ఊర కుక్కల బెడద - కరిస్తే ఇక అంతే సంగతులు

 ర్యాబిస్  దాని నియంత్రణ పై దృష్టి అవసరం  



తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత  ఊర్లలో పందుల బెడద కొంత వరకు  తగ్గింది. కాని ఊర కుక్కల బెడద మాత్రం అట్లాగే  ఉంది. చిన్న చిన్న పల్లె టూర్లు మొదలు పట్టణాలు నగరాల వరకు ఊర కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చాలా చోట్ల ఇవి చిన్న పిల్లల వెంట పడి  దాడి చేసి  కరవడం, చంపడం చేస్తాయి. అయినా జంతుకారణ్య సంస్థలు వీటిని చంపకూడదని వాటిని సంరక్షించాలని వాటికి రోగాలు రాకుండా వ్యాక్సిన్ ఇప్పించాలని  సూచిస్తుంటాయి. కానీ మనుషుల సంరక్షణకే దిక్కు లేని వ్యవస్థలో ఊర కుక్కల గురించి అంత శ్రద్ధ చూపడం వాటిని సంరక్షించడం  చాలా అరుదైన విషయంగానె చెప్పొచ్చు . అందుకోసమే ఈ కుక్కల ద్వారా రాబిస్   ప్రబలి అంతటా వ్యాపిస్తుంటుంది. 

 దేశం మొత్తంగా పరిశీలిస్తే  ప్రతి ఏటా  15,000 నుండి 20,000 మంది రాబిస్ సోకి చనిపోతున్నారు.  హైదరాబాదు  నగరంలో అయితే ఇంటింటికి పెంపుడు కుక్కలు సర్వ సాధారణం అయిపోయింది. మధ్య తరగతి వారితో పాటు ధనికులు ఉండే  కాలనీలలో  కుక్కల బెడద   ఉంటుంది. రాత్రి వేళ టూ వీలర్స్  మీద పోతే వెంట పడి తరుముు తుంటాయి.  ఆ విధంగా వాటిని తప్పించుకునే ప్రయత్నంలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు  కూడా జరుగు తుంటాయి. కుక్కలతో  ప్రధానంగా వచ్చే అతి పెద్ద సమస్య  రాబిస్. రాబిస్ అనేది ఓ వైరస్. అది కుక్క కరిస్తే మనుషులకు సోకుతుంది.  మనిషి శరీరంలోకి రాబిస్ వైరస్ ప్రవెశిస్తే చావడం ఖాయం. ర్యాబిస్ వ్యాధితో మనుషులు చనిపోవడం చాలా భయంకరంగా ఉంటుంది. కుక్క చావు చస్తారు అంటారు కదా అదే ఈ  అత్యంత భయంకరమైన చావు. 

కుక్క కాటు వల్ల 15 సంవత్సరాల పిల్లలకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. మామూలుగా కుక్కలను చూసి పిల్లలు భయపడుతుంటారు. వాటిని చూసి పరుగెత్తుతే కుక్కలు వారిని వెంబడించి కరుస్తుంటాయి. ఈ మద్య రాష్ర్టంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి.  రాబిస్ ఉన్న కుక్కలు కరిస్తే త్వరగా ఒక్కరోజులోనే  ఇమ్మునిగ్లిబులిన్ ఇంజక్షన్  ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే వ్యాక్సిన్ మూడో రోజు, ఏడో రోజు, 14వ రోజు ఇస్తారు.  ఇట్లా కాకుండా కుక్క కాటుకు గురైన వారి  శరీరంలోకి కుక్క కాటు ద్వారా రాబిస్ ప్రవేశించిన వారికి  28వ రోజుల లోపల  ఈ అయిదు షాట్స్ ఒకేసారి ఇచ్చే అవకాశం కూడా ఉంది 

ఆరోగ్య పరిరక్షణ  రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం  కాబట్టి ఈ రాబిస్ గురించి దేశవ్యాప్తంగా కేంద్రం  ఎలాంటి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయ లేదు. 

రాబిస్ నుండి కాపాడేందుకు రెండు రకాల విధానాలు ఉన్నాయి.పైన చెప్పిన విధంగా వ్యాక్సిన్ నుండి రక్షణకు  కుక్క కాటు తర్వాత ఇంజక్షన్లు బొడ్డు చుట్టూ ఇవ్వడం లేక చర్మం పై నుండి ఇవ్వడం మొదటి విధానం. రెండో విధానంలో ముందు చూపుగా పిల్లలకు ఇచ్చే ఇతర వ్యాక్సిన్ లాగానే తీసుకోవచ్చు కానీ ఇలాంటివి అత్యంత అత్యవసర పరిస్థితుల్లోనే తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఇవి సాధారణంగా జంతువులతో పని చేసే డాక్టర్లకు ఇతర సిబ్బందికి ఇస్తారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలో ఆరు రకాల ర్యాబిస్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా బాతులు, కోళ్లు మరియు ఈ ర్యాబిస్ కు గురి అయిన మనుషుల కణాల నుండి తీసి వాటిని నిర్వీర్యం చేసిన వైరస్లు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ రోగానికి సంబంధించిన వ్యాక్సిన్ దొరుకుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా దొరుకుతుంది. కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో  మాత్రం ఒక్కొక్క డో సుకు 500 రూపాయల  చొప్పున ఫీజు తీసుకుంటున్నారు. చాలా డోసులు ఇవ్వాల్సి వస్తుంది. ఇదంతా చాలా  ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి అన్ని ఆసుపత్రులలో వైరస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాల్సిన  అవసరం ఉంది .

అత్యంత ప్రధానంగా   99 శాతం ఈ రాబిస్ వైరస్ మనుషులకు కుక్క కాటు వల్ల వస్తుంది కాబట్టి కుక్కలకు ముందే ఈ  వ్యాక్సిన్లు  ఇచ్చేందుకు ఒక ప్రత్యేక ప్రణాళిక కేంద్రం సిద్ధం చేసింది. వీధి కుక్కల గొడవ సుప్రీం కోర్టు గడప వరకు వెళ్లింది. కేరళ రాష్ట్రంలో వీధి కుక్కల బెడద బాగా పెరిగింది. వీది కుక్కలను చంపేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలు అనుమతించబోవని ప్రమాద కరంగా మారిన కుక్కలను చంపేందుకు అనుమతించాలని కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టును అభ్యర్థించింది. కేరళలో పెద్ద ఎత్తున వీధి కుక్కల జనాభా నియంత్రణకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.  నాలుగు నెలల కాలంలో ఎనిమిది మంది కుక్క కాటుతో రాబిస్ సోకి మరణించారు. 

దేశ వ్యాప్తంగా చూస్తే 2019 సంవత్సరంలో అత్యధికంగా 72,77,523 కుక్క  కాటు కేసులు నమోదయ్యాయి. కుక్క కాటు కేసులు 2020లో 46,33,493 నమోదు కాగా 2021 లో  17,01,133 కేసులకు తగ్గాయి. అయితే, 2022 మొదటి ఏడు నెలల్లోనే 14.5 లక్షల కేసులు నమోదయ్యాయి.

కుక్కలు కరిస్తే ఇక నుండి  ఆ కుక్కలను పోషించే వారిపై కేసులు పెట్టాలని సుప్రీం కోర్టు సూచించింది.

ఈ పరిణామాల నేపద్యంలో కేంద్రం నిర్ణయం మేరకు  కనీసం 7శాతం కుక్కలకు  యాంటీ ర్యాబిస్ వాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. యాంటి  రాబిస్ ఇచ్చిన కుక్కలకు అవి  మనుషులను కరిచినా వైరస్ సోకకుండా ఉంటుంది. ఈ ప్రణాళిక విజయవంతం అవుతుందని ఆశిద్దాం. హరీష్ రావు గారు ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర్నుండి ఆరోగ్య వ్యవస్థ లో మంచి  మార్పులు వస్తున్నాయి. 

యాంటి రాబిస్ కార్యక్రమంపై కూడ దృష్టిసారిస్తే ప్రజలకు మేలు చేసిన వారవుతారు.


Drమండువప్రసాదరావు

 9963013078

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు