కొత్త మంత్రి వర్గంలో శైలజ టీచర్ కు దక్కని చోటు

 


కేరళలో కొలువు దీరనున్న  కొత్త మంత్రి వర్గంలో  మాజీ ఆరోగ్య మంత్రి కేకే శైలజకు  చోటు ఇవ్వలేదు. టీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి ఘన విజయం సాధించడంతో వరుసగా రెండోసారి పినరయ్ విజయన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సీఎంతోపాటు మంత్రివర్గం కూడా ప్రమాణస్వీకారం చేయనుంది. కరోనా వైరస్ కట్టడికి కేరళ ఆరోగ్య మంత్రిగా శైలజ తన పనితీరుతో సర్వత్రా ప్రశంసలందుకున్నారు. ఆమె నిర్ణయాలను ప్రధాని నరేంద్ర మోదీ సైతం మెచ్చుకున్నారు. పలు మీడియా సంస్థలు ప్రశంసిస్తూ కథనాలు ప్రచురించాయి. 

కొత్త మంత్రివర్గానికి సంబంధించిన వివరాలను సీపీఎం నేత ఎ.ఎన్. షంషీర్ వెల్లడించారు. కేబినెట్ లో సీపీఎం పార్టీ నుంచి సీఎం పినరయి విజయన్ ఒక్కరే పాతవారని, మిగతా 11 మంది మంత్రులంతా కొత్తవారే ఉంటారని ఆయన చెప్పారు. యువతకూ ఈసారి కేబినెట్ లో ప్రాధాన్యముంటుందన్నారు. పాతవారికి ఈసారి చోటు లేదన్నారు. ఇది పార్టీ తీసుకున్న నిర్ణయమన్నారు. పార్టీ ఎవరినీ వదులుకోబోదన్నారు. అందరూ పార్టీ నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనని చెప్పారు.

ఈనెల 20 న 21 మంది మంత్రులతో  పినరయి విజయన్ ప్రమాణ స్వీకారం చేస్తారని సీపీఎం రాష్ట్ర ఇన్ చార్జి కార్యదర్శి, ఎల్డీఎఫ్ కన్వీనర్ ఎ. విజయరాఘవన్ చెప్పారు. మంత్రుల శాఖలను ముఖ్యమంత్రే నిర్ణయిస్తారన్నారు. కూటమిలో ప్రధాన పార్టీ అయిన సీపీఎం నుంచి 12 మంది, సీపీఐ నుంచి నలుగురు, కేరళ కాంగ్రెస్ (ఎం), జనతాదళ్ (ఎస్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ల నుంచి ఒక్కొక్కరికి మంత్రిగా అవకాశం దక్కనుంది.

అదేం లేదు

నూతన కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై ఎలాంటి అసంతృప్తీ లేదని అది విధానపరమైన నిర్ణయమని పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని. సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ భావోద్వేగాలే.’’ అని శైలజ పేర్కొన్నారు. నూతన బాధ్యతలు తీసుకునే వారెవరైనా వారు కొత్త వారేనని, కొత్త వారికి కూడా ఓ ఛాన్స్ ఇవ్వాలని ఆమె అన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు