బి.సి మహా ధర్నాను జయప్రదం చేయండి


 బి.సి మహా ధర్నాను జయప్రదం చేయండి 
ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ 


    కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో బాగంగా కామారెడ్డి డిక్లరేషన్ లో పొందుపరిచిన కుల జనగణన, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు తదితర అంశాల సాధన కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద ఈ నెల 15 న బి.సి. కుల, సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరుగు బి.సి మహా ధర్నాకు వేల సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా కేంద్రం, బాలసముద్రం సిపిఐ జిల్లా కార్యాలయంలో  గురువారం జరిగిన బహుజన సంఘాల రౌండ్ టేబుల్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్షం వహిస్తుందని ఆయన అన్నారు. కామారెడ్డి బి.సి డిక్లరేషన్ లో పొందుపరచిన అంశాలను అమలు చేయాలని, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బి.సి కులగణన బిల్లు ఆమోదించాలని, కులగణనకు చట్టబద్ధత కల్పించాలని, కులగణన విధివిధానాల కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, కులగణనలో బీహార్ ర్రాష్టాన్ని మోడల్ గా తీసుకోవాలని, ఇతర అంశాలైన స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు తదితర అంశాల అమలు ప్రణాళికలను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జరగనున్న బి.సి మహా ధర్నాను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

    ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మేధావుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొంగ వీరాస్వామి మాట్లాడుతూ నిత్యం శ్రమలో, చాకిరిలో ఉంటూ ఉత్పత్తిలో కీలక భూమిక పోషిస్తున్న బి.సి ల స్థితి నానాటికి దుర్భరంగా మారుతుందని, బి.సి లు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సముచిత వాటా పొందలేకపోతున్నారని, ఉత్పత్తి, శ్రమతో పాటు ఏ రాజ్యం ఏర్పడాలన్నా బి.సి ల ఓట్లు కీలకమవుతున్నాయని, బి.సి ల ఓట్లను పొందడం కోసం ఎన్నో హామీలను గుప్పిస్తున్న ఆయా పార్టీలు వాటి అమలులో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్నారని  ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ చింతకింది కుమారస్వామి మాట్లాడుతూ  బి.సి లలో ఐక్యత, బలమైన నాయకత్వం లేకపోవడం వల్లనే నష్టం జరుగుతుందని, చెల్లాచెదరైన బి.సి సంఘాలను ఒక తాటిపై తెచ్చి హక్కులను సాధించాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఎన్నో ఏండ్లుగా డిమాండ్ చేస్తున్న కుల జనగణన సాధనతోనే బి.సి ల అభివృద్ధి ప్రణాళిక ముడిపడి వుందని, అందుకోసం కుల సంఘాల, ప్రజా సంఘాల, వృత్తి సంఘాల నాయకులు,  మేధావులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, విద్యావంతులు, విద్యార్థులు పార్టీలకు అతీతంగా బి.సి మహా ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దళిత బహుజన సంఘాలు బి.సి ఉద్యమానికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్రం ముందు నుండి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్ల నుండి బి.సి లవి కానీ ఎన్నో ఉద్యమాల్లో బి.సి పాల్గొని ఎన్నో త్యాగాలు చేసారని, ఆధిపత్య, దోపిడి వర్గాలకు అధికారం కట్టబెట్టి నిత్యం దేహీ అని అడక్కుతినే దుస్థితిలో కొనసాగుతున్న బి.సి లు నేడు బి.సి ల కోసం జరిగే ఈ పోరాటంలో పాల్గొని హక్కులు, ఆత్మగౌరవం, అధికారం సాధించుకోవాల్సిన అవసరముందని ఆయన అన్నారు. 

   ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, రాష్ట్ర నాయకులు డాక్టర్ కొంతం కృష్ణ, ఎఐఒబిసి రాష్ట్ర కమిటీ నాయకులు న్యాయవాదులు కూనూరు రంజిత్ గౌడ్, రాచకొండ ప్రవీణ్ కుమార్, ఎగ్గడి సుందర్ రామ్, పూలే సామాజిక న్యాయ వేదిక చైర్మన్ కేడల ప్రసాద్, తెలంగాణ జిల్లాల పూలే యువజన సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు జంపాల విశ్వ, విశ్రాంత ఉపాధ్యాయులు సైదులు, ప్రజా గాయకులు కొమరం సాకి, బిరుదురాజు శ్రీధర్ రాజు, మామిడి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు