భారత సోల్జర్లకు ధైర్యం - చైనా దూకుడుకు హెచ్చరిక -చైనాకు షాకిచ్చిన ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్ర మోది ఆకస్మిక లడాఖ్‌ పర్యటన భారత సైనికులకు కొండంత మనోధైర్యం సమకూర్చగా చైనాకు షాక్ ఇచ్చింది. తొలుత ఉదయం 10.30 గంటలకు లేహ్‌కు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్కడ సైనికులతో సమావేశమయ్యారు. అనంతరం లడఖ్‌కు చేరుకున్నారు.

గాల్వాన్ ఘర్షణలో గాయపడి  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను పరామర్శించారు. నాటి ఘటన గురించి నేరుగా సైనికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జవాన్ల భుజం తట్టి వారి ధైర్య సాహసాలను అభినందించారు.మీ లాంటి ధైర్యవంతులైన సైనికుల వల్లే నేను ఈ మాటలు చెప్పగలుగుతున్నా’ అని లేహ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను ఉద్దేశించి అన్నారు.

విస్తరణవాదం యొక్క యుగం ముగిసిందని, ఇది అభివృద్ధికి సమయమని చైనాను పరోక్షంగా ప్రధాని హెచ్చరించారు. వేలాది సంవత్సరాలుగా ఎన్నో దాడులు ఎదుర్కొని, సమర్ధంగా తిప్పికొట్టామని అన్నారు. ఈ భూమి వీరభూమి.. వీరత్వం ద్వారానే శాంతి లభిస్తుందని, బలహీనులు శాంతిని సాధించలేదు.. శాంతి సాధించాలంటే ధైర్యసహసాలు అవసరమని ఉద్ఘాటించారు. భారత్ శక్తిసామర్ధ్యాలు అజేయమని అన్నారు.14 కార్ప్స్ సైనికుల శౌర్య పరాక్రమాల గురించి  చెప్పుకుంటూ దేశమంతా గర్విస్తోందని అన్నారు. భారత్ శక్తి సామర్థ్యాలు అపారమని, నేవీ, ఆర్మీ, వాయు, పదాతిదళంలో మరింత శక్తివంతమయ్యామని అన్నారు. అనేక క్లిష్ట, సంక్షోభ సమయంలో ప్రపంచం వెంట భారత్ నిలిచిందని గుర్తుచేశారు. పిల్లనగ్రోవిని ఊదే కృష్ణుడిని పూజిస్తాం.. సుదర్శన చక్రం ఉండే అదే కృష్ణుడిని ఆరాధిస్తాం అన్నారు. సైనిక దళాల మెరుగైన సామర్థ్యం కోసమే సీడీఎస్ ఏర్పాటుచేసినట్టు ప్రధాని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో సైనికులు ఉండబట్టే దేశం మొత్తం నిశ్చితంగా ఉందన్నారు.

సైనికుల్లో ధైర్యాన్ని పెంచింది..కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

చైనా బోర్డర్‌‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మోడీ పర్యటన సైనికుల్లో ధైర్యాన్ని పెంచిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మోడీకి థ్యాంక్స్‌ చెప్పారు. “ లడాఖ్‌ వెళ్లడం, సోల్జర్స్‌ను కలుసుకుని వాళ్లను ఎంకరేజ్‌ చేయడం సైనికుల్లో కచ్చితంగా ధైర్యాన్ని పెంచింది. ఆర్మీ చేతుల్లో బోర్డర్స్‌ ఎప్పుడూ సేఫ్‌గా ఉంటాయి” అని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ట్వీట్‌ చేశారు. గాల్వాన్‌ ఘటన జరిగిన తర్వాత మోడీ మొదటిసారి శుక్రవారం లడాఖ్‌ పర్యటనకు వెళ్లారు. ఆర్మీ చీఫ్‌ నర్వానే, సీడీఎస్‌తో బిపిన్‌ రావత్‌తో కలిసి పర్యటించిన మోడీ సైనికులతో మాట్లాడారు. ఆర్మీ, ఎయిర్‌‌ఫోర్స్‌, ఐటీబీపీ సిబ్బందితో మోడీ ముచ్చటించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు