పివి సాబ్..మీరు హ్యాపీనా..!?

 


పివి సాబ్..మీరు హ్యాపీనా..!?


తెలుగు జాతి ముద్దుబిడ్డ..

తేట తెనుగు మీగడ గడ్డ..

బహుభాషా కోవిదుడు..

మహా మేధావి..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్

మాజీ ముఖ్యమంత్రి..

దివం'గత' మాజీ ప్రధాని

పి వి నరసింహారావుకు

భారతరత్న ప్రకటించినంతనే

మనసు ఆనందంతో గంతులు వెయ్యాలి..

కానీ అలా అనిపించలేదు..

ఇచ్చారులే..అన్న సంతోషం వినా హృదయం ఉప్పొంగి పోవడం లేదు..గర్వంగానే 

అనిపిస్తున్నా మనసు లోపలి పొరల్లో ఏదో మెలిక..భారతరత్న అందుకోడానికి అన్ని అర్హతలూ ఉన్న తెలుగు

జాతి రత్నానికి ఇన్నాళ్ళకు

ఆ అత్యున్నత పురస్కారం

లభించబోతోంది కదా..

అనే సంతృప్తిని కప్పేస్తూ

ఏదో ఒక బాధావీచిక..


*_దీనికి కారణం..!?_*


అంతటి మహనీయునికి

బ్రతికి ఉండగా ఇవ్వలేదనా..


మరణించిన ఇన్నాళ్ళకైనా

ఇచ్చారు కదా..


పివి సొంత పార్టీ ప్రభుత్వాలు భారతరత్న కట్టబెట్టక పోవడమా..సరేలే..ఆయన అంత్యక్రియలే సక్రమంగా

జరిపించని కాంగ్రెస్ పెద్దలు

ఆయన్ని అత్యున్నత పురస్కారంతో గౌరవించే ప్రయత్నం చేస్తారా..ఊహు..


మరి ఆయన పార్టీ కాకపోయినా బిజెపి పెద్దలు 

ఆయనకు భారతరత్న ప్రదానం చెయ్యబోతున్నారు

కదా..ఇంకేంటి బాధ..


అక్కడికే వస్తున్నా..


ఈ ఏడాది ఇప్పటికే భారతరత్న నలుగురికి ప్రకటించారు.ఆ నలుగురిలో పీవి కూడా ఉన్నారు.సరే..

కానీ తొలిగా పీవీ పేరు లేకుండా భారతరత్న ప్రకటించడం ఎంతైనా ఇబ్బందిగా అనిపించడం లేదూ..ముందు ఠాకూర్ కి ప్రకటించి ఆపై సొంత పార్టీకి చెందిన మహానాయకుడు..

ఆ పార్టీకి ఇంతటి వైభోగం దక్కడానికి మూలకారకుడైన

లాల్ కిషన్ అద్వానీకి ప్రకటించారు.అద్వానీకి ఇచ్చినప్పుడే దానికి జనం రాజకీయాన్ని ఆపాదించారు.

పోనీ తమ పార్టీకి చెందిన కురువృద్ధుడు అద్వానీకి ఇచ్చినప్పుడైనా పీవీ గుర్తు రాలేదు.అద్వానీకి ఇచ్చినప్పుడు రాజకీయమకిలి కొంత అంటింది గనక

దానిని మరమ్మతు చేసే ప్రయత్నంలో పడిన బిజెపికి

అకస్మాత్తుగా పీవీ జ్ఞప్తికి వచ్చినట్టు అనిపిస్తోంది.

తమ పార్టీకి చెందిన అగ్రనేతకు రాజకీయ ప్రయోజనాలు ఆశించి భారతరత్న ప్రకటించినట్టు 

విస్తృతంగా జరుగుతున్న

ప్రచారాన్ని తిప్పి కొట్టడానికే

ఇప్పుడు పివిపై ప్రేమ పుట్టుకొచ్చి ఆయనకు అత్యున్నత పురస్కారం

ప్రకటించినట్టు అనిపిస్తోంది.

సొంత పార్టీ నిరాదరణకు

గురైన గొప్ప నాయకుణ్ణి మేము గుర్తించాము సుమా అని చెప్పుకోవడానికి పివికి

భారతరత్న ప్రదానం చేయబోతున్నట్టు

అనిపిస్తుంటేనే..కొంత హృదయం మెలి పెట్టినట్టు

అనిపించడం లేదూ..

ఇది రాజకీయ ప్రకటన సుమా అన్న భావన ప్రియతమ దివంగత మాజీ ప్రధాని పీవికి అత్యున్నత పురస్కారం ప్రకటించిన

ఆనందాన్ని మింగేస్తోంది.


మొత్తానికి 2024 ఎన్నికల వేళ మోడీ సర్కార్

పురస్కారాలను రాజకీయ

ప్రయోజనాల కోసం వాడుకుంటుంది సుమా..

అన్న విమర్శల నడుమ పీవీకి అత్యున్నత పురస్కారం ప్రకటించడం

ముదావమే అయినా దీని వెనుక..

రాజకీయ సందోహమూ..

చిత్తశుద్ధి సందేహమూ..

ఉన్నట్టుగానే భావించక తప్పడం లేదు.


అత్యంత అరుదైన మేధావి..

భారత ఆర్థిక వ్యవస్థను

తన ఆర్థిక సంస్కరణలతో

గాడీలో పెట్టడమే గాక

ఇవాళ మనం గర్వంగా చెప్పుకుంటున్న విశ్వనేత

స్థాయికి బీజాలు వేసిన పరిపాలనా దురంధరుడు..

మించి అపర చాణక్యుడు

పీవీ నరసింహారావుకు

ఇప్పుడు భారతరత్నం..

ఎప్పుడో దక్కాల్సిన గౌరవం..

ఇప్పుడు ఇలా..!?


*_ఇంతకీ..నరసింహారావు ఆత్మ సంతసిస్తుందా..?_*


*_సురేష్..9948546286_*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు