నియంతలు కాలగర్భంలో కలిసి పోయారు - అసెంబ్లీలో కేంద్రం విధానాలపై ధ్వజమెత్తిన కెసిఆర్

 కెసిఆర్ నోట నియంతల మాట


నియంతలా పాలించిన హిట్లర్, ముస్సోలిని వంటి వాళ్లు ఎందరో కాలగర్భంలో కల్సిపోయారని బీజెపి కూడ ఏదో ఒక రోజు ఇంటికి పోవాల్సిందే నని అసెంబ్లీ వేదికగా సిఎం కెసిఆర్ కేంద్రం పైనా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పైనా నిప్పులు చెరిగారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందన్నారు. సంస్కరణల ముసుగు తొడిగి తీసుకొచ్చిన విద్యుత్ చట్టం విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేసారు. 

భాజపా ప్రభుత్వం ఒక్క మంచిపని చేసిందా అంటూ ప్రశ్నించారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు తమ బలం ఏంటో చెబుతారని వ్యాఖ్యానించారు. యువత గుండెల్లో రగిలే మంటలు ఆపగలరా అని నిలదీసారు. ప్రధాని, కేంద్రమంత్రుల అవివేక చర్యలతో దేశం ప్రమాదంలో పడిందన్నారు. రైతుల భూములను కబళించేందుకు కుట్రలు జరుగుతున్నాయని హెచ్చరించారు. ఆర్టీసీని అమ్మేయని కేంద్రం లేఖలు రాస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు.

ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించమని చెబుతున్నారని.. ఏపీ నుంచే తమకు రావాల్సినవి చాలా ఉన్నాయని..క్రిష్ణపట్నం పోర్టులో తమకు భాగస్వామ్యం ఉందన్నారు. మేకిన్ ఇండియా అనేది పూర్తి అబద్ధపు ప్రచారంగా అభివర్ణించారు. గాలి పటాలకు వినియోగించే మాంజా, జెండాలు, టపాసులు అన్నీ చైనా నుంచే వస్తున్నాయని చెప్పుకొచ్చారు. అనేక బిల్లులు తెచ్చారు.. జనం ఉద్యమించడంతో వెనక్కి తీసుకున్నారన్నారు. రైళ్లు, ఎల్‌ఐసీ సహా దేశంలోని అన్ని రంగాలనూ అమ్మేస్తున్నారని విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని కేసీఆర్ సవాల్ చేసారు.

ఏపీ నుంచి ఇప్పటికి తెలంగాణకు 17వేల 828కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. కృష్ణపట్నంలో కూడా తెలంగాణ పెట్టుబడులు ఉన్నాయన్నారు. ఏపీ తెలంగాణకు ఇవ్వాల్సిన బకాయిల గురించి పట్టించుకోకుండా వాళ్లకు చెల్లించాల్సిన మూడు వేల కోట్లకు 18శాతం వడ్డీతో 60వేల రూపాయలను నెల రోజుల్లో కట్టాల్సిందే కేంద్రం నోటీసులు పంపడం ఏమిటని ప్రశ్నించారు.అసెంబ్లీలో తాను చెప్పిన మాట అబ్ధమని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని శపథం చేశారు కేసీఆర్. 

మహాత్ముడు పుట్టిన గడ్డపై మరుగుజ్జులు మాటలను తాము లెక్క చేయమన్నారు. ఎల్లకాలం అధికారంలో ఉంటామని బీజేపీ నేతలు కలలు కనవద్దని ఇంకా రెండేళ్లే సమయం ఉందని సూచించారు కేసీఆర్. రాష్ట్రాల గొంతు నొక్కి ..ప్రభుత్వాలను కూల్చేయాలన్నదే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. వాళ్ల ఆటలు సాగని అసెంబ్లీ సమావేశాల్లో తీవ్రస్థాయిలో బీజేపీ వైఖరీ, కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవలంభిస్తున్న విధానాల్ని త్పపుపట్టారు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు