కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన పరుగులు తీసిందా ?

 

సామాన్యుల ఇబ్బందులు  ఎంత మేరకు నెర వేరాయి ?




 తెలంగాణ రాష్ర్టంలో కొత్త జిల్లాలు ఏర్పాటు జరిగి 5 సంవత్సరాలు పూర్తి అయింది.  సిఎం కెసిఆర్ ఏం ఆశించి ఈ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారో  ఎంత మేరకు ఆయన ఆశయం సఫలీకృతం అయిందో  సామాన్యుల ఈతి భాదలు ఎంత వరకు తీరాయో అనే విషయాలపై సమీక్ష జరగాల్సి ఉంది. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు అనేది ఎంతో సాహసోపేత నిర్ణయం. ఏండ్ల తరబడి ఇరుగు పొరుగు పాలకులతో అనేక ఇబ్బందులు పడి వనరుల దొపిడీకి గురైన తెలంగాణ ప్రాంతం  ప్రజల సుదీర్ఘ పోరాటంతో ప్రత్యేక రాష్ర్టంగా అవతరించడం భారత దేశ చరిత్రలో  స్థిర స్థాయిగా నిలిచి పోయిన ఘట్టం.  రాష్ర్ట ఏర్పాటు అనంతరం జనామోదంతో తొలి  సిఎం గా పగ్గాలు  చేపట్టిన కెసిఆర్  రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించేందుకు పరిపాలనా రంగంలో  తెచ్చిన సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాల ఆలోచనకు రూపకల్పన జరిగింది.

 

1916 అక్టోబర్ 11 న కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. రాష్ర్టంలో  ఉన్న  10 జిల్లాలను విభజించి కొత్తగా 18 జిల్లాలు ఏర్పాటు చేసి రాష్ర్టంలో జిల్లాల సంఖ్య తొలుత 31 కి పెంచారు. ఆ తర్వాత 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామి మేరకు కెసిఆర్  రెండో సారి సిఎం అయిన తర్వాత 2019 ఫిబ్రవరి 17 న ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేయడంతో రాష్ర్టంలో మొత్తం జిల్లాల సంఖ్య 33 కు చేరింది.  రాష్ర్టంలో కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మున్సిపాల్టీలు అట్లాగే మండలాలు కూడ పెరిగాయి. ప్రస్తుతం 74 రెవెన్యూ డివిజన్లు, 13 మున్సిప ల్ కార్పోరేషన్లు, 129 మున్సిపాల్టీలు, 594 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. జిల్లా పరిషత్ లు 32, మండల పరిషత్ లు 540 ఉన్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన జిల్లాలతో పాలనా విస్తృతి బాగా పెరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల పరిపాలన గడప ముందుకు వస్తుందని సర్కార్ కార్యాలయాల చుట్టూ పనుల కోసం రోజుల తరబడి చెప్పులు అరిగేలా తిరిగే భాదలు తప్పు తాయని అందరూ  సంబరపడ్డారు.  సిఎం కెసిఆర్ విజన్ ను పాలనాదక్షతను జనం వేనోళ్ల కొనియాడారు.

 

చూస్తు ఉండగానే జిల్లాల ఏర్పాటు జరిగి ఓ పంచ వర్ష ప్రణాళికా కాలం గడిచింది. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ప్రజలు భాదలు ఎంత వరకు తీరాయి ? ఎంత మేరకు సౌలభ్యత కలిగింది ? సర్కార్ కార్యాలయాల చుట్టూ ఒకటికి రెండు సార్లు ప్రదక్షిణలు చేసే అవసరం లేకుండా పనులు చకా చకా జరిగి పోతున్నాయా ? గుట్టలుగా దస్త్రాలు పోగు పడి పోకుండా ఎప్పటి కప్పుడు పరిష్కారాలకు నోచుకుంటున్నాయా ?  ఉన్నతాధి కారుల నుండి సబార్డి నేట్ల వరకు అందరూ కార్యాలయాల్లో అందు బాటులో ఉండి తక్షణం పనులు చక్కబెడుతున్నారా ?  అంటే ఠక్కున సమాధానాలు లభించే పరిస్థితి లేదు. కొత్తగా జిల్లాలు ఏర్పాటు అయిన సమయంలో ప్రజలు కూడ పనులు చక చకా జరిగి పోతాయని సంబరపడ్డట్లు  ఇప్పుడా సంబరు కనబర్చడం లేదు. కొత్త జిల్లాలు ఏర్పాటు అయి ఒరిగింది ఏంటి, జరిగింది ఏంటి   ఏం లాభం లేదు అనే నిట్టూర్పులు వారి నుండి విన వస్తున్నాయి.

 

రాష్ట్రంలో పరిపాలనా విభాగాల పునర్వ్యవస్థీకరణ జరిగిన నేపథ్యంలో ప్రజలకు వివిధ రంగాల్లో మరింత మెరుగైన సేవలు అందాయా  ? అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలలో ఏమైనా పురోగతి సాధించామా ? కార్యాలయాల్లో దస్త్రాలు కదులుతున్నాయా ? అసలు సామాన్యులు ఏమంటున్నారు  ? అనే అంశాలపై సర్కార్ సమీక్షలు లేవు. 

 

కొత్త జిల్లాలకు కలెక్టర్లుగా వెళ్లిన వారంతా యువకులు. మంచి ఉత్సాహంతో ఉన్నారు. సేవ చేయాలనే తపన ఉంది. వారు శ్రద్ధ పెట్టి పనిచేయడానికి అవకాశం కల్పించాలి. చొరవ చూపే వెసులు బాటు కల్పించాలి. వారంతా ఒకే పద్దతి ప్రకారం, ఒకే స్ఫూర్తితో పనిచేస్తే తెలంగాణ రాష్ట్రంలో అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. ప్రజలు కూడా మార్పును గమనిస్తారు. ప్రయోజనం పొందుతారు. సీనియర్ అధికారులు, గతంలో కలెక్టర్లుగా పనిచేసిన వారు యువతరానికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వాలి. మార్పు తీసుకొచ్చే పనిలో కలెక్టర్లే సమన్వయ కర్తలుగా ఉండాలి. జిల్లా పరిధిలో ఏ శాఖ ద్వారా ఏ కార్యక్రమం జరిగినా వాటిని కలెక్టరే పరిశీలించాలి, పర్యవేక్షించాలి. కొత్త పరిపాలనా విభాగాలు రావడం వల్ల పనిభారం తగ్గింది. కాబట్టి పనితీరులో మరింత ప్రభావం, సమర్థత కనిపించాలిఅని ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త జిల్లాల ఏర్పాటు సందర్బంగా 1916 లో ఉద్భోధించారు.

 

అంతే కాకుండా దేశంలో ఎక్కడా లేనివిధంగా అతిపెద్ద పరిపాలనా సంస్కరణ తెచ్చిన నేపథ్యంలో వాటి ఫలితాలు ప్రజలకు అందేలా కార్యాచరణ రూపొందించాలని  కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలతో చిన్న పరిపాలనా విభాగాలు ఏర్పడ్డాయని, కలెక్టర్లు, ఇతర అధికారులకు పర్యవేక్షణ సులువైతదని జిల్లాల వారీగా నో యువర్ డిస్ట్రిక్స్ - ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్ (మీ జిల్లా గురించి తెలుసుకోండి, మీ జిల్లాకు ప్రణాళిక రూపొందించండి) అనే నినాదంతో జిల్లాల వారీగా ప్రణాళికలు తయారు కావాలని సిఎం కెసిఆర్ సూచించారు. సీనియర్ అధికారులు, గతంలో కలెక్టర్లుగా పనిచేసిన వారు యువతరానికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వాలని  మార్పు తీసుకొచ్చే పనిలో కలెక్టర్లే సమన్వయ కర్తలు వ్యవహరించాలని  జిల్లా పరిధిలో ఏ శాఖ ద్వారా ఏ కార్యక్రమం జరిగినా వాటిని కలెక్టరే పరిశీలించాలిని కొత్త పరిపాలనా విభాగాలు రావడం వల్ల పనిభారం తగ్గుతుంది . కాబట్టి పనితీరులో మరింత ప్రభావం, సమర్థత కనిపించాలని  కూడ ముఖ్యమంత్రి ఆశించారు.

 

తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణలు తెచ్చుకున్నాం. ప్రజలు మార్పు ప్రభావాన్ని చవిచూడాలి. మంచి పాలన అందాలి. అవినీతి పోవాలి. రుగ్మతలు పోవాలి. రెవెన్యూ కార్యాలయాల్లో కావాల్సిన సేవలు సకాలంలో, అవినీతి రహితంగా పొందాలి. డబ్బులివ్వకపోతే పనికాదు అనే భావన పోవాలి. మ్యుటేషన్లు, పహాణీ నకళ్లు, సర్టిఫికెట్లు సకాలంలో అందాలి. రెవెన్యూ, మున్సిపాలిటీ, సర్వే విభాగాల్లో లంచం ఇవ్వకుండా పని జరిగినప్పుడు ప్రజలకు అవినీతి రహిత పాలన అందినట్లు లెక్క. కరెంటు ట్రాన్స్ ఫార్మర్లు అవసరమైన వెంటనే రైతుల దరికి చేరాలి. కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థితి పోవాలె. గ్రామాల్లో గుడుంబా మహమ్మారి పారిపోవాలి. ప్రజల ఆరోగ్యం మెరుగుపడాలి. అందరూ చదవాలి. విద్య, వైద్య రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించారు. ఎక్కువ మంది ఆధారపడే వ్యవసాయ రంగాన్ని పట్టించుకోవాలి. రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. అధికారులు కూడా అదే స్ఫూర్తితో పనిచేసి ఏ సమయంలో రైతులకు ఎలాంటి సహకారం కావాలో అది అందించాలి. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించేందుకు ముందుగానే ప్లాన్ సిద్ధం చేయాలి. మార్కెట్లలో గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి. రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు వ్యవసాయ శాఖను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. వ్యవసాయ శాఖలో కొత్తగా నియామకమయ్యే ఉద్యోగుల సేవలను క్షేత్రస్థాయిలో బాగా ఉపయోగించుకోవాలి. నేను దత్తత తీసుకున్న ఎర్రవెల్లి, నర్సన్నపేటల్లో అందరికోసం అందరం అనే దృక్పథంతో సామూహిక వ్యవసాయం చేస్తున్నాం. గ్రామాలను స్వయం సమృద్ధి సాధించే దిశగా తీర్చిదిద్దుతున్నాం. ఆ గ్రామాలను తెలంగాణకు ఆదర్శంగా నిలుపుతాం. వాటి స్ఫూర్తితో మిగతా గ్రామాలు కూడ అలాగే బాగుపడాలన్నది నా ఉద్దేశ్యం. గ్రామాల్లో గ్రీన్ కవర్ పెంచడానికి కృషి చేయాలి. ఎక్కడికక్కడ నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలి. హరితహారం నిరంతరం సాగాలి. మిగతా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను కలెక్టర్లు పర్యవేక్షించాలి అని జిల్లాల ఏర్పాటు సందర్బంగా సిఎం అన్న మాటలు గుర్తు చేసుకుంటే ఇవన్ని ఆచరణలో  నెర వేరాయా అనే సందేహాలు కలగక మానవు.

 

కొత్త జిల్లాలలో జిల్ల కలెక్టర్ కార్యాలయాలకు పూర్తిగా భవణ సముదాయాలు పూర్తి కాలేదు. ఇతర ప్రభుత్వ కార్యాలయాలు అద్దె గదుల్లో కొనసాగుతున్నాయి. కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఒక్కో అధికారి మూడు నాలుగు విభాగాలకు ఇన్ చార్జిగా ఉండి విధులు నిర్వహిస్తున్నాడు. ఇక అన్నిటి కన్నా మించి  అవినీతి అంత మొంది పోయిందా అంటే అస్సలు లేదు. రెవెన్యూ  శాఖలో అయితే  బరితెగించిన అవినీతి ఎట్లా వ్యవస్థీకృతం అయిందో అందరికి తెల్సు. రెవెన్యూ శాఖలో అవినీతికి మూల పురుషులంటూ విఆర్ వోలను తొలగించి మూలన కూర్చోబెట్టిన తర్వాత సమస్యలు చాలా వరకు జఠిలంగా మారాయి.  విఆర్ వో లు లేక పోతే ఏంటి ఆ వాటా కూడ మాకే దక్కాల్సిందంటూ  గిర్దావర్లు, ఉప తహశీల్ దారులు, తహశీల్ దారులు, కార్యాలయాల సిబ్బంది వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒక్క రెవెన్యూ డిపార్ట్ మెంట్ నే నిందించనవసం లేదు. ప్రజలకు నిత్యం అవసర పడే పంచాయితి రాజ్, విద్యుత్ శాఖ ల్లో  విచ్చల విడి లంచ గొండి తనం రాజ్యం ఏలుతోంది.

 

కొత్తగా జిల్లాలు ఏర్పాటు వల్ల ప్రజా ప్రతినిధులకు, పార్టీలకు, రాజకీయ నాయకులకు పదవులు పుట్టుకొచ్చాయి. జిల్లా పరిషత్ చైర్మన్లు, గ్రంధాలయాలు మార్కెట్ కమిటీలు తదితర విభాగాలలో  పదవులు పెరిగి అధికార పార్టీకి పదువుల  పంపిణి బాగా సులువు అయింది.

 

ఇంకా అన్నిటి కన్నా  కొత్త జల్లాల ఏర్పాటు కారణంగా అనూహ్యంగా భూముల ధరలు పెరిగి పోయి  రియల్ ఎస్టేట్ రంగంలో  కాసుల కనక వర్షం కురిసింది. సిఎం కెసిఆరే స్వయంగా జిల్లా కలెక్టర్ల సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం భూముల ధరలు ఎట్లా పెరిగి భూమ్ వచ్చిందో ఘనంగా చెప్పుకున్నారు. ఈ ధరలు పెరడం వల్ల ఓ సామాన్యుడు తలదాచుకునేందుకు  చిన్న గుడిసె కట్టుకునేందుకు ఓ గజం స్థలం కూడ కొన లేని పరిస్థితి కొత్త జిల్లాల పుణ్యమా అంటూ ఏర్పడింది. వందల వేల ఎకరాల పంట భూములు రియల్ ఎస్టేట్ ప్రాకారాలుగా మారాయి.  కొత్త జిల్లా ఏర్పాటు కాక ముందు లక్షల్లో ధర పలికిన భూములు అమాంతం కోట్లకు పెరిగాయని చెప్పు కోవటమే కొత్త జిల్లాలు సాధించిన అభివృద్దా ? ఇదేం పరిపాలనా సౌలభ్యం  అనే ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి.

 

జిల్లాల ఏర్పాటు  ఉద్దేశం వెనకాల సిఎం కెసిఆర్ కు రాజకీయ, వ్యాపార ధోరణలు ప్రయోజనాలు అంటగట్టడం తప్పు అవుతుంది. కాని కొత్త జిల్లాల ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు ఏకంగా కుబేరులుగా మారి పోయారని చెప్పేందుకు ఉదాహరణలు కో కౌల్లలుగా ఉన్నాయి. కొన్ని జిల్లాలలో ఎమ్మెల్యేలే తమత అనుచరులను రంగంలోకి దింపి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు. వీటికి రుజువులు సాక్షలు అవసరం లేదు. అక్కడి స్థానిక ప్రజలను అడిగితే  ఏ జిల్లాలో ఏ ఏ నేత భూములు కొన్నాడో వివరాలతో సహా పూసగుచ్చినట్లు వివరిస్తారు. ఇదంతా పక్కనపెడితే  జిల్లాలు    సదాశయం కోసం ఏర్పాటు చేశారో ఆ ఆశయం నెర వేరిందా లేదా అని కొత్త వ్యవస్థల పనితీరు వాటి ద్వారా వచ్చిన ఫలితాలపై స్థూలంగా సమీక్ష జరపాల్సిన అవసరం ఉంది.  పరిపాలనా సంస్కరణలు బలోపేతం కావాలంటే వాటి కార్యాచరణలో ఎదురవుతున్న అవరోధాలు అటంకాలు  క్షేత్ర స్థాయి నుండి అధ్యయనం జరిపినపుడే  లోపాలు లోటు పాట్లు సవరించే అవకాశం కలుగుతుంది.

 మహేందర్ కూన

జర్నలిస్ట్

 (ప్రజాతంత్ర దినపత్రిక 26-04-2022 ప్రచురితం)

 

 

 

 

 

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు