ఇదీ సినిమా క(వ్య)థ..!

 ఇది నిర్మాతల పరిశ్రమ.
నిర్మాత బాగుంటేనే ఫీల్డ్


నాలుగు కాలాల పాటు పచ్చగా ఉంటుంది.

నటులు ఎందరైనా వస్తారు.కానీ నిర్మాతలు అలా కాదు.నష్టపోతే కష్టపడతారు.తట్టుకోలేరు..అప్పుల పాలైపోతారు.. నెమ్మదిగా తప్పుకుంటారు.

కొత్తవాళ్ళు రావడం కష్టం.ఉన్నవాళ్ళని నిలబెట్టుకోవాలి.


బాలీవుడ్ సంగతేమో కాని

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్..అక్కినేని..

కృష్ణ..శోభన్ బాబు.. 

కృష్ణంరాజు మొదలుకుని చిరంజీవి..బాలకృష్ణ..

నాగార్జున..వెంకటేష్..

జగపతిబాబు ఇత్యాదుల వరకు అదే ధోరణితో నడవడం వల్లనే తెలుగు సినిమా ఈరోజు వరకు పచ్చగా నడిచింది.


తెలుగు పరిశ్రమ అనే కాదు

తమిళంలో..హిందీలో కూడా ఎన్నో సినిమాలు తీసిన

జెమినీ..ఎవిఎం..వాహినీ..

విజయా..సురేష్..

పద్మాలయా సంస్థలు ఎంతో నిబద్ధంగా..బడ్జెట్ పై ఖచ్చితమైన నియంత్రణతో సినిమాలు తియ్యడం వల్లనే ఆయా సంస్థలతో పాటు దక్షిణాది పరిశ్రమలు ఇంతకాలం పాటు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లాయి..!


ఇక్కడే మరో చిన్న విషయాన్ని ప్రస్తావించడం అనివార్యం..ఎన్టీఆర్.. ఏయెన్నార్ మాంచి ఊపుమీదున్న రోజుల్లో

అయిదు వేల రూపాయలు పారితోషకం పెంచడానికి నిర్మాతల్ని ఆయన ఇంటికో..

ఈయన ఆఫీసుకో టీకి పిలిచి

చాలా ఇబ్బందిగా విషయం చెప్పేవారట.నెల జీతాల నుంచి మొదలైన 

ఆ అగ్రహీరోల ప్రస్థానం మహానటుల స్థాయికి వెళ్లిన తర్వాత కూడా పారితోషకం ఇబ్బడిముబ్బడిగా పెంచిన సందర్బాలు లేవు.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు నటించిన నా దేశం సినిమాకి గాను అత్యధిక పారితోషికం తీసుకున్నారట.ఆ తర్వాత మేజర్ చంద్రకాంత్ సినిమాకి ఎక్కువ తీసుకున్నట్టు కథనాలు ఉన్నాయి.

అది కూడా ఈరోజున 

అల్లరి నరేష్..

శర్వానంద్..తదితరులు తీసుకుంటున్న మొత్తం కంటే చాలా తక్కువ..ఇంకా చెప్పాలంటే స్టార్ కమేడియన్ల రెమ్యూనరేషన్ తో పోల్చినా తక్కువేనేమో.

ఇక కృష్ణ అయితే నిర్మాత నష్టపోకుండా తాను తీసుకున్న పారితోషకంలో

కొంత వెనక్కి తిరిగి ఇవ్వడం..లేదంటే మరో సినిమా తక్కువ పారితోషకానికి చెయ్యడం..

ఇలా జరిగేదట.. అలా ఉండేది ఆనాటి పరిశ్రమ..!


ఇప్పుడు హీరోలు..కోట్లలో పారితోషకం...విదేశాల్లో షూటింగులు..అంతులేని సౌకర్యాలు..పద్ధతీ పాడు ఉండని బడ్జెట్..

భారీ సెట్టింగులు..

ఆపై అవసరం ఉన్నా లేకపోయినా గ్రాఫిక్స్..

చిత్రీకరణలో

ఎడతెగని జాప్యం.. తడిసిమోపెడయ్యే ఖర్చులు..హీరోలను అనుసరించి ఇతర నటులు..

టెక్నీషియన్లు అందరి రేట్లు రెట్లు పెరిగిపోయాయి.

రామారావు..నాగేశ్వరరావు..కృష్ణ..శోభన్ వంటి వారు ఎన్నో సినిమాలు హిట్టయిన తర్వాత పెద్ద హీరోలు..స్టార్ హోదా..ఇప్పుడు ఒకటో రెండో సినిమాలు హిట్టయితే 

సూపర్ స్టార్స్..ఈరోజున పెద్ద హీరోలుగా చలామణి అవుతున్న మహేష్ బాబు..పవన్ కళ్యాణ్..

జూనియర్ ఎన్టీఆర్..బన్నీ..

ప్రభాస్..రామ్ చరణ్..వీళ్ళు చేసిన సినిమాలు ఎన్ని..

వాటిలో హిట్టు కొట్టినవి ఎన్నెన్ని..నిర్మాతల్ని బాగుపరచినవి ఇంకెన్ని..

మరి వారి పారితోషికాలు ఏ స్థాయిలో ఉన్నాయి.పైగా పానిండియా సినిమా..

పానిండియా స్టార్స్ అంటూ భుజకీర్తులు..హీరోలు బానే ఉన్నారు..నిర్మాతలే మట్టికొట్టుకుపోతున్నారు.

ఎమ్మెస్ రెడ్డి..ఎమ్మెస్ రాజు..

జగపతి ఫిలిమ్స్..నిన్న మొన్నటి వరకు సినిమాలు తీసిన ఇలాంటి సంస్థలు.. నిర్మాతల పేర్లు అలా ఉంచితే 

బాబు మూవీస్..రవీంద్ర ఆర్ట్ పిలిమ్స్..సమతా..

యువచిత్ర..సత్యచిత్ర..

ప్రతాప్ ఆర్ట్స్..చిన్నప్ప దేవర..పద్మశ్రీ..

ఇలా ఎన్ని సంస్థలు తెరమరుగైపోయాయో.

ఎందరు నిర్మాతలు

తెర వెనక్కి వెళ్ళిపోయారో..

ఇప్పుడు నిర్మాణ రంగమే కాదు..పంపిణీ..ప్రదర్శన రంగాల్లో ఇప్పటికీ నెట్టుకొస్తున్న వ్యక్తులు..

అల్లు అరవింద్..సురేష్ బాబు..దిల్ రాజు..!.


ఇతర రంగాలలో బాగా సంపాదించి సినిమా రంగంపై మోజుతో ఇటు వైపు వచ్చిన

పెద్ద సంస్థలు ఒక్కోసారి కోట్లు పోయినా లెక్కలేకుండా సినిమాలు తీస్తుండడం వల్లనే భారీ ఖర్చుతో సినిమాలు వస్తున్నాయి.

అయితే ఇక్కడే ఒక పాయింట్..అలాంటి సంస్థలకు సినిమా ఒక వ్యాపారం.కమిట్మెంట్ ఉండదు.కథ ఏమిటి..

నటీనటులు ఎవరు..

పాటలు..సంగీత దర్శకులు..

ఇలాంటి విషయాల్ని పట్టించుకోరు నిర్మాతలు.ఒక విధంగా దర్శకుణ్ణి నమ్మి అతడి దోసిట్లో కోట్లు కుమ్మరించి తీసేస్తున్నారు.

హిట్టయితే మరో సినిమా..పోయినా వారి సొంత వ్యాపారాలు ఉండనే

ఉంటాయి.


ఇప్పుడు దర్శకుల సంగతి.

సినిమా రంగానికి కొత్త దర్శకులు కోకొల్లలుగా వస్తున్నారు.ఒకటి రెండు సినిమాలు బాగానే తీస్తారు.

ఫ్రెష్ ఆలోచనలు కదా.మొదట్లో ఒకటో రెండో సినిమాలు కొంచెం కొత్తగా తీసిన తర్వాత బుర్ర పాటబడిపోతుంది.ఇక మూస సినిమాలు..ఆపై హీరోల ఇమేజ్ చట్రంలో పడిపోయి హీరోయిజం పెంచే ప్రయత్నంలో పడి ఒకే తరహా సినిమాలు తీసి ప్లాపుల బాట పట్టేస్తారు.బొమ్మరిల్లు భాస్కర్..వివి వినాయక్..

దశరథ్..ఇలాంటి దర్శకులు ఈ కోవలోకి వస్తారు.ఇదిగో..మొన్నటికి మొన్న కొరటాల శివ హీరో ఇమేజ్ చట్రంలో పడి ఆచార్య తీసి ఏం వెలగబెట్టాడో చూసాం.

బోయపాటి శ్రీను కేవలం బాలకృష్ణ..ఫ్యాక్షనిజం..

అంతే.. అది దాటి రాలేకపోతున్నాడు.రాజమౌళి..త్రివిక్రమ్..ఈ ఇద్దరే ఇప్పటి తరంలో ఇంకా తమదైన ఆలోచనలతో

సినిమాలు తీస్తూ హిట్లు కొడుతున్నారు.వీళ్లలో త్రివిక్రమ్ అతికి వెళ్లి జల్సా..ఖలేజా .. అజ్ఞాతవాసి..

అరవిందసమేత సీత..

వంటి ప్రయోగాలు చేసి నిర్మాతల్ని ముంచిన ఉదంతాలు లేకపోలేదు.

ఇక రాజమౌళి సంగతి..అదృష్టవశాత్తు

ప్రస్తుతం ఆయన హవా బాగానే నడుస్తోంది.అయితే ఎన్నాళ్ళిలా..నిర్మాణంలో విపరీతమైన జాప్యం..కోట్లలో  పెరిగిపోయే ఖర్చు.. అక్కడి నుంచి హైప్ క్రియేట్ చేసుకోడానికి మళ్లీ భారీ వ్యయం..రకరకాల స్టంట్లు..

రాజమౌళి వంటి వారి వల్ల ఇండస్ట్రీకి పెద్దగా ఒరిగేదేమీ ఉండదు.తీసేవి ఎన్ని..

తెలుగు సినిమా..భారతీయ సినిమా స్టామినా ఏమిటో చెప్పవచ్చు గాని ఒక్కసారి ఒక్క సినిమా ఫెయిలైతే నిర్మాతల పరిస్థితి ఏంటి.

అతగాడి ఇమేజ్ ఏమవుతుంది.మళ్లీ అతడి మీద పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు సాహసిస్తారా..

మొహమాటం లేకుండా చెప్పాలంటే రాజమౌళి సినిమాల్లో ఉండే కథాబలం ఎంత..కథలో సత్తా లేకుండా

కల్పనలతో..కిచిడీ కథలతో..

గ్రాఫిక్స్..ఇతర మ్యాజిక్కులు చేసి ఎన్నాళ్ళు బండి నడపగలడు..


ఇదిగో ఇప్పుడు..

రాజమౌళిని చూసి వాతపెట్టుకుని తీసిన సినిమా ఆదిపురుష్..

ఎలా తీసినా పర్లేదు..కోట్లు గుమ్మరించి..గ్రాఫిక్స్ తో తీసేస్తే సినిమా జనం చూసేస్తారన్న ఆలోచన ఒక విధ్వంసానికి కారణం అయింది.ఈ ట్రెండ్ మంచిది కాదు.సినిమా అంటే ఎన్నో విభాగాల సమాహారం.అన్నీ బాగుంటేనే సినిమా హిట్టవుతుంది.అవేవీ పట్టించుకోకుండా కోట్ల బడ్జెట్..గ్రాఫిక్స్..ఇలాంటి హంగులను నమ్మి తీస్తే ఇలాంటి డిజాస్టర్లే..

ఈ తరహా పోకడలు పరిశ్రమకు మంచివి కావు.


నిర్మాత బాగుంటేనే పరిశ్రమ బాగుంటది.. నాగయ్య నుంచి నేటి వరకు అదే కాన్సెప్ట్..అది దాటితే లక్ష్మణరేఖ దాటేసినట్టే..!


          సురేష్ కుమార్

              9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు