తగలాల్సిన వారికి తగిలింది - షర్మిల బాణం

తెలంగాణ లో రాజన్న రాజ్యం....

 


వై.ఎస్ షర్మిల ఎవరు వదిలిన బాణం అయినా అది తగలాల్సిన వారికి తగిలింది. షర్మిల పార్టీ  విషయంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉప్పందిన వార్త రాస్తే లేదు లేదు అంటూ ఖండన ఇచ్చిన షర్మిల మంగళవారం హైదరాబాద్ కు చేరుకుని లోటస్ పాండ్ లో మంతనాలు మొదలు పెట్టింది. పార్టి ఏర్పాటు చేయబోతున్నట్లు స్వయంగా మీడియా ముఖంగా వెల్లడించింది. రాజన్న రాజ్యం తెస్తానని చెప్పింది. షర్మిల ప్రకటనతో తెలంగాణ లో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. తెలంగాణలో షర్మిల రాజకీయ ఎంట్రీ విషయంలో పలు పార్టీల నేతలు పరస్పర భిన్నంగా స్పందించారు.

ఉస్మానియా జేఎసి విద్యార్థులు తీవ్రంగా మండిపడ్డారు.  కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో సమైక్యవాదుల పెత్తనం వద్దని జేఏసీ తెలిపింది. ప్రశాంతంగా ఉన్న తెలంగాణాలో ఫ్యాక్షన్ రాజకీయాలను స్వాగతించలేమని జేఏసీ స్పష్టం చేసింది. ఆంధ్రలో చేయలేని పెత్తనం తెలంగాణలో ఎందుకని షర్మిలను ప్రశ్నించింది. అధికార దాహం కోసం తెలంగాణలో పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఓయూ విద్యార్థి జేఏసీ  స్పష్టం చేసింది.

షర్మిల పార్టీతో వై.ఎస్.ఆర్ కాంగ్రేస్ పార్టీకి ఎలాంటి సంభందం లేదని అసలు పార్టి  ఏర్పాటు విషయంలో వద్దని సలహా ఇచ్చినా షర్మిల విన లేదని వై.ఎస్ ఆర్ పార్టి  సలహా దారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేసారు. తెలంగాణలో వైసీపీ  లాంటి పార్టీ ఉండాలని షర్మిల భావించి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో జగన్ వైసీపీని తెలంగాణలో విస్తరించ లేదని తేల్చి చెప్పారు. షర్మిలను పార్టీ పెట్టొద్దని నచ్చజెప్పే ప్రయత్నాలు జరిగాయని అయితే జగన్‌, షర్మిల మధ్య వ్యక్తిగత విభేదాలు లేవన్నారు.

 స్ట్రెయిట్ ఫైట్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సూచించారు. జగన్ అన్యాయం చేస్తే ఏపీలో యుద్ధం చేయాలన్నారు. తెలంగాణలో యుద్ధం చేస్తే ఉపయోగం ఉండదన్నారు. ఎమ్మెల్యే సీతక్క  మాట్లాడుతూ షర్మిలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఒక్కోసారి ఒక్కొక్కరికి బాణంగా ఉపయోగ పడుతోందన్నారు.

బిజెపి ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ తన కుర్చీని కాపాడుకోడానికి, తన స్థానాన్ని పదిలం చేసుకోడానికే తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేపుతున్నారని విమర్శించారు.

టిఆర్ఎస్ గప్ చుప్

షర్మిల పార్టి విషయంలో టిఆర్ఎస్ పార్టి గప్ చుప్ అయింది. ఈ మేరకు స్వయంగా సిఎం కెసిఆర్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ల నుండి పార్టి నేతలకు ఆదేశాలు అందినట్లు ప్రచారం అయింది. షర్మిల విషయంలో తొందరపడ కుండా  కొద్ది రోజులు వేచి చూసే ధోరణి అవలంబించ వచ్చనే ఉహాగానాలు సాగుతున్నాయి. 

ఇక మొత్తానికి షర్మిల పార్టీ విషయంలో తెలంగాణ లో రాజకీయ సమీకరణాలు శర వేగంగా మారనున్నాయి.  ఎవరికి  లాభం, ఎవరికి నష్టం అనే విషయాల్లో స్పష్టత రావాలంటే కొంత సమయం తప్పదు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు