వీరమరణమే విజయం..!

 వీరమరణమే విజయం..!
విజయ్ దివస్ సందర్భంగా



అది ఉరకలెత్తే శౌర్యం..

ప్రత్యర్థిని బెంబేలెత్తించిన

వీరవిహారం..

కుత్సిత పాకిస్తాన్ సైన్యాల 

భరతం పట్టిన మహాభారతం..

ఒక చారిత్రక విజయం..

బంగ్లాదేశ్ కు బాసట..

దాయాది  వికృతవిన్యాసాలపై 

సమ్మెట!


కాని.. విజయోత్సాహం

నడుమ విషాదగీతిక..

మన దేశం కోసం..

మన సార్వభౌమత్వ

పరిరక్షణ దీక్షగా..

విజయమే ధ్యాసగా..

బంగ్లా విమోచనమే

అంతిమ లక్ష్యంగా

సాగిన మహా సంగ్రామంలో

అసువులు బాసిన 

వేలాది వీరులు..

భరతజాతి ముద్దు బిడ్డలు..

తల్లి భారతి

పాపిట వీరతిలకం..

3843 మంది 

అమరవీరుల 

పార్థివ దేహాలపై 

మువ్వన్నెల పతాకం..

శౌర్యమే సర్వంగా..

సగర్వంగా..!


మరణించినా ఆ మోములపై

చెరగని దరహాసం..

చెదరని దీప్తి..

పుట్టిన గడ్డ రుణం

తీర్చుకున్న తృప్తి...

అయ్యో..బ్రతికుంటే

ఇంకెన్ని విజయాలు

దేశానికి ఇచ్చేవాళ్ళమో..

ఇదే ఆర్తి..

అయినా 

ఆ ప్రాణత్యాగాలతో

దిగంతాలకు చేరిన మాతృభూమి కీర్తి..!


కన్నతల్లి మోసేది నవమాసాలే..

భూమి తల్లి మోసేది

కడవరకు..కట్టెకాలేవరకు..

ఆ రుణం 

తల కొరివితో తీరేది..

ఈ రుణం 

ఏ రూపాన తీరేది..

ఆ రూపమే జవాను..

త్యాగానికి మరో రూపు..

ఔను..జవాను కొలువు..

జాతి పరువు..

నిన్ను..నన్ను..

దేశాన్ని కాచే సైనికుడు..

ప్రాణాన్ని తృణప్రాయంగా

భావించే వీరుడు...

తప్పదేమో మరణం..

అయినా వెరపు 

ఎరుగని రణం..

ఏమిచ్చి తీర్చే రుణం

ఇదిగో..అశ్రుతర్పణం..!


💐💐💐💐💐💐💐


ఎలిశెట్టి సురేష్ కుమార్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు