సిజేఐ నిర్ణయంతో పెరిగిన హై కోర్టు న్యాయమూర్తుల సంఖ్య


 తెలంగాణ హైకోర్టులో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న  న్యాయమూర్తుల సమస్య తీరింది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చొరవతో తెలంగాణలో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కు పెంచుతూ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. న్యాయమూర్తుల సంఖ్యను ఏకంగా 75 శాతం పెంచారు. పెరిగిన న్యాయమూర్తుల సంఖ్య 42 కాగా.. వారిలో 32 మంది శాశ్వత న్యాయమూర్తులు.. 10 మంది అదనపు జడ్జీలుంటారు.  ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. సుప్రీంకోర్టు కొలీజియం ద్వారా జరిగే హై కోర్టు న్యాయ మూర్తుల నియామకాలను చేపట్టాలని గతంలో అనేక సార్లు తెలంగాణ హై కోర్టు సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి కెసిఆర్ కు కూడ పలు మార్లు లేఖలు రాసారు. 2014 లో రాష్ట్ర విభజన జరిగినా   న్యాయ మూర్తుల నియామకాలు జరగ లేదు. న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని ప్రధాన మంత్రితోపాటు న్యాయశాఖా మంత్రికి కేసీఆర్ పలుమార్లు లేఖలు కూడా రాశారు. తాజాగా చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణ.. పాత ఫైలును వెలికి తీసి మరీ వేగంగా నిర్ణయం తీసుకోవడంతో.. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెరిగేందుకు అవకాశమేర్పడింది. 

హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సాధ్యమైనంత త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం వెల్లడించింది. ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో రెండ్రోజుల పాటు జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా భేటీ అయిన జస్టిస్‌ ఎన్వీ రమణ... కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు