో బాగంగా నిజాం కాలేజి మైదానంలో ఎన్నో సభలు జరిగాయి.

     ఎంతో మంది త్యాగదనులకు జన్మనిచ్చిన త్యాగాల తెలంగాణలో మారోజు వీరన్నది ఒక ప్రత్యేక స్థానం. తల్లి దండ్రుల కులాంతర వివాహ పంట తానై, సాయుధ పోరాట వారసత్వమై, సర్దార్ సర్వాయి పాపన్న, వీర బ్రహ్మంల వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని సీమాంధ్ర అగ్రకుల పెత్తనంలో నలిగిపోతున్న తెలంగాణ విముక్తికై మలిదశ ఉద్యమ కెరటాన్ని ఎగురవేసిన మారోజు వీరన్న 1997లో సూర్యాపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించి తెలంగాణ మహాసభను స్థాపించడం జరిగింది. కుల రహిత సమాజ స్థాపనకై కులంపై విప్లవ పార్టీల సంస్కరణ వాదం పై, సాంప్రదాయిక కమ్యూనిస్టు ఉద్యమాలపై తిరుగుబాటు జెండా ఎత్తి మే 17 కామ్రేడ్స్ గా కుల రహిత సమాజం కోసం కుల ప్రజాస్వామిక సంఘాల నిర్మాణం చేపట్టిన వీరన్న బాంచోల్లని బందమేసి, శూద్రులని ముద్రలు వేసి మన తాత తండ్రుల నుండి మన శ్రమని మెక్కిన దొరలు అంటూ పాటందుకుని అందుకోర గుతపందుకో ఈ దొంగల తరిమేటందుకు అంటే అగ్రకులదోపిడీ  పాలకులకు వెన్నులో వణుకు పుట్టేది. యువతరమా, నవతరమా విద్యార్థులు మీరే నవ నిర్మాతలు మీరేనంటూ విద్యార్థులకు యువకులకు వీరన్న మార్గనిర్దేశనం చేసినాడు.


   పీడిత జన సామాజిక విప్లవకారుడు, మలిదశ తెలంగాణా పోరాట ఆద్యుడు, కుల వర్గ జమిలి పోరాటాల నిర్మాత, ఎర్ర పోరాటానికి నీలి మెరుపులు అద్దిన వీరన్న అస్తిత్వ  పోరాటాలకు దిక్సూచిగా నిలిచాడు. శ్రామిక వర్గ దృక్పథం లేని కుల పోరాటాలు, కుల నిర్మూలన లక్ష్యం లేని వర్గ పోరాటాలు విముక్తి సాధించలేవని సూత్రీకరించిన వీరన్న కెసిఆర్ నోట వచ్చిన ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన 1997 లోనే చేసాడు. ఫెడరల్ తో బహుజన రాజ్య స్థాపన మారోజు వీరన్న లక్ష్యం. అందుకే విభిన్న భాషలు, విభిన్న సంస్కృతి, విభిన్న జీవన విధానం, విభిన్న ఆర్ధిక స్థితిగతులున్న ఇండియాలోని రాష్ట్రాలను ఇండియా సంయుక్త రాష్టంగా పేర్కొని ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ (దళిత బహుజన శ్రామిక విముక్తి) సి.పి.యు.ఎస్.ఐ (డి.బి.ఎస్.వి) పార్టీని స్థాపించి సాయుధ పోరాట పంథాలోనే దేశంలో కొత్త శకాన్ని మొదలుపెట్టిన ఘనుడు, మేధావి మారోజు వీరన్న.  అలాంటి దేశంలో ఒకే దేశం, ఒకే మతం, ఒకే ఎన్నిక అంటూ ఆధిపత్య పాలకవర్గమైన బిజెపి చేస్తున్న కుటిల రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరముంది.

    ఏక కాలంలో రెండు లక్ష్యాలను సాధించడం మారోజు వీరన్న వ్యూహం. తెలంగాణలో వలసాధిపత్య అగ్రకుల దోపిడి పాలన పోవాలని అదే సమయంలో తెలంగాణలో అగ్రకుల భూస్వామ్య పాలన పోయి బహుజన రాజ్యం స్థాపించాలని 1997 లో తెలంగాణ మహాసభ స్థాపించడమే కాకుండా అనుకున్న లక్ష్యం సాధించడం కోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగాడు.  తెలంగాణ మహాసభ ప్రారంభం, అందులో మహా మహా మేధావులను పాల్గొనేటట్లు చేయడంలో వీరన్న కృషి చాలా గొప్పది. తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్, తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన వి. ప్రకాష్, డాక్టర్ చెరుకు సుధకార్, ఉ. సాంబశివరావు, కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళను 1997 లోనే తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములను చేసాడు వీరన్న.  బ్రాహ్మణీయ వ్యవస్థలో కులాలుగా విడిపోయి జీవిస్తున్న అనగారిన సమాజాన్ని ఐక్యం చేయడం కోసం వీరన్న కృషి నిర్వచించలేనిది.  ఐడెంటిటీ అండ్ అలియన్స్ అనే సిద్ధాంతంతో ఏ కులానికి ఆ కులాన్ని ఐడెంటిఫై చేసుకొని అంతిమంగా అనగారిన కులాలన్ని అలయన్స్ (ఐక్యత) చేయడం లక్ష్యంగా ముందుకు సాగిన వీరన్నను లక్ష్యం చేరకముందే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పట్టుకొని కాల్చి చంపింది. తెలంగాణ మహాసభతో మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన వీరన్నను పొట్టన పెట్టుకున్న 10 రోజులకే తెలంగాణ జనసభ నాయకురాలు, ఉద్యమాల గాణ కోకిల బెల్లి లలితక్కను 16 ముక్కలు చేసి చంపిన చరిత్ర కూడా చంద్రబాబునాయుడుది.  తెలంగాణలో జరుగుతున్న వీరోచిత పోరాటాన్ని ఎదురించలేని చంద్రబాబు ప్రభుత్వం ఎంతో మంది మేధావులను, విప్లవకారులను, డాక్టర్లు, న్యాయవాదులను కాల్చి చంపడమే కాకుండా 1997 ఏప్రిల్ 6 న ప్రజా యుద్ధ నౌక గద్దర్ ను హతమార్చాలని కాల్పులు జరిపింది.  

   నేడు తెలంగాణ, ఆంధ్రలో కుల సంఘాల చైతన్యం, అంబేడ్కర్ ఆలోచన, వందల సంఖ్యలో అంబేడ్కర్, పూలే సంఘాలు, బహుజన సంఘాలున్నాయంటే దానికి కారణం వీరన్ననే. అణగారిన ప్రజలు, స్థానిక ప్రజలు స్వంతం చేసుకునే కుల సంఘాలను, వర్గ సంఘాలను ఏర్పాటు చేయడమే కాకుండా, కూలీ రైతు సంఘం, ఆడ జన సంఘం, బహుజన డెమోక్రటిక్ విద్యార్థి సంఘం లాంటి ఎన్నో సంఘాలను ఏర్పాటు చేశారు. నక్సలైట్ ఉద్యమానికి వెన్నుముక లాంటి గోదావరి లోయ ఉద్యమంలో బలమైన ఆదివాసీ ప్రజలను బహుజన ఉద్యమం వైపు తిప్పి నక్సలైట్ ఉద్యమానికి కొత్త ఒరవడి తీసుకొచ్చాడు.  తెలంగాణలో పూలే, పెరియార్, అంబేడ్కర్, కాన్షిరామ్ సిద్ధాంతం, పని విధానాన్ని దేశ ప్రజల ముందుంచి ప్రజాస్వామ్యబద్ధంగా ఎంతో చైతన్యం చేయడమే కాకుండా ఆచరణాత్మక ఉద్యమం చేసాడు. ఉమ్మడి రాష్ట్రములో  రైతుల ఆత్మహత్యలు, చేనేతల ఆత్మహత్యలు, ఆకలి చావులు, ఆరోగ్య చావులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎంతో చరిత్ర చదివి, ఎంతో మంది ఉద్యమకారులు, మేధావులతో చర్చించి వ్యూహ రచన చేసిన మారోజు వీరన్న "తెలంగాణ మహాసభ" ఏర్పాటు చేశాడు. కుల సమాజ నిర్మాణంలో ఉన్న ఇండియాలో విప్లవం విజయవంతం కావాలంటే కుల వర్గ నిర్మూలన జమిలి పోరాటం అవసరమని వాదించడమే కాకుండా  "ఇండియాలో ఏమి చేయాలి" అనే గ్రంధం రచించి బహుజన నాయకులకు, పార్టీ క్యాడర్ కు అందించాడు. 

    తెలంగాణలో బహుజన రాజ్య స్థాపనతో పాటు రాష్ట్రం విడిపోయి అధికారం చేజారిపోతుందని కుట్రలు పన్నిన అగ్రకుల ఆంధ్ర వలస పాలకులు మారోజు వీరన్నను పొట్టన పెట్టుకోవడంతో ముందుకొచ్చిన తెలంగాణ ఉద్యమంలో బహుజన రాజ్య స్థాపన వెనక్కి వెళ్లి మళ్ళీ గతంలో లాగానే ఆధిపత్య వర్గాల పాలన ముందుకు వచ్చింది. బహుజన నేతలే టార్గెట్ గా కెసిఆర్ పాలన కొనసాగించారు. ఆనాటి ఆలే నరేంద్ర నుండి నేటి ఈటల రాజేందర్ వరకు ఆయన నిరంకుశాన్ని ప్రశ్నించిన ఎందరినో రాజకీయ సమాధి చేసాడు. మారోజు వీరన్న బాటలో నడిచిన డాక్టర్ చెరుకు సుధకార్ ను, టిఆర్ఎస్ కు చిల్లి గవ్వ లేనప్పుడు అన్ని విధాల సహకరించిన గాదె ఇన్నయ్యను, తెలంగాణ భవన్ కు ఆశ్రయమిచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ, తను స్థాపించిన పార్టీని రద్దు చేసుకొని విలీనమైన విజయశాంతి లాంటి వాళ్లను ఎందరినో రాజకీయ సమాధి చేసిన కెసిఆర్ సీమాంధ్ర  కార్పొరేట్ శక్తులతో చేతులు కలిపి అభివృద్ధి పేరుతో నిధులన్నింటిని సీమాంధ్ర పెట్టుబడిదారులకు దోచి పెట్టాడు. రాష్ట్రంలో ఆరోగ్య దోపిడికి, ఫార్మా సిటీ నిర్మాణానికి అవకాశమిచ్చి కాలుష్య రాష్ట్రంగా మార్చాడు. 

   హక్కులు, ఆత్మగౌరం, రాజ్యాధికారం, కుల రహిత, వర్గ రహిత సమాజ స్థాపణకై మార్క్స్, లెనిన్, మావోలకు తోడు పూలే అంబేడ్కర్ లను జతకలిపిన వీరన్న మనసా వాచా సత్యాన్ని నమ్మి, నమ్మిన సిద్దాంతాన్ని బోధించి ఆ ఆచరణలో ప్రాణాలర్పించాడు. మారోజు వీరన్న నేడు  దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ఆదర్శం కావాలి. 1999 మే 16 న సీమాంధ్ర పాలకులు వీరన్న ను బూటకపు ఎన్కౌంటర్ లో కాల్చి సంబర పడ్డారు. కానీ వీరన్న త్యాగ ఫలంతో తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం మరింత విస్తృతమై  2014 లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా దోపిడి శక్తుల దోపిడి మాత్రం ఆగలేదు. సామాజిక దోపిడీ, శ్రమ దోపిడీ, ప్రకృతి వనరుల దోపిడితో తెగ బలిసిన దోపిడీ వర్గాలు నేడు విద్య, వైద్య వ్యాపారంతో అణగారిన ప్రజలు జీవితాంతం పోగేసుకున్న నాలుగు రాళ్లను ఒక్కసారిగా ఊడ్చేసుకోవడంతో పాటు ప్రాణాలను కూడా బలిగొంటున్నారు. అనేక పోరాటాలు, త్యాగాలతో, ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాలకుల విధానాల వల్ల దోపిడి మరింత ఎక్కువైంది. కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఈ దోపిడీని అరికట్టి సామాన్య ప్రజల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించి అమలు చేయాల్సిన అవసరముంది. 


మూస ఉద్యమాలను వీడాలి


   ఎన్నో పోరాటలకు, త్యాగాలకు కేంద్రమైన తెలంగాణలో బహుజన ఉద్యమకారులు మూస ధోరనని వీడాలి. బి.సి ముఖ్యమంత్రిని ప్రకటించిన పార్టీకి మా మద్దతునిస్తామని, అత్యధిక సీట్లు ఇచ్చిన పార్టీకే మా మద్దతుంటుందని బి.సి నాయకులు మాట్లాడుతున్నారు. బి.సి ముఖ్యమంత్రి వచ్చినా, సగం మంది బి.సి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్న బి.సి లకు ఒరిగేదేమి ఉండదని గమనించాలి. ఆధిపత్య పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు వారి చెప్పు చేతుల్లో ఉంటారే గానీ అణగారిన ప్రజల పక్షాన ఉండరనే విషయాన్ని ఉద్యమ నాయకత్వం గమనించాలి. గత 10 ఏండ్లుగా బి.సి ప్రధాని దేశాన్ని ఏలినా బి.సి లకు ఒరిగిందేమి లేదు. బి.సి జనగనన కూడా చేయడం లేదు. మహిళా బిల్లులో బి.సి కోటా ఊసే లేదు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు, ఎం.పి, ఎమ్మెల్యేలు అంతా కూడా కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లో పావులేనని, ఆయా పార్టీల్లో వారు బానిసలనే విషయాన్ని ఉద్యమకారులు అర్ధం చేసుకోవాలి. బహుజన ప్రజల బాగు కోసం చేయాల్సిన నిర్మాణత్మకమైన చర్యలకు డిమాండ్ చేయాలి. సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా ఆయా పార్టీల మేనిఫెస్టోలో చోటుచేసుకోవాలి. ఆధిపత్య పార్టీల్లో బహుజన నాయకులకు పదవులు కాదు అడిగాల్సింది బహుజన ప్రజల అభివృద్ధి ప్రణాళికను డిమాండ్ చేయాలి. 

   ప్రస్తుత పరిస్థితుల్లో మరోజు వీరన్న మార్గంలో పయనించడమంటే సుమాన విద్యా సాధన, ఉపాధి కల్పన, ప్రజారోగ్య పరిరక్షణ, బి.సి జనగనన, సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు నేటి ప్రధాన అంశంగా, అంతిమంగా తెలంగాణలో బహుజన రాజ్య స్థాపన లక్ష్యంగా ఉద్యమ శక్తులు ముందుకు సాగాలి. కామ్రేడ్ మారోజు వీరన్న స్పూర్తితో చట్టసభల్లో బి.సి లకు వాటా సాధిద్దామని ఆల్ ఇండియా ఒబిసి జాక్ ఆధ్వర్యంలో తెలంగాణలో జరిగిన 400 కిలోమీటర్ల పాదయాత్ర బి.సి ఉద్యమకారులకు ధిక్సూచి కావాలి. సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం అన్ని రకాల అవకాశాలు కల్పించే సమాజ నిర్మాణం కోసం ప్రాణ త్యాగం చేసిన మారోజు వీరన్న ఆశయాల స్పూర్తితో చట్టసభల్లో బి.సి వాటా సాధించడం కోసం తరతరాలుగా ఆధిపత్య వర్గాల అణచివేతకు గురై చెల్లాచెదురైన బి.సి సమాజాన్ని చైతన్యపరిచి ఐక్యం చేయాల్సిన అవసరముంది. పార్టీలకతీతంగా అన్ని పార్టీల, అన్ని సంస్థలలోని బి.సి లు, ఇతర ప్రగతిశీల సంఘాలు ఐక్యంగా ముందుకు సాగాలి. రాజకీయ పార్టీలలో కీలకపాత్ర పోషిస్తూ ఓట్లు వేయించే రెండవ స్థాయి నాయకులుగా కొనసాగుతున్న బి.సి లు కూడా ఈ ఐక్య ఉద్యమంలో పాల్గొని చట్టసభల్లో బి.సి వాటా సాధించాలి. మహిళా బిల్లులో బి.సి కోటా లేకుండా, ఇబిసి రిజర్వేషన్ల వల్ల, క్రిమిలేయర్ వల్ల బి.సి లకు ఎంత నష్టం జరుగుతుందొ బి.సి లకు వివరించి సమీకరించాల్సిన అవసరముంది. బి.సి ల అభివృద్ధి జరగాలంటే చట్టసభల్లో వాటా ద్వారానే సాధ్యమవుతుందనే వాస్తవాన్ని బి.సి సమాజం గుర్తించి ఉద్యమించాల్సిన అవసరముంది. ఆధిపత్య పాలకవర్గాలు ఓవర్ టైం పని చేస్తుంటే ఆ దుష్ట శక్తులను ఎదురుకునే పోరాటంలో ఉన్నవారు పూర్తి కాలం ఉద్యమంలో కొనసాగాల్సిన అవసరముంది. భారతదేశంలో విజయవంతమైన అన్ని ఉద్యమాల్లో పూర్తి కాలం  పని చేసిన వారే ఫలితాలు సాధించిన చరిత్రను అధ్యయనం చేయాలి. దేశంలో చివరిగా కాన్షీరామ్, మారోజు వీరన్ననే పూర్తి కాలం ఉద్యమాలు చేసారు. గత 25 ఏండ్లుగా దేశంలో అణగారిన ప్రజల కోసం పూర్తికాలం ఉద్యమాలు జరగకపోవడం వల్లనే మెజార్టీ ప్రజలైన బి.సి లు ఆధిపత్య రాజకీయ పార్టీల్లో బానిసలుగా కొనసాగుతున్నారు. వీరన్న బాటలో ఈ స్థితిని మార్చి పూర్తి కాలం ఉద్యమాల ద్వారా బి.సి ల విముక్తి కోసం చట్టసభల్లో బి.సి వాటా సాధించాల్సిన అవసరముంది. 

    మహాత్మా జ్యోతిబా పూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్, చదువుల తల్లి, ఆరోగ్య మాత సావిత్రి బాయి పూలేల నిజమైన వారసుడు మరోజు వీరన్న 25 వ వర్ధంతి మే 16 ను తెలంగాణలో బహుజన రాజ్య స్థాపన  చేసుకుందామని ప్రతి ఒక్క బహుజనుడు ప్రతిన బూని ప్రజల ఆపదను మన ఆపదగా, ప్రజల ప్రాణాలను మన ప్రాణాలుగా భావించి  ఉద్యమం చేయడమంటే ప్రభుత్వ విధానాలపై, కార్పొరేట్ దోపిడీపై, అగ్రవర్ణ దోపిడిపై పోరు చేయడమేనని భావించి పోరాటం చేసి బహుజన రాజ్యాన్ని స్థాపించడమే కామ్రేడ్ మారోజు వీరన్నకు నిజమైన నివాళి. 



(మే 16న మారోజు వీరన్న 25వ వర్ధంతి సందర్భంగా )

               

   సాయిని నరేందర్

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

   9701916091

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు