అమ్మమ్మ పిలుపుతో మనవడి పునర్జన్మ

అమ్మమ్మ పిలుపుతో మనవడి పునర్జన్మ
హర్యానలో జరిగిన సంఘటన


వైద్యులు చేసిన తప్పుడు నిర్దారణ వల్ల ఓ బాలుడి జీవితం ముగిసి పోయేదా.బతికుండగానే ఆ బాలుడు మృతిచెందినట్లు ధ్రువీకరించారు దిల్లీ వైద్యులు. దీంతో తమ ఏడేళ్ల కుమారుడి అంత్యక్రియలకు సిద్ధమయ్యారు ఆ తల్లిదండ్రులు. అయితే అంత్యక్రియలు ఆలస్యం కావడంతో అతడి ప్రాణాలు దక్కాయి. ఈ ఘటన హరియాణాలోని జజ్జర్ జిల్లాలో వెలుగుచూసింది. కిలా ప్రాంతానికి చెందిన విజయ్ శర్మ మనవడు కునాల్ శర్మ టైఫాయిడ్‌తో దిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. కొద్దిరోజుల చికిత్స అనంతరం ఆ బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో పుట్టెడు దుఃఖంలో తల్లిదండ్రులు కుమారుడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. బహదూర్‌గంజ్​లోని బాలుడి మామ ఇంటి సమీపంలో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు.
అయితే వేరే ప్రాంతంలో ఉంటున్న బాలుడి అమ్మమ్మ.. తన మనవడిని కడసారి చూడాలని పట్టుబట్టింది. తాను వచ్చేవరకు అంత్యక్రియలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. అందరూ ఆమె రాకకోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తల్లి ఏడుస్తూ బాలుడి శవపేటికను తాకింది. కాగా ఆ శవపేటికలో కదలికలు గుర్తించిన తల్లి విషయాన్ని బాలుడి తండ్రి హితేష్​కు చెప్పింది. శవపేటిక నుంచి కొడుకును​ బయటకు తీసిన తండ్రి.. నోటి ద్వారా శ్వాస అందించడం ప్రారంభించాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి గుండెమీద గట్టిగా అదుముతూ ప్రాథమిక చికిత్స అందించాడు. అనంతరం వెంటనే బాలుడిని రోహ్‌తక్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.

తొలుత కునాల్‌ శర్మ బతికేందుకు 15 శాతం మాత్రమే అవకాశాలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. కాగా క్రమంగా బాలుడు కోలుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు ఈ మృత్యుంజయుడు. అమ్మమ్మ షరతుతో అంత్యక్రియలు ఆలస్యం కావడం.. ఈ క్రమంలో అనూహ్య రీతిలో ఆ పిల్లవాడిలో కదలికలు రావడం.. అతడు బతికి బయటపడటంతో ఆ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు