లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసిన ప్రభుత్వం

 


రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్ ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది.

అయితే కేసుల తీవ్రత ఉన్న ప్రాంతాలలో ఆంక్షలు విధించనున్నారు. సామాజిక దూరం పాటించడం తో పాటు మాస్కులు ధరించడం తప్పని సరి చేశారు.

జులై ఒకటో తేదీ నుంచి అన్ని విద్యాసంస్థలను పునఃప్రారంభించాలని నిర్ణయించింది. లాక్‌డౌన్ ఎత్తేసినంతమాత్రాన ప్రజలెవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరుచుగా శానిటైజ్ చేసుకోవడంలాంటి స్వీయ నియంత్రణ పాటించాలని స్పష్టం చేసింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని మంత్రివర్గం కోరింది. ఇతర రాష్ట్రాలకన్నా తెలంగాణలోనే కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చిందని కేబినెట్ అభిప్రాయపడింది.
సామాన్యుల బతుకుతెరువు దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపింది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా టీకా ప్రక్రియ సజావుగా సాగుతోంది. మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని టీకా తయారీ కంపెనీలతో మాట్లాడి అవసరమైన్ని టీకాల సరఫరాకు సహకరించాలని కోరారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రజలందరికీ టీకా అందిస్తుండటంతో చాలావరకు కేసులు తగ్గుముఖం పట్టాయి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు