చెర "సాక్షి"గా చెలిమి..! పొత్తు ఖాయం:పవన్

 

మరోసారి క్లారిటీ వచ్చేసింది..


ప్రస్తుతానికి బిజెపి సంగతి పక్కనబెడితే తెలుగుదేశం.. జనసేన కలిసి పోటీ చేస్తాయన్న సంగతి నికరం అయిపోయింది. పొత్తు ఉంటుందని పదేపదే చెబుతున్న జనసేనాని.. ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి పోటీ చెయ్యడం తథ్యమని మళ్లీ ఉద్ఘాటించారు.వైసిపి మరోసారి అధికారంలోకి రాకుండా చెయ్యడమే తన ఏకైక లక్ష్యమని పవన్ ఢంకా బజాయించారు.


టిడిపి.. జనసేన పొత్తు విషయంలో తన వైఖరి ఏంటో పవన్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు.

ఆ మధ్యన చంద్రబాబుతో సమావేశమై 

స్పష్టం చేశారు కూడా..!

ఎవరు ఎలాంటి కలరింగులు ఇవ్వనీ గాక పొత్తు విషయంలో..వైసిపి ఆట కట్టించాలనే పంతంలో

పవన్ కళ్యాణ్ గట్టిగా నిలబడిపోయారు.చంద్రబాబు అరెస్టు ఆయన చిత్తాన్ని ఎంతమాత్రం ప్రభావితం చేయలేకపోయింది.జైలుకు వెళ్లి తన సుహృద్భావాన్ని..

వైసిపి పట్ల వ్యతిరేకతను

ఆయన గురువారం నాడు గోదావరి సాక్షిగా బలంగా చాటారు.


పవన్ నైజం..

చంద్రబాబు ఇజం తెలిసిన పండితులు ఆ ఇద్దరి నేతృత్వంలోని పార్టీల మధ్య పొత్తు కుదరడం అంత సులువు కాదని..సీట్ల సర్దుబాటు..ముఖ్యమంత్రి పదవి విషయంలో ఎక్కడో ఒక దగ్గర తాడు తెగడం ఖాయమని ఊహాగానాలు చేశారు.వీటికి తోడు అధికార పార్టీ ఒక పథకం ప్రకారం  ప్రచారం సాగుంచి జనాన్ని మరింత అయోమయంలో 

పడేసే ప్రయత్నాలు విస్తృతంగా చేసింది.పవన్ వైఖరి కారణంగా తన ప్రత్యర్థి పక్షాల మధ్య పొంతన కుదరదు..అన్న నమ్మకంతోనే అదికార పక్షం ఇంతవరకు ఉంది.ఇక అలాంటి ఆశలన్నీ పటాపంచలైనట్టే..!


పవన్ కళ్యాణ్ తన బలమేంటో.. బలహీనతలేంటో స్పష్టంగా చెప్పారు.అదే సమయంలో తన లక్ష్యం ఏమిటో కూడా ప్రకటించారు.

ఈ విషయాలను జనసేనాని అధికారపార్టీకి మాత్రమే గాక 

తన సొంత పార్టీ శ్రేణులకు కూడా తెలిసి వచ్చేలా ఇంతకుముందే విడమరచి చెప్పారు.మనం ఎక్కడ ఉన్నాం..గత ఎన్నికల్లో ఏం సాధించాము అన్నది కార్యకర్తలకు స్పష్టం చేస్తూ

గతంలో మన పార్టీకి కనీసం పది సీట్లు కూడా తెచ్చుకోలేకపోయిన మనకి ముఖ్యమంత్రి పదవి అడిగే సీనుందా అంటూ తన మెచ్యూరిటీని ప్రకటిస్తూ పనిలో పనిగా క్యాడరుకూ చురకలు వేశారు.ఈసారి చిత్తశుద్ధితో పని చేసి విజయాలు సాధిస్తే వచ్చే ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి పదవి సంగతి చూసుకోవచ్చునన్న ధోరణి ముందే ఆయన మాటల్లో వినిపించింది.


ఇప్పటికైతే వైసిపి మరోసారి అధికారంలోకి రాకూడదనే తన వైఖరి స్పష్టం చేయడమే గాక అందుకు పొత్తు అనివార్యమని నిర్ద్వంద్వంగా ప్రకటించారు.సీట్ల విషయంలో తాము పెద్దగా పట్టు పట్టే పరిస్థితి ఉండదని ఇంతకుముందే స్పష్టం చేశారు.


ఇక బంతి చంద్రబాబు కోర్టులో ఉన్నట్టే.పవన్ స్టాండును అలుసుగా తీసుకోకుండా టిడిపి అధినేత తన సహజ రాజకీయ నైజాన్ని పక్కనబెట్టి పొత్తు విషయంలో పట్టువిడుపుల ధోరణి ప్రదర్శించాలి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో

వైసిపికి ఒంటరిగా ఎదురెళ్లి గెలిచే సీన్ తన పార్టీకి లేదన్న వాస్తవాన్ని గుర్తెరిగి చంద్రబాబు వ్యవహరించాలి.

ఇక్కడ తెలుగుదేశం పార్టీకి జరుగుతున్న మేలు ఇంకోటి కూడా ఉంది. అది కూడా పవన్ వల్లనే జరుగుతుంది.

అదేంటంటే పొత్తులో బిజెపి కూడా ఉండేట్టు కృషి చేస్తానని పవన్ చెబుతూ వస్తున్నారు.కొంతకాలం నుంచి మోడీకి దగ్గర కావాలని ఆశ పడుతున్న బాబుకి ఇది మంచి అవకాశం.ఈ కోణంలో ఆయన తన తెలివితేటల్ని.. సమయస్ఫూర్తిని కరెక్టుగా వాడితే బాగుంటుంది.


రాష్ట్ర ప్రయోజనాలే తనకు అన్నిటి కంటే ముఖ్యమని చెప్పే బాబు ..తన మాటలు నిజమని రుజువు చేసుకునే సమయం..అవకాశం ఇప్పుడే..ఇదే..

ఏది ఏమైనా బాబు ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డారు.అదే సమయంలో జరుగుతున్న పరిణామాలను..అరెస్టుతో కొన్ని వర్గాల ప్రజల్లో ఏర్పడిన సానుభూతిని ఖచ్చితంగా

అంచనా వేసుకుంటూ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

అలిపిరి ఉదంతంలా తప్పుడు అంచనాలకు వెళ్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.


బాబూ బహుపరాక్..!


సురేష్..జర్నలిస్ట్..

    9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు