స్వాభిమాన పోరాటాలకు బీమా కోరేగావ్ స్ఫూర్తి

 


జనవరి ఒకటి శౌర్య దివస్


స్వాభిమాన పోరాటాలకు బీమా కోరేగావ్ స్ఫూర్తి


బీమా కోరేగావ్ స్పూర్తితో బహుజన రాజ్యం


బీమా కోరేగావ్ విజయానికి 206 ఏండ్లు


   బీమా కోరేగావ్ యుద్ధం తరువాతనే నాకు చదువుకునే అవకాశం వచ్చింది. నేను చదువుకున్నాక బ్రాహ్మణుల కుట్రలు తెలుసుకున్నాను. చదువులేమి వల్లే ఇదంతా జరిగింది. అందుకే శూద్ర, అతిశూద్ర జాతుల చదువు కొరకు పాఠశాలను స్థాపించాను. పీష్వా బ్రాహ్మణులను ఓడించిన జాతుల నుండే నా పోరాటాన్ని మొదలుపెట్టాను.

...మహాత్మ జ్యోతిరావు పూలే


   1757లో ఈస్ట్ ఇండియా కంపెనీ దళాలు, బెంగాల్ నవాబ్ సిరాజుద్దీన్ దౌలా సైన్యాలకు మధ్య జరుగిన యుద్ధంలో బ్రిటిష్ దళాలు గెలిచాయి. చరిత్రలో దీనికి ప్లాసి యుద్ధమని పేరు పెట్టారు. చివరి యుద్ధంలో పీష్వా(బ్రాహ్మణ) సామ్రాజ్యం ధ్వంసమై ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యం  స్థాపించబడింది. మధ్యకాలంలో దుసాద్ ల నుండి మహార్ సైనికుల వరకు అన్ని విజయాలు, మూల భారతీయ సైనికుల సహాయంతోనే సాధ్యమైనాయి. 

 ...డా. బి.ఆర్. అంబేడ్కర్


    ఆత్మగౌరవం కోసం తాపత్రయం, పూర్వీకుల శౌర్యాన్ని కీర్తించుకునే ఆరాటం, తమకోసం పోరాడిన వాళ్ళను గౌరవించుకోవాలనే తపన, తమకోసం పాటుపడిన  వాళ్ళను సత్కరించుకోవాలనే అభిలాషకు కూడా అవకాశం లేని స్థితిలో నేటి దళిత సమాజం ఉనికి కోసం పోరాటం చేస్తుంది. స్వాతంత్రం సిద్దించి 75 ఏండ్లు దాటినా నేటికి వేల ఏండ్ల క్రితం మనువు గీసిన తలరాత ఆధునిక పాలకుల రూపంలో కొనసాగుతుంది. దళితులపై, గిరిజనులపై జరుగుతున్న హత్యాచారాలు, అఘాయిత్యాలు చూస్తే దళిత బతుకుల దారుణ చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నాయి. 

    మూతికి ముంత ముడ్డికి తాటాకు చీపురు కట్టి పశువులకన్నా హీనంగా బతకాలని దేశ మూలవాసి ప్రజలను నీచమైన బానిసత్వానికి గురిచేసిన పీష్వా బ్రాహ్మణులపై మహార్ పోరాట యోధులు చేసిన యుద్ధ విజయానికి చిహ్నమే బీమా కోరేగావ్. బానిస సంకెళ్లను తెంచుకోవడానికి 500 మంది మహార్ పొరాటయోధులు 28 వేల మంది పీష్వా బ్రాహ్మణ సైన్యంతో మహారాష్ట్ర కోరేగావ్ లోని బీమా నది వద్ద భీకర యుద్ధం చేసి 1818 జనవరి 1 న విజయం సాధించారు. అపార సైనిక బలగం కలిగిన పీష్వా రాజ్యంతో యుద్ధం చేయలేని స్థితిలోనున్న బ్రిటిష్ వాళ్లు వారితో కలిసి పీష్వా సైన్యంతో యుద్ధం చేయాలని మహార యోధులను కోరారు. యుద్ధం చేసే ముందు అప్పటి మహార్ నాయకుడు సుబేధార్ శిక్ నాక్ పీష్వా సైన్యాధికారి బాపు గోఖులే వద్దకు వెళ్లి పశువులకన్నా హీనంగా చూడబడుతున్న మాకు గౌరవంగా బతికే అవకాశం కల్పించాలని కోరారు. యుద్ధం చేసినా, చేయకపోయినా మీ బతుకులకు మేము ఇచ్చే స్థానం ఇంతేనని గోఖులే ఖరాకండిగా చెప్పారు. 

  వేల సంవత్సరాల బానిస సంకెళ్లు తెంచుకోవడానికి ప్రతిన బూనిన 500 మంది మహార్ పోరాట యోధులు 200 మంది బ్రిటీష్ సైన్యంతో కలిసి రెండు వందల కిలోమీటర్లు నడిచి బీమా నది ఒడ్డుకు చేరుకున్నారు. 20 వేల మంది పధాతిదళం, 8 వేల మంది అశ్విక దళంతో కనుచూపుమేరలో కనిపిస్తున్న పీష్వా సైన్యాన్ని చూసిన బ్రిటిష్ సైన్యం అక్కడి నుండి జారుకుంది. బతికితే పోరాట వీరులుగా బతకాలని లేదంటే హీనమైన బతుకులతో చావాలని నిర్ణయించుకున్న మహార్ సైన్యం పీష్వా సైన్యంతో యుద్ధానికి సిద్ధమయ్యారు. తిండిలేక కాలినడకన వచ్చిన మహార్ సైన్యం సింహాల్లాగా పీష్వా సైన్యాన్ని ఉరికించడాన్ని దూరంగా నిలబడి చూసిన బ్రిటీష్ అధికారి లెఫ్ట్ నెంట్ కల్నల్ ఆశ్చర్యపోయారు. విరామం లేకుండా జరిగిన భీకర యుద్ధంతో భీమా నది పీష్వా సైనికుల రక్తంతో ఎర్రబడింది. పీష్వా సైన్యాధ్యక్షుడి కొడుకైన గోవింద్ బాబా తలను తెగనరికితే ఆ తల లేని కొడుకు మొండాన్ని చూసి ఏడుస్తూ భయంతో అందరూ పారిపోండంటూ పూల్లావ్ లోని బాజీరావ్ శిబిరం వైపు పీష్వా సైన్యం పారిపోయారు. అమరులైన 12 మంది మహార్ సైనుకులకు స్మృతి చిహ్నంగా బ్రిటిష్ వారు స్మారక స్థూపం కట్టించడమే కాకుండా మహర్ సైనికులతో మహర్ రెజ్మెంట్ ఏర్పాటు చేశారు. 1927 జనవరి 1 న ఈ స్మారక స్థూపాన్ని మొట్టమొదటిసారి సందర్శించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆ స్థూపాన్ని దళితుల ఆత్మగౌరవ చిహ్నంగా, ఆత్మగౌరవ ప్రతీకగా పేర్కొన్నారు. అంబేద్కర్ సందర్శించిన నాటి నుండి ప్రతి సంవత్సరం లక్షలాది దళిత బహుజనులు జనవరి ఒకటిన బీమా కోరేగావ్ సందర్శనకు వెళుతారు. దేశ వ్యాప్తంగా దళిత గౌరవం నిలిచి గెలిచిన రోజుగా శౌర్య దివస్ గా  జరుపుకొని కోరేగావ్ వీరులను స్మరించుకుంటారు. 

   అంటరానితనం చరిత్ర చూస్తే అత్యంత క్రూరమైన అంటరానితనం పీష్వా బ్రాహ్మణ రాజ్యమైన పూణే ప్రాంతంలో జరిగింది. దళితుల నీడ కూడా అగ్రవర్ణాపై పడకూడదని,  దళితులు పొద్దున్న, సాయంత్రం అగ్రవర్ణాల వారి ఇళ్లకు కానీ వారి దెగ్గరకు కానీ పోగూడదని తన నీడ తనపైన పడే పట్టగలు మాత్రమే వెళ్లాలనే నిబంధన ఉండేది. పీష్వాల కన్నా ముందు శివాజీ పాలనలో ఇలా ఉండేది కాదు. శివాజీ పాలనలో సైన్యంలో ఉన్న మహార్ లను పీష్వా బ్రాహ్మణులు తొలిగించి మనుధర్మాన్ని పకడ్బందీగా అమలుపరిచారు. 200 సంవత్సరాల క్రితం జరిగిన బీమా కోరేగావ్ యుద్ధ గాయం ఇంకా మానడంలేదు. యుద్ధం జరిగి 200 ఏండ్ల సందర్బంగా జరుపుకునే ఉత్సవాలపై అగ్రవర్ణాలవారు దాడి చేశారు. ఇప్పటికి దళితులు అగ్రవర్ణాల మధ్య తారతమ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. నేటి పాలకులు దళిత ఉద్యమాలను జాతీయ వ్యతిరేక ఉద్యమాలుగా ప్రచారం చేస్తూ దేశ ద్రోహులతో సంబంధాలు పెట్టుకొని చేస్తున్నారని తప్పడు ప్రచారం చేస్తున్నారు. గత ఐదు సంవత్సరాల క్రితం బీమా కోరేగావ్ లో జరిగిన అల్లర్లు చూస్తే దళితుల పట్ల అగ్రవర్ణాల అసహనం కనిపిస్తుంది. మణిపూర్ లో ఆదివాసీలపై జరిగిన ఘోరమైన మారణకాండ చూస్తే ఆధిపత్య వర్గాల తీరు వారికి అండగా నిలిచిన బిజెపి సర్కారు చర్యలు ప్రపంచం సిగ్గు పడేలా ఉన్నాయి. హీనంగా చూడబడే వాళ్ళు తలెత్తుకు తిరిగితే వారిపై అణచివేత, దాడులు, హత్యాచారాలు జరుగుతున్నాయి. దళిత, ఆదివాసీ జాతిపై వ్యతిరేకత లేదని దళిత వాడల్లో భోజనాలు చేస్తూనే మరోపక్క కోరేగావ్, మణిపూర్ లాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఇప్పటికి వివక్ష ప్రపంచంలో అన్నిచోట్ల ఉంది. ఇండియాలో దళిత, గిరిజనులపై వివక్ష, అమెరికాలో బ్లాక్స్ పై వివక్ష, ప్రపంచమంతా మహిళపై వివక్ష కొనసాగుతుంది.

    మూతికి ముంత ముడ్డికి తాటాకు చీపురు కట్టి పశువులకన్నా హీనంగా బతకాలని దేశ మూలవాసి ప్రజలను నీచమైన బానిసత్వానికి గురిచేసిన పీష్వా  బ్రాహ్మణులపై మహార్ పోరాట యోధులు యుద్ధం చేసి విజయం సాధించిన చరిత్ర, ఆ వీరుల వారసులైన దళిత బహుజనులు ప్రస్తుత పరిస్థితిలో ఏమి చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చావుకే వెన్నులో వణుకు పుట్టించిన మనం ఈనాడు మన అక్క చెల్లెళ్లపై అత్యాచారాలు జరిగినా, నడి వీధిలో నగ్నంగా ఊరేగించి హత్యాచారాలు చేసినా నోరెత్తడం లేదు. మన పిల్లలను ఇంట్లో బంధించి నిప్పు పెట్టినా ఏడుస్తూ కూర్చుంటున్నాం. మనకు అందని చదువుల కోసం ఆరాటపడుతున్నాం. ఇష్టమైన బట్టలు కట్టుకునే స్థితిలో లేము, ఇష్టమైన తిండిని కూడా దైర్యంగా తినలేకపోతున్నాం. శత్రువులతో చేతులు కలిపి మన మీద జరుగుతున్న దాడులను ఆదాయ వనరులుగా, రాజకీయ ఎదుగుదలకు వాడుకుంటూ స్వాభిమానాన్ని తాకట్టు పెడుతున్న కోవర్టులు, చెంచాగాళ్ళు మన శక్తిని నిర్వీర్యం చేస్తున్నా మనం వారికి జేజేలు కొడుతున్నారు. 

   ఎంత ఆర్ధిక స్థితిమంతులం అయినా, కొంచెం స్వాభిమానం ప్రదర్శిస్తే దాడులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంత అన్యాయానికి గురై, న్యాయం చేయండి మహాప్రభో అని రోడ్డెక్కి దేబురించి అడుక్కుని, తన్నులు తినే నీచమైన హీన స్థితికి దిగజారడానికి కారణం ఎవరు? బాబాసాహెబ్ చేసిన త్యాగాల ద్వారా, మెరుగైన ఆర్థిక స్థితిని పొంది, స్వాభిమానంతో కూడిన జీవితం పొందిన ఈనాటి దళిత, గిరిజన సమాజం తమ చరిత్రను తెలుసుకోకుండా శతృ వ్వవస్థ పన్నిన ఉచ్చులో పడి కేవలం ఆటవిడుపులోనే ఆనందం వెతుక్కుంటూ మన పూర్వికులు మనకు సాదించి పెట్టిన స్వాభిమానాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారన్నది నిజం కాదా?

    దళిత గిరిజనులు మాట్లాడితే పాపం పోరాడితే కోపం, మౌనంగా ఉంటే శాపం అనే స్థితిలో ఉన్న మన దేశంలో దళిత గౌరవం నిలిచి గెలిచిన బీమా కోరేగావ్ యుద్దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఓటు ద్వారా యుద్ధం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఆనాడు ప్రత్యక్ష యుద్ధం చేసిన బహుజనులు నేడు ప్రజాస్వామ్య దేశంలో  అంబేడ్కర్ కల్పించిన ఓటు ద్వారా తను చూపిన మార్గంతో బహుజన రాజ్యం కోసం దళిత బహుజనులు కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగాలి. వేల సంవత్సరాలుగా విద్య, ఆస్తి, అధికారం దక్కకుండా బతికిన బహుజనులకు బ్రిటిష్ కాలంలో విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించబడి స్వాభిమానంగా జీవించే అవకాశం దొరికింది. బ్రిటిష్ పాలనకు తోడుగా మహాత్మ జ్యోతిరావు పూలే, పెరియార్, సాహుమహారాజ్, నారాయణ గురు, అంబెడ్కర్ లాంటి మహానుభావులు చేసిన పోరాటాల వల్ల ఆనాటి మనువాద దాస్యశృంఖలాల నుండి బయటపడే ప్రయత్నం జరిగింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినాక దేశీయ అగ్రవర్ణ పాలకుల దోపిడీ, అణచివేత, దాడులు మళ్ళీ పునరావృతమయ్యాయి. బ్రాహ్మనిజం నుండి బయటపడుతున్న బహుజన ప్రజలను ప్రపంచీకరణ, ప్రైవేటీకరణతో దోచుకోవడం మొదలుపెట్టి నిరాటంకంగా దోపిడీ అణచివేత కొనసాగుతుంది. ఇంతటి ప్రమాదకర స్థితిలో ఉన్న బహుజన ప్రజలను రక్షించుకోవడానికి బహుజనుల్లో ఎదిగిన వాళ్ళు విలువలతో కూడిన రాజకీయాల నిర్మాణం చేసి బీమా కోరేగావ్ వీరుల స్పూర్తితో, పూలే, పెరియార్, అంబేడ్కర్ చూపిన మార్గంలో బహుజన రాజ్య నిర్మాణం కోసం కృషి చేయాల్సిన అవసరముంది. 

    కొత్త సంవత్సరం పార్టీలు అంటూ మన చరిత్రను మననం చేసుకునే ఖాళీ కూడా లేకుండా క్లబ్, పబ్ లలో తాగి ఎగరడానికి తమ సమయం, డబ్బు వృధా చేసుకోవడం ఆత్మహత్యా సాదృశ్యం. విజయోత్సాహంతో కూడిన ఘన చరిత్రను మరచిపోయి, రావణుని వర్థంతి, నరకాసురుని వర్థంతి అంటూ ఓడిపోయిన, చంపబడిన వాళ్ళ వారసత్వాన్ని భుజాలకెత్తుకుని, ఓటమి గాధలతో వివక్ష కథలతో, సానుభూతి కోసం వెంపర్లాడుతూ, శాశ్వత పీడితులుగా మిగిలిపోతున్నారు. రండి  కొత్త సంవత్సర వేడుకలు కాదు గ్రామ గ్రామాన విజయోత్సవ వేడుకలు చేసుకుందాం. జనవరి 1 ని శౌర్య దినోత్సవంగా జరుపుకుని, మన వీరుల గాథలను మన పిల్లలకు వివరిద్దాం.


(జనవరి 1 న బీమా కోరేగావ్ శౌర్య దినోత్సవం సందర్బంగా)



....సాయిని నరేందర్

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

    9701916091

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు