ఈ స్వామి అద్భుతవచనాల విన్యాసి!

 


ఈ స్వామి 

అద్భుతవచనాల విన్యాసి! 


ఎప్పుడు పుట్టాడో

అప్పటి నుంచి 

ఆగని ప్రయాణమే..

జీవితం మొత్తం

ఉన్నత ప్రమాణమే..

బతుకుతెరువు కోసం కాదు 

తన పయనం..

పిన్న వయసులోనే తెరచుకున్న 

జ్ఞాననయనం

తనను తాను తెలుసుకుంటూ..

భగవంతుణ్ణి వెతుక్కుంటూ..!


ఆగలేదు..వీగలేదు..

జన్మభూమి నుంచి

మరుభూమి వరకు

అలుపెరుగని నడక

తెలియని ప్రయాస

దేవుడెక్కడన్నదే మీమాంస

నిరంతర జ్ఞానపిపాస!


సిద్ధాంతాలు..పిడివాదాలు

దేవాలయాలు..

సంప్రదాయాలు..

తగవని చెబుతూ 

ఆనవసర వాదాలు..

జీవుడే దేవుడని..

దరిద్ర నారాయణ సేవే

పరమార్థమని..

అదే యదార్ధమని

గ్రహించి..తా నిగ్రహించి..

ఉన్నతమైనది 

ఆధ్యాత్మిక శక్తని నమ్మి

జీవిత పర్యంతం

అదే ఆర్జించె...

దుర్గుణాలను నిర్జించి..!


అన్ని మతాలు సమ్మతమేమని..

ఏ మతానికైనా

మానవతే అభిమతమని..

ఆ మానవతకు..

అందులో సమానతకు

తన జీవితం అంకితమని

ప్రకటించిన 

నిజమైన సన్యాసి..

నిరంతర పదన్యాసి..

అద్భుత వచనాలవిన్యాసి!


ఎంతటి మహత్కార్యమైనా

ఆరంభం స్వల్పమని..

నిరాశ వీడితే ఫలితాలు

అద్భుతమని..

అందుకే గమ్యం చేరేదాకా

గమనం ఆపరాదని భావన

అందాకా అప్రమత్తమని బోధన

జీవితం మొత్తం 

అదే సాధన..!


అన్వేషి పాత్రలో

నరేంద్రుని యాత్రలో

ఒకటే ప్రశ్న..

దేవుని చూసారా..

సమాధానమై ప్రత్యక్షమైన 

ఒకే రూపం

సన్యాసుల్లో కలహంస

రామకృష్ణ పరమహంస..

అంతటి గురువుకూ

తప్పని పరీక్ష..

మొత్తానికి ఆ సన్నిధిలోనే

ఫలించిన నరేంద్రుని ప్రతీక్ష!


ఒకనాడు పస్తులున్నా

తరగని విలువల ఆస్తులు..

తానుగా చేస్తున్నా లంఖనాలు

ఆగని దానాలు..

కదిలిందంటే స్వామి రథం

మహరాజులైనా పట్టినట్టే బ్రహ్మరథం..

అలా జేజేలతోనే

ఆవిర్భవించింది 

వివేకుని ఆధ్యాత్మిక సౌధం!


రూపం ముగ్ధమనోహరం

మాట సమ్మోహనం..

ఆ మోమున 

కోటి సూర్యుల వెలుగో..

ఆకట్టుకున్న 

పలుకుల సొబగో..

మురిసింది చికాగో..

ఒకే ఒక్క ప్రసంగం..

తలవంచింది ప్రపంచం!


వివేకానందుని ఉనికితో

భారతీయ సిద్ధాంతాలకు

మరోసారి మహర్దశ..

ఇంత చేసిన స్వామికి

ఎందుకో మరి

పిన్న వయసులోనే

ముంచుకొచ్చిన చివరిదశ

బహుముఖుడు అంతర్ముఖుడై..

ఆధ్యాత్మిక చింతనతోనే

చేరాడు మృత్యువు చెంతన..!

యువజన దినోత్సవం...

స్వామి వివేకానంద జయంతి

12.01.1863..సందర్భంగా

శిరస్సు వంచి నమస్కరిస్తూ..


ఎలిశెట్టి సురేష్ కుమార్

         9948546286


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు