చాసో..అక్షరాల్లో ఎంత కసో..!

 చాసో..అక్షరాల్లో 
ఎంత కసో..!



చాగంటి సోమయాజులు

జయంతి..15.01.1915


మేధస్సుకు ప్రతిరూపమైన 

బట్టతల..

ఆ బుర్ర నిండా కథలే..

సగటు మనిషి బాధలే..

చేతిలో చుట్ట..

అది మండినా ఆరిపోయినా

ఆ గుండె 

రగులుతూనే ఉంటది..

పేదోడి కష్టం చూడలేక..

పెద్దోడి ఇష్టం వినలేక..!

ఖంగుమనే గొంతు..

నిలదీయడమే దాని వంతు..!


ఇది చాసో గూర్చి సోసో..

సమగ్రమైతే ఉద్గ్రంధమే..

కథ..కవిత..కథానికల

సౌగంధమే..

ఆయన ఇల్లు వేనవేల

కథల..వ్యధల చర్చలు

పుట్టించిన సౌధమే..!


మనిషి కష్టాన్ని

కథలుగా చెప్పే ముందు

అక్షరాలను తన కోపాగ్నిలో మండించి..

కలమనే రంపంతో

చిత్రీపట్టి బాధల గాథలను

సజీవంగా ఆవిష్కరించిన

చాగంటి సోమయాజులు

రచనలు తారాజువ్వలు..

రచనా సమరాన్ని

కథా కురుక్షేత్రంలో

1941 లోనే దర్మకక్షేత్రం తో

మొదలెట్టిన చాసో..

చుట్ట పొగ ఒగ్గినంత చులాగ్గా

సాహితీ ప్రపంచాన్ని

చుట్టబెట్టేసాడు..!

ఆయన చుట్ట నుసిలోనూ

అవకరాలపై కసి..!!

అక్రమాలపై రుసరుసలూ..

విసవిసలే వెరసి..!!!


చాసో కవితలో కాందశీకుడు..

నీ రూపు నా రూపు కాకపోయినా

నీకూ నాకూ డూపే..

వైరుధ్యాలు..ఆర్థిక సూత్రాలే

మన గోత్రాలని..

సమకాలీన జీవితంలోని

చిత్రాలని ఏనాడో చెప్పిన

సోమయాజులు..

అప్పుడే దర్శించాడు ముందు రోజులు..!


తల్లి వెళ్ళిపోయింది..

వెళ్ళిపోతూ తల్లి గుణం 

చూపించుకుంది...

ఒక్క మాటలో అమ్మతనం..

దాని గొప్పతనం..

చూపించిన మూలధనం

చాసో కలానిది..

ప్రశ్నించే గొప్ప గుణం

ఆయన కవి కులానిది..

అదే ఆయన వెనకేసిన

గ్రంధాల నిధి...

అనుసరిస్తే..ఆచరిస్తే

భావి తరాలకు పెన్నిధి..!


ఎలిశెట్టి సురేష్ కుమార్

      9948546286

       విజయనగరం

(చాసో ఊరే..ఈ ఊరంతా ఆయన పేరే)


(నా జర్నలిస్ట్ జీవితంలో

ఆయనతో ఎన్నోసార్లు మాట్లాడిన 

అద్భుత అనుభవం..

ప్రతి ఇంటర్వ్యూ  

ఓ గొప్ప పాఠం)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు