స్ఫూర్తి లేని స్మృతి వనం

 ప్రొ. జయశంకర్ విలువ దిగజార్చిన టిఆర్ఎస్
ఉద్యమంలో లేని కెటిఆర్ ఫొటోతో జయశంకర్ ప్రతిష్టకు భంగం



  మూడు తరాల తెలంగాణ ఉద్యమ చరిత్రకు సాక్షిగా నిలిచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తుది శ్వాస వరకు పోరు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ స్మృతి వనంలో తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కానీ కెటిఆర్, తదితరుల బొమ్మలను చేర్చడం జయశంకర్ విలువ దిగజార్చడమవుతుందని తెలంగాణ ఉద్యమకారులు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఏకశిలా పార్కులో నిర్మిస్తున్న జయశంకర్ స్మృతి వనంలో జయశంకర్ తో పాటు కెసిఆర్, కెటిఆర్, విద్యాసాగర్ రావు లాంటి వాళ్ళ ఫోటోలు శిలాఫలకంపై చెక్కడంపై ప్రజా సంఘాల నాయకులు, తెలంగాణ ఉద్యమనాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భూ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, సుప్రీంకోర్టు న్యాయవాది నిరూప్ రెడ్డి లు మీడియతో మాట్లాడారు. 

   పోరాటాలు చేసిన ఉద్యమ అమరుల పక్కన బతికున్న వాళ్ళ బొమ్మలు పెట్టడం సరికాదని, ఉద్యమంలో లేని వాళ్ళ బొమ్మలు, బతికున్న వాళ్ళ బొమ్మలు చేర్చడం సరికాదని అన్నారు. చరిత్రలో ఎక్కడ అమరుల పక్కన బతికున్న వాళ్ళ బొమ్మలు పెట్టుకోలేదని, అలా బతికున్న వాళ్ళ బొమ్మలు పెట్టుకోవాలంటే జయశంకర్ కు ఉద్యమ పాఠాలు నేర్పిన వారి గురువు ప్రొఫెసర్ ఫర్మాజీ బొమ్మ, శ్రీధరస్వామి, ఆనందరావు తోట, ప్రొఫెసర్ రావడ సత్యనారాయణ, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ బొమ్మ, తెలంగాణకు సహకరించిన సుష్మా స్వరాజ్ బొమ్మ, మీరాకుమారి బొమ్మ కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ కన్నా ముందు, తనతో పాటు పనిచేసిన కేశవరావు జాదవ్, కాళోజీ, బియ్యాల జనార్దన్ రావు, బెల్లి లలిత, మారోజు వీరన్న, భూపతి కృషమూర్తి, బత్తిని మోగిలయ్య లాంటి వాళ్లందరి బొమ్మలు కూడా పెట్టాలని లేదంటే ఒక జయశంకర్ పోరాటాల గుర్తులు మాత్రమే పెట్టాలని అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళ బొమ్మలు లేకుండా ఉద్యమానికి సంబంధం లేనివాళ్ళ బొమ్మలు పెట్టడం సరికాదని అన్నారు.

   వరంగల్, తెలంగాణ విప్లవానికి కేంద్రమంతో పాటు కళలకు పుట్టినిల్లని అలాంటి వరంగల్ లో జయశంకర్ స్మృతి వనంలో చెక్కడాలు అటు విప్లవం కానీ ఇటు కళలు కానీ కానరాకుండా రాజకీయ నాయకుల ఆధిపత్యం కనపడుతుండడం బాధకారమని అన్నారు. తెలంగాణ కోసం ఎందరో బలిదానాలు చేసుకున్నారని అలాంటి వాళ్ళ బొమ్మలు వొదలి, వారి త్యాగాలు వొదలి రాజకీయ నాయకుల బొమ్మలు పెట్టడం అంటే తెలంగాణ ఉద్యమకారులను, జయశంకర్ లను అవమానించడమే అవుతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమం గురుంచి బాగా తెలిసిన బోయినపల్లి వినోద్ కుమార్ ఈ స్మృతి వనంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మార్పులు చేయాలని ఉద్యమ నాయకులు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్ట్ సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, సబ్బండ వర్గాలు ఉద్యమాలు చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందని అన్నారు. అందరి పోరాటాల కలయికనే ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమమని, స్మృతి వనం తెలంగాణ ఉద్యమ ప్రతీకగా ఉండాలని అలా లేని పక్షంలో తెలంగాణ ఉద్యమకారులుగా మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని పలువురు నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

   ఈ నిరసన కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమకారులు న్యాయవాది ధోనేటి క్రిష్ణలత, మాసు సావిత్రి రైల్వే కార్మిక సంఘ నాయకులు కర్ర యాదవ రెడ్డి, బి.ఎల్.ఎఫ్ నాయకులు సాయిని నరేందర్, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులు సోమ రామమూర్తి, నలిగింటి చంద్రమౌళి, నల్లెల రాజయ్య,  కొండ రాధకృష్ణ, ఈసంపెళ్లి వేణు, జన్ను ప్రమీల, కుమార్ తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు