ప్రపంచ జనాభాను కబళించిన కుంభమేళా


Indus Martin-ముఖ పత్రం నుండి



2020 మార్చి నెలలో డిల్లీలో జరిగిన ఒక చిన్న ముస్లిం మతకూడిక వలన దేశం నాశనం అయ్యింది అని కుక్కలై మొరిగిన మీడియా మరియూ నాగరికతా ముసుగులో, ప్రజాస్వామ్య వాదులుగా చెలామణీ అయిపోతున్న మతోన్మాదులూ చేసిన నేరపూరిత ప్రచారం, ముస్లిం ప్రజల పట్ల మనస్పూర్తిగా చేసిన వివక్ష, తీర్చుకున్న పగ మనం మర్చిపోలేం. సరిగ్గా సంవత్సరం తిరిగే సరికి అంతకు వెయ్యి రెట్ల జనసమూహంతో కుంభమేళా నిర్వహించి దేశాన్ని పీనుగుల పెంటగా మార్చిన ప్రభుత్వాలను ఇప్పుడు చూస్తున్నాం. ఒక్క ప్రభుత్వాలేనా? కార్యాలయంలో, కాలనీలో, స్నేహసమూహాల్లో, సాహిత్యంలో ఎల్లప్పుడూ తమ స్వంత మతాన్ని హైలైట్ చేసుకుంటూ, దాన్ని అజ్ఞానాన్ని విజ్ఞానం అని నిరూపించడానికి తాపత్రయ పడుతూ, మూఢాచారాలనూ, వివక్షనూ సహేతుకం అని ప్రచారం చేస్తూ అందుకు అసలు నిర్దుష్టంగా ఎక్కడా చరిత్రలో కనబడని 'వేలాది సంవత్సరాల సంస్కృతి ' అనే కాన్సెప్టును తోడు తెచ్చుకుంటూ బ్రతికే ప్రతీ ఒక్కరూ బాధ్యులేకాదా? వేలాది సంవత్సరాల ఏక సంస్కృతి ఎక్కడ ఉందీ? ఈ ఉపఖండంలో ఇవాళ్టి రోజుకు కూడా ఏక సంస్కృతి లేదు కదా? మరి వేలాది సంవత్సరాల భారత సంస్కృతి ఎక్కడిదీ? ఆపేరు మీద ప్రచారం అవుతున్న అమ్మా, ఆవూ, పేడా, పెంటా ఎక్కడివీ?

సరే, మతకూడికల వలన చీడపీడలూ, గత్తరలూ ప్రభలుతాయి. ఇది నిజం. నేను కావాలనే మహమ్మారి అనే పదాన్ని వాడటం లేదు. మహా మారి ధ్రవిడ దేవత. ధ్రవిడ దేవతను ఒక వ్యాధికి పేరుగా ఎంచుకోవడంలోనే ఒక సంస్కృతి మరో సంస్కృతి మీద చేసే దాడి, వివక్ష కనబడుతుంది. తబ్లీఖ్ ఉదంతాన్ని నిందించిన జనాలు మతకూడికలు వ్యాధులకు పుట్టిళ్ళు అని తెలుసుకోలేక పోయాయా? కుంభమేళా వలన గత్తర ప్రభలడం ఇదే మొదటి సారి కాదే. ప్రపంచలో 15% జనాభాను కబళించిన కలరా ఇదే కుంభమేళా వలన సంభవించింది అనేది ఇదే దేశం అనుభవించిన దారుణ నష్టం కాదా? 1817 నుండి 1824 వరకూ ప్రపంచలోని అన్ని ఖండాలనూ చుట్టేసి చంపిన ఏషియన్ కలరా పుట్టిల్లు కోల్కతా నగరం కాదా? ఇన్నేసి ఏళ్ళ ఘన చరిత్ర అని చెప్పుకునే సిగ్గుమాలిన సంస్కృతి వాదులు ఇదేనా చరిత్రనుండి నేర్చుకున్న పాఠం? అప్పటి కుంభమేళా వలన కలుషితం అయిన నదీజలాలూ, మైదాన ప్రాంతాలూ ప్రంపంచాన్ని దాదాపు యాభై ఏళ్ళపాటు వణికించిన మాటను పరిచిపోయిందా ఈ సోకాల్డ్ వేదవైజ్ఞానిక సమాజం?

మతం ఎప్పుడూ అంతే. అన్నింటా తానే ప్రధాన్యతను కోరుకుంటుంది. వ్యాధిలో, బాధలో, మరణంలో, యుద్దంలో, స్నేహంలో, ద్వేషంలో, అభివృద్ధిలో... అన్నిట్లో తానే ఆధిపత్యం వహించడానికి పూనుకుంటుంది. మతాన్ని ప్రచారం చేసే ఎవరైనా ప్రపంచంలోని ఏ విషయం మీదైనా మాట్లాడే హక్కు కలిగి ఉంటారు. అత్యంత లోతైన వైద్యవిజ్ఞానం నుండి అత్యంత నిఘూఢమైన అంతరిక్ష విషయాలవరకూ అన్నిటిలోనూ వేలు పెట్టడమే కాదు, వాటికి దిశానిర్దేశం చేసే సిగ్గుమాలినతనం కూడా మతానిదే. ఇందుకు ఏమీ చదువుకోవాల్సిన పని లేదు. ఏ పరిశోధనా అనుభవం కూడా అవసరం లేదు. ఒక మతం వైపు పైశాచికంగా నిలబడితే సరి. ఇక మీరు చెప్పిందే సత్యం.

ఇప్పుడు చూడండి.... దేశం మృత్యుశ్వాసను పీల్చుతుంది. ఇంటింటా మరణం మేల్కొలుపుతుంది. చావుకు దక్కే కనీస సానుభూతి కూడా ప్రస్తుతం కరువే అయ్యింది. అయినా మతం మాత్రం ఎన్నికల ప్రచారంలో ప్రజల్ని విడదీస్తూ, అజ్ఞానాన్ని ప్రచారం చేస్తూ, అణచివేస్తూ, వివక్ష చేస్తూ దూసుకుపోతూనే ఉంది. అంతెందుకు... ఇంత జరుగుతున్నా ఇందుకు కారణం అయిన అధినేతను ప్రశ్నిస్తేనే మూర్ఖశునకాలు కోపోద్రిక్తులు అవుతున్నారే కానీ, కాసేపు ఆగి సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం మాత్రం చెయ్యరు. వాళ్ళే కాదు, ఇక్కడ ఉన్న మిగతా ముస్లిం , క్రైస్తవులు కూడా అందుకు తీసిపోరు. అవకాశం ఉన్నప్పుడల్లా మతకూడికలకు తెగబడటం వీళ్ళందరి లక్షణం. పోనీ ఇందుకు భక్తి కారణమా అనుకుంటే అదీ లేదు. నిజంగా దైవభయం ఉన్నవాడు క్రమశిక్షన కలిగిన జీవితాన్ని పాటిస్తాడు. అబద్దం, మోసం, దాడి, అణచివేత, బూతులకు ఎప్పుడూ పాల్పడడు. కానీ ఈ మతాన్ని నమ్ముకున్నట్టు కనబడే ఎవరర్నైనా చూడండి. ప్రార్ధన చేస్తారు, పూజలు చేస్తారు. కానీ మతాచారాలను ప్రశ్నిస్తే మాత్రం బూతుపురాణాలు విప్పుతారు. వైజ్ఞానిక చర్చల్ని నమ్మకం అనే అభూత కల్పనతో గెలవాలని చూస్తారు. పోనీ అదే నమ్మకంతో ప్రాణాలు కాపాడుకుంటారా అంటే అదీ లేదు. సరిగ్గా కరోనా విజృంభించే సమయానికి ఇంజెక్షన్లు బ్లాక్ చెయ్యడం, హాస్పిటల్, వైద్యరంగాన్ని వ్యాపారం చెయ్యడం కూడా వీళ్ళ పనే.

ప్రతీ మతం తాను మెజారిటీగా ఉన్న దేశంలో , సమాజంలో వేల ఏళ్ళ సంస్కృతి అనే ఒక ఫాల్స్ నెరేటివ్ సృష్టించుకుంటుంది. దానిప్రకారం నడుచుకోమని ప్రజలను మోసం చేస్తుంది. సంస్కృతి ప్రకారం నడుచుకోవడం అంటే ఆ మెజారిటీ మతం చెప్పినట్టు బతకడమే. దాన్ని ప్రచారం చేసే మోసగాళ్ళ లాభానికి సమాజం మొత్తం ఆమోదం చెప్పడమే సంస్కృతి. అందుకే సంస్కృతి- మతం రెండూ విడదీయలేని భావనలు అయి కూర్చున్నాయి..... బాగా ఆలోచిస్తే రెండూ అభూతకల్పనలే. రెండూ ఎప్పుడూ చరిత్రలో స్థిరంగా కనబడవు. కాలంతో పాటు మోస రూపాలను మార్చుకుంటూ కొనసాగుతాయి.

నేను మతాన్ని నమ్మను, కానీ నా సంస్కృతిని ప్రేమిస్తాను అనే చాలామంది నిజానికి గుట్టుగా మతానికి కొమ్ముకాసే జనాలే. నిజమైన సంస్కృతి మార్పు చెందుతూ ఉంటుంది. కానీ మతం ఆ మార్పును అడ్డుకుంటూ ఉంటుంది. వీటి మధ్య సంఘర్షణ ఎంత బలహీనంగా ఉంటే అంత అంధకార సమాజం ప్రభలుతుంది.... అంత ఎక్కువగా గత్తరలూ, పేదరికం, వివక్ష, మూఢత్వం కూడా పెచ్చరిల్లిపోతాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు