చట్టసభల్లో వాటాకై బి.సి మహా పాదయాత్రను విజయవంతం చేయండి

 



చట్టసభల్లో వాటాకై బి.సి మహా పాదయాత్రను విజయవంతం చేయండి

 

   ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్


   సకల సామాజిక రంగాలలో మేము ఎంతమందిమో మాకు అంత వాటా కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా చట్టసభల్లో బి.సి వాటా సాధన కోసం   మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం మిరుగోన్ పల్లి నుండి మార్చి ఒకటి నుండి జరుగు బి.సి మహా పాదయాత్రలో ప్రజలు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని ఆలిండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్  పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్లో వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పాదయాత్ర కరపత్రాలను విడుదల చేసి ఆయన మాట్లాడారు.

   జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలంటే చట్టసభల్లో సమాన వాటాతో  మాత్రమే సాధ్యమవుతుందని, ఆ వాటా సాధన కోసం పోరాటాలకు పుట్టినిల్లు, వీరులను కన్న తెలంగాణ గడ్డ నుండి ప్రారంభమై బహుజన వీరుల ఉద్యమ ప్రాంతాలను సందర్శిస్తూ సాగే ఈ యాత్ర దేశవ్యాప్తంగా కొనసాగించి  అంతిమంగా చట్టసభలలో వాటా సాధిస్తామని అన్నారు.

   ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఓబీసీ జాక్ వైస్ చైర్మన్ వెలుగు వనితక్క మాట్లాడుతూ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న బీసీలకు పాలనలో వాటా మాత్రం దక్కడం లేదని ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయని ఆదిపత్య కులాలు అధికారం హస్తగతం చేసుకున్నారని నిత్యం శ్రమలో పాల్గొనే బి.సి లకు మాత్రం ఎలాంటి రిజర్వేషన్లు లేక అధోగతి పాలవుతున్నారని అన్నారు. చట్టసభల్లో వాటా సాధన కోసం బి.సి వీరులైన పండగ సాయన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ, బెల్లి లలితక్క, శ్రీకాంతాచారి, మారోజు వీరన్న, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న లను స్ఫూర్తిగా తీసుకొని చేస్తున్న బి.సి మహా పాదయాత్రలో మహిళలు, యువత ఉద్యమకారులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

    ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి.సి రైటర్స్ వింగ్ నాయకులు డాక్టర్ చిత్తం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మేమెంత మందిమో మాకంత వాటా కోసం బి.సి కుల గణన చేపట్టి చట్టసభల్లో రాజ్యాంగబద్ధంగా బి.సి లకు వాటా సాధించే యుద్ధంలో మేధావులు, ప్రగతిశీల వాదులు, విద్యార్థులు, సామాజిక న్యాయం కోరుకునేవారు పాల్గొని చట్టసభలలో బి.సి వాటా సాధించాలని ఆయన  విజ్ఞప్తి చేశారు. దేశంలో, రాష్ట్రంలో జరిగిన ఎన్నో పోరాటాలలో ఎన్నో త్యాగాలు చేసిన బి.సి లు నేడు బి.సి ల కోసం సాగే పోరులో కీలకంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

   ఈ కార్యక్రమంలో ఆలిండియా ఓబీసీ జాక్ రాష్ట్ర నాయకులు ఏటిగడ్డ అరుణక్క, చాపర్తి కుమార్ గాడ్గే, పద్మజా దేవి, దిడ్డి ధనలక్ష్మి, సద్గుణ,  న్యాయవాది కూనూరు రంజిత్ గౌడ్, వివిధ సంఘాల నాయకులు ఐతం నగేష్, న్యాయవాది రాచకొండ ప్రవీణ్ కుమార్, సిద్ధి రాజు యాదవ్, గోధుమల కుమారస్వామి, కూరాకుల భారతి, చంటి ముదిరాజ్, సూర స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు