పరి శ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు - మంత్రిమండలి నిర్ణయంరాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్‌ ఐపాస్‌ చట్టం ద్వారా కొత్త పారిశ్రామిక అనుమతుల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల పెద్ద ఎత్తున పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. ఇలా వస్తున్న పరిశ్రమల్లో రాష్ట్ర యువతకు ఎక్కువ ఉద్యోగాలు దొరికేలా విధానం రూపొందించాలని పరిశ్రమల శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో కసరత్తు చేసి ముసాయిదాను పరిశ్రమల శాఖ రూపొందించింది.దీనిపై ముఖ్యమంత్రి అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్‌ చర్చించింది. స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్‌ నిర్ణయించింది. పరిశ్రమల్లో ఉన్న మానవ వనరుల కేటాయింపును రెండు విభాగాలుగా విభజిస్తూ ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది.

మొదటి విభాగంలో పాక్షిక నైపుణ్యం కలిగిన మానవ వనరుల్లో స్థానికులకు 70 శాతం అవకాశాలు ఇవ్వనున్నారు. నైపుణ్యం కలిగిన మానవవనరుల్లో స్థానికులకు 50 శాతం ఉద్యోగాలు కేటాయించనున్నారు. రెండో విభాగంలో పాక్షిక నైపుణ్యం కలిగిన మానవ వనరుల్లో స్థానికులకు 80 శాతం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల్లో స్థానికులకు 60 శాతం ఉద్యోగాలు కేటాయించాలని కేబినెట్‌ నిర్ణయించింది. అలాగే హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమలు ఒకే చోట కాకుండా నగరం నలువైపులా విస్తరించాలని కేబినెట్‌ అభిప్రాయపడింది. హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో తప్ప మిగతా చోట్ల కంపెనీలు పెట్టే వారికీ అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు