విద్వేష ప్రసంగాలు చేస్తే ఇక కటకటాలే

 


విద్వేష ప్రసంగాల విషయంలో సుప్రీం  కోర్టు కీలక ఆదేశాలు జారి చేసింది. విద్వేష ప్రసంగాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని  సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

విద్వేష ప్రసంగాలు చేసేవారిపై కేసులు నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఫిర్యాదులు రాకున్నా సుమోటోగా కేసులు పెట్టాలని దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

కేసుల నమోదులో ఉదాసీనంగా వ్యవహరిస్తే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. దేశ లౌకిక నిర్మాణాన్ని విద్వేష ప్రసంగాలు దెబ్బతీస్తాయని సుప్రీంకోర్టు వెల్లడించింది. విద్వేష ప్రసంగం అనేది తీవ్రమైన నేరం అని అభివర్ణించింది. పలు విద్వేష ప్రసంగాల కేసుల విచారణ సందర్భంగా సుప్రీం ఈ మేరకు పేర్కొంది.

దేశంలో ద్వేషపూరిత ప్రసంగాల నేరాలపై దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు సుదీర్ఘంగా విచారించింది. ద్వేషపూరిత ప్రసంగాలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపిస్తూ దాఖలైన ధిక్కార పిటిషన్‌పై సుప్రీం బెంచ్ ఇంతకుముందు మహారాష్ట్ర ప్రభుత్వం నుండి స్పందన కోరింది. ప్రసంగకర్త మతంతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. తద్వారా రాజ్యాంగం ప్రవేశిక ద్వారా ఉద్దేశించిన భారతదేశం యొక్క లౌకిక స్వభావం పరిరక్షించబడుతుందని న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఇవాళ తెలిపింది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు