మోకాళ్ళ నొప్పుల మందు కోసం క్యూ కడుతున్న జనాలు - కొత్త కోటలో డాక్టర్ కరెంట్ రాములు మందు

 


మోకాళ్ల నొప్పుల నివారణకు కరెంట్ రాములు మందు
    కొత్త కోటలో క్యూకడుతున్న జనాలు

మోకాళ్ల నొప్పులు ఈ రోజుల్లో చాలా మందిని వేధించే ఆతి పెద్ద అనారోగ్య సమస్య. ఖరీదైన అనారోగ్య సమస్య కూడ ఇదే. గతంలో గుండె సంభందిత రోగాల చికిత్సకు జనాలు ఖర్చుతో కూడుకున్న పని అని భయపడే వారు.

ఇప్పుడు మోకాళ్ల నొప్పుల సమస్య అంటే హడలెత్తి పోతున్నారు. ఈ సమస్య తలెత్తిందంటే వారి భాదలు వర్ణణాతీతం. అడుగు తీసి అడుగు వేయలేరు. ప్రారంభంలో కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకుని కొద్ది పాటి ఎక్సర్ సైజులు చేస్తూ మసాజ్ లు చేసుకుంటూ రోగం ముదురకుండా కాపాడు కునే వారి పరిస్థితి కాస్త నయంగా ఉంటుంది. కాని రోగం ముదిరి పోయి మోకాళ్లలో గుజ్జంతా అరిగి పోయిన వారికి మాత్రం సర్జరీకి వెళ్లాల్సిందే. మోకాళ్ల చిప్పల మార్పిడి శస్త్ర చికిత్సలు చాలా కాస్ట్లీ వ్యవహారంగా మారింది.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో మోకాళ్ల నొప్పులకు చిప్పల మార్పిడి పెద్ద పెద్ద వ్యాపారంగా మారింది. ఒక్కో మోకాలి చిప్ప మార్పిడి లక్షల్లో ఖర్చు వస్తోంది. కనీసంగా 3 లక్షల నుండి 6 లక్షల వరకు ఖర్చు వస్తోంది. రెండు మోకాళ్ళ చిప్పల మార్పిడి కి ఎంత లేదన్నా 8 నుండి 12 లక్షల ఖర్చు వస్తోంది.ఓ నెల  రెండు నెలల పాటు చిప్పల మార్పిడి తర్వాత రెస్టు అవసరం. షుగర్, బిపి ఉంటే వారి భాదలు వేరేగా ఉంటాయి. వైద్యుల పర్యవేక్షణ మేరకు నడుచు కోవాలి.  మోకాలి చిప్పల మార్పిడి అనంతరం ఒక్కో వ్యక్తి అనుభవం ఒక్కో రకంగా ఉంటోంది. కొందరు మామూలుగా ఉంటుందంటున్నారు.  కాస్త ఫర్వాలేదులే అంటున్నారు. మరి కొందరు ఇంకా నొప్పులు ఉన్నాయంటూ ఇలా రకరకాలుగా చెబ్తున్నారు. చాల మంది శస్త్ర చికిత్సల భాదలు తట్టుకోలేమంటూ నొప్పుల నివారణకు మందులు వేసుకుంటూ గడుపుతున్నారు. పైగా ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పనికావడంతో ఆర్థిక సమస్యలు ఉన్నవారు శస్త్ర చికిత్సల జోలికి వెళ్లడం లేదు.

కరెంట్ రాములు ధన్వంతరి మందులుఇలాంటి పరిస్థితుల్లో ఈ మద్యే వాట్సాప్ గ్రూపుల్లో ఓ వ్యక్తి పెట్టిన వీడియో బాగా వైరల్ అయింది. చాలా సంవత్సరాలుగా మోకాళ్ళ నొప్పులతో భాదపడతున్న ఓ 72 సంవత్సరాల పెద్ద మనిషి తన మోకాళ్ళ నొప్పులపై ఓ వీడీయో పెట్టాడు. కూర్చుంటే లేవలేని స్థితిలో ఉన్న  తనకు వనపర్తి జిల్లా కొత్తకోట లో రాములు అనే ఆయర్వేద వైద్యుడు ఇచ్చిన మందు బాగా పని చేసిందని  ఈ మందు వాడిని తర్వాత మొకాళ్ళ నొప్పులు నయం అయ్యాయని వీడియోలో చెప్పుకొచ్చాడు.

ఈ వీడియో వాట్సాప్ గ్రూపుల్లో బాగా వైరల్ అయింది.

ఈ వైద్యుడు ఫీజు లేకుండా తక్కువ ఖర్చుతో అంటే తానిచ్చే మందులకు మాత్రమే డబ్బులు తీసుకుంటూ వైద్యం చేస్తున్నాడని ప్రచారం జరిగింది.

ఈ వీడియో నాకు కూడ మా భందువులు వాట్సాఫ్ గ్రూపులో పంపించారు.  విషయం తెల్సుకుందామని కొత్తకోట చుట్టుపక్కల ఉండే మీడియా మిత్రులను సంప్రదించాను. అయితే ఈ వార్త ప్రధాన మీడియాలో రాక పోవడంతో వారికి కూడ సమాచారం లేక కొత్తకోటలో ఉన్న వారిని అడిగి విషయం తెల్సుకున్నారు. ప్రతి చిన్న విషయాన్ని వైరల్ గా మార్చే యూట్యూబ్ బ్యాచికి  ఇంకా ఈ మోకాళ్ల నొప్పుల నివారణ మందు పై దృష్టి పడ లేదు.  ఇక అటు ఇటుగా  మొదలు పెడతారు. కొత్తకోట వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలో ఉంటుంది. అక్కడ నా మిత్రుడు  నేను మహబూబ్ నగర్ లో పనిచేసినపుడు నాతో కల్సి ఆంధ్రప్రభలో పనిచేసిన బాలస్వామి కొంత సమాచారం ఇచ్చాడు. రాములు అనే వ్యక్తి గురించి అడిగితే తనకు సమాచారం లేదని అయితే కొత్తకోట గ్రామస్తులను అడిగి కొంత సమాచారం సేకరించి వివరాలు చెప్పాడు. గత రెండు మూడు రోజులుగా రాములు అనే వైద్యుడు మోకాళ్ళ నొప్పులకు మందులు ఇస్తున్నాడని  అతన్ని కరెండ్ రాముల అని పిలుస్తారని ఈమద్యే బాగా ప్రచారంలోకి వచ్చాడని చెప్పాడు.   

ఎందుకైనా మంచిదని కొత్తకోటకే వెళ్లి అసలు ఏం జరుగుతుందో చూడాలని నిర్ణయించుకుని  మోకాళ్ళ నొప్పలున్న మా  భందువులను ఇద్దిరిని వెంట పెట్టుకుని  హైదరాబాద్ నుండి  బయలు దేరి కొత్తకోటకు వెళ్ళాను.

ఉదయం మేము వెళ్ళే సరికి ఆ వైద్యుడి ఇంటి చుట్టుపక్కల కార్లే కార్లు. చాలా మందే వచ్చారు. కొందరు బస్సుల్లో ఆటోల్లో కూడ దూర ప్రాంతాల నుండి వచ్చారు. ఆ వైద్యుడి ఇళ్లు ప్రస్తుతం పై అంతస్తు స్లాబ్ పడుతుండడంతో పక్కనే ఓ చిన్న గదిలో కూర్చుని రోగులను పరీక్షించి  మందులు ఇస్తున్నాడు. బయట కొందరు పిల్లలు ముందుగానే డాక్టర్ ను కలవాలకున్న వారికి  అప్పాయింట్ మెంట్ స్లిప్పులు ఇస్తున్నారు. పీజు మాత్రం పెద్దగా వసూలు చేయడం లేదు. నామమాత్రంగా ఒక్కొక్కరి నుండిరూ. 20 వసూలు చేసి నంబర్లు వేసి టోకెన్ ఇస్తున్నారు.  మేమూ రెండు టోకెన్లు తీసుకున్నాం. మేము వెళ్లే సరికే  అక్కడ బయట జనాలు చాలా మందే టోకెన్లు తీసుకుని చుట్టుపక్కల ఇండ్ల ముందు చెట్ల కింద వేచి చూస్తు  కనిపించారు.

 

అక్కడికి వచ్చిన వారిని చాలా మందిని అడిగాం అందరూ వాట్సాఫ్ లో వచ్చిన పెద్ద మనిషి వీడియో చూసి వచ్చామని చెప్పారు. మేము వెళ్లిన సమయంలో రాములును కలిసేందుకు కొత్తకోటమాజి సర్పంచ్ (2001 లో పనిచేసాడు) మరో స్థానిక నాయకుడు అక్కడికి వచ్చారు. వారిని పరిచయం చేసుకుని రాములు గురించి వివరాలు అడిగాను. రాములు తాను సర్పంచ్ గా ఉన్నపుడు కరెంట్ పనులు చేసే వాడని అందుకే అందరూ కరెంట్ రాములు అని పిలుస్తారని ఆ మాజి సర్పంచ్ చెప్పాడు. వైద్యం గురించి అడిగితే ఈ మద్యే జనాలు బాగా రావడం చూస్తున్నామని అన్నారు. మందు పనిచేస్తుందా లేదా అనే విషయంలో వారికి కూడ అంతగా విషయం తెలియదని వారి మాటల్లో అర్దం అయింది. రాములు ఇంటికి ఎక్కడెక్కడి నుండో జనాలు వస్తున్నారని తెల్సి వచ్చామని స్థానిక నేతలు చెప్పారు.

అక్కడే ఉన్న ఓ యువకుడు మాత్రం రాములు చాలా కాలంగా అయుర్వేద వైద్యం చేస్తున్నాడని అన్ని రకాల రోగాలకు మందులిస్తారని చెప్పాడు. ఈ మద్య మోకాళ్ళ నొప్పల మందు బాగా ఫేమస్ అయిందన్నారు. గతంలో ఓ మారు డిల్లీకి కి చెందిన వారు వచ్చి రాములు ఇచ్చే మందులు చూసి వీటిని ఢిల్లీకి తీసుకు వెళ్లి లాబుల్లో పరీక్షలు నిర్వహించారని అందులో వాడే మూలికలు మంచి మందులే అని సర్టిఫికేట్ కూడ ఇచ్చారని ఆయువకుడు తనకు తెల్సిన విషయాలన్ని చెప్పుకొచ్చాడు.

జనాలు క్యూ కట్టి ఉండడంతో రద్దీలో రాములును కలవ లేక స్థానిక నేతలు తర్వాత వస్తా మంటూ అక్కడి నుండి వెళ్లి పోయారు.

విచిత్ర మేమంటే అక్కడికి ఓ నలుగురు వ్యక్తులు సిఎం పేషీ నుండి రికమెండేషన్ తో వచ్చారని అక్కడ వేచి ఉన్న వారు చెప్పారు. క్యూలో  కాకుండా నేరుగా వారు లోనికి వెళ్లే టపుడు అక్కడున్న వారు గొడవ కూడ చేశారు. వారికి చిన్నగా నచ్చ చెప్పి డాక్టర్ సహాయకుడు టోకెన్లను పక్కన పెట్టి వారిని నేరుగా డాక్టర్ వద్దకు పంపించారు. వారు డాక్టర్ ను కల్సి  మందులు తీసుకు వెళ్లారు.

అక్కడికి వచ్చిన వారి అనుభవాలు తెల్సుకునే ప్రయత్నాలు చేస్తే చాలా మంది మొదటి సారే వచ్చామని చెప్పారు. ఓమహిళ మాత్రం తాను రావడం ఇది రెండో సారని గత నెల మందు వాడానని కొంచెం ఫలితం కనిపించిందని చెప్పారు.

ఫీజు నామమాత్రం అయినా మందులకు వందల్లో

డాక్టర్ ఫీజు నామమాత్రంగా రూ. 20 అన్నమాటే కాని మందులకు మాత్రం వందలకు వందలు తీసుకుంటున్నారని అక్కడికి వచ్చినా వారు చెప్పారు. మోకాళ్ళ నొప్పులకు రూ. 1300 వరకు కనీసంగా తీసుకుంటున్నారు.  ఇంకా వేరే రోగాలు ఏమన్నా ఉంటే వాటికి అదనంగా తీసుకువని మందులు ఇస్తున్నారు.

డాక్టర్ ను సంప్రదించి మరిన్ని వివరాలు తెల్సుకునే ప్రయత్నం చేసాను కాని వీలు కాలేదు.  ఎక్కడెక్కడి నుండో వచ్చిన జనాల రద్దీ ఉండడం డాక్టర్ వారిని పరీక్షించి మందులు ఇవ్వడంలో క్షణం తీరిక లేకుండా ఉండడం చూసి ఆ సమయంలో స్వయంగా కల్సి మాట్లాడడం వీలు కాదని ఆతన్ని కలిసే ప్రయత్నం కూడ చేయలేదు. డాక్టర్ సహాయకులను అడిగితే డాక్టర్ పబ్లిసిటీకి దూరమని అయినా చూస్తున్నారు కదా మీరే మరే సమయంలో నైనా జనం రద్దీ లేనపుడు వచ్చి కలవ వచ్చన్నారు.

 ఇక్కడ పూర్తిగా తెల్సుకోవాల్సింది ఆ డాక్టర్ ఇచ్చే మందు పని తనం గురించి. అది వాడిని వారు చెప్పితే తెలుస్తుంది. నాతో వచ్చిన మా భందువులు చాలా సేపు వేచి చూసి  వారి టోకెన్ నెంబర్ రావడంతో లోనికి వెళ్ళి డాక్టర్ను కల్సి  మందులు తీసుకున్నారు.  మోకాళ్ళ నొప్పులకు 9 నుండి 10 నెలల పాటు మందులు వాడాలని వారికి చెప్పారు. చేయాల్సిన పత్యం గురించి కూడ వారుచెబుతున్నారు. ఏ ఏ వస్తువులు తిన కూడదో వివరాలతో కూడిన ఓ జాబితా బయట గోడకు అంటించారు. అట్లాగే దూర ప్రాంతాల నుండి రెండో సారి రాలేని వారి కోసం కొరియర్ లో మందులు పంపే సౌకర్యం కూడ ఏర్పాటు చేస్తూ కొరియర్ సర్వీసు ఫోన్ నెంబర్లతో సహా మరో కాగితం గోడకు అంటించారు.

మొదటి సారి వచ్చిన పేషంట్లకు ఓ పేజి నెంబర్ చెప్పి అదే రెఫరెన్సు నెంబర్ అని చెబుతున్నారు. కొరియర్ లో మందులు కావల్సిన  వారు ఈ పేజి నెంబర్ చెప్పి డబ్బులు వేస్తే కొరియర్ ద్వారా మందులు  పంపిస్తామన్నారు.   

మందు పని తీరు తెలియాలంటే సమయం పడుతుంది

కరెంట్ రాములు మోకాళ్ళ మందు ఎట్లా పనిచేస్తుంది  తెల్సుకోవాలంటే కొద్ది రోజులు పడ్తుంది. కనీసం ఓ నెల రెండు నెలల పాటు మందు వాడిన వారు వారి అనుభవాలు వెల్లడిస్తే తప్ప వాస్తవాలు గ్రహించలేం.  మందు  వాడిన వారి అనుభవాలు తెల్సుకుని వివరాలు తిరిగి మీ ముందుంచే ప్రయత్నాలు చేస్తాను.

ఆడాక్టర్ కున్న డిగ్రీలు ఏమిటి....అర్హతలు ఉన్నాయా రిజిస్టర్డ్ ప్రాక్టీషనరా  ఆయనిచ్చే మందులో అసలు ఏ ఔషధాలు వాడుతున్నాడు ఇవన్ని  కూడ తర్వాత వివరాల్లో నేను తెల్సుకుని మీకు తెలియ చేసే ప్రయత్నాలు చేస్తాను. వాటితో పాటు ప్రధానంగా మందు వాడిన వారి అనుభవాలు వారు చెప్పిన  వివరాలు తదుపరి ఆర్టికల్ లో వివరిస్తాను.

అనందయ్య  మందు లాగే కరెంట్ రాములు మందు

కొత్తకోటలో డాక్టర్ రాములు  మందు విషయం  చూసిన తర్వాత కరోనా సమయంలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఆనందయ్య  గుర్తుకు వచ్చాడు. ఆయన తయారు చేసిన  మందు విషయంలో చాలా రోజుల పాటు చర్చ సాగింది. ఆయుర్వేద నిపుణులు ఆయన మందును పరీక్షించారు. చివరికి హై కోర్టు కూడ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.  మందు పై అనేక భిన్నాభిప్రాయాలు కూడ వచ్చాయి.
ప్రస్తుతం రాములు మందుకు ఇంకా డిమాండ్ పెరిగితే ఇక్కడ కూడ ప్రబుత్వం కలుగ చేసుకునే పరిస్థితి రావచ్చు. ఆయన ఇచ్చే మందుపై పరీక్షలు కూడ జరగవచ్చు. ఆయన అర్హతలపై కూడ ప్రభుత్వం అరా తీసి విచారణ చేయవచ్చు. అయితే తర తరాల నుండి  కుటుంబ వారసత్వంగా కొందరు గ్రామాలలో ఎలాంటి డిగ్రీలు లేకుండా  తమ పూర్వీకుల నుండి నేర్చుకున్న  దానితో వైద్యం చేసే కుటుంబాలు ఉన్నాయి.  వారిచ్చే మందు విషయం లో వాటి పని తనం ఆచరణలో తేలాల్సిందే తప్ప ఇతరత్రా వేరే మార్గాలు లేవు.

Mahender Kuna
journalist 
(ఈ రచయిత ఇండిపెండెంట్ జర్నలిస్ట్)
 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు