మరణమే లేని.. మళ్లీ పుట్టని.. ఒకే ఒక సావిత్రి..!

 మరణమే లేని..

మళ్లీ పుట్టని..

ఒకే ఒక సావిత్రి..!



నా వయసేమిటి...

ఆమె వయసేమిటి..


మా అమ్మ కంటే 

చాలా పెద్దది ఆమె...


మరి ఆమె నా అభిమాన నటి ఏంటి..

ఆమె చేసిన సినిమాలు ఒక్కోటి వందల సార్లు చూడ్డం ఏమిటి..


దేవదాసులో పార్వతి..

మూగమనసులులో

రాధమ్మ..

గుండమ్మకథలో లక్ష్మి..

డాక్టర్ చక్రవర్తిలో 

మాధవీ దేవి..

మంచిమనసులులో

శాంతి..

చదువుకున్న అమ్మాయిలులో

సుజాత...

ఇలా ఎన్నని చెప్పను..

ఆమె మోము చూస్తే

అదో రకమైన దివ్యానుభూతి..

ఆ నవ్వు..అదెంత సమ్మోహనం..

మరి ఆ నయనాలు..

అవి కోటి భావాల లోగిళ్ళు..

భాషే అవసరం లేని

అభినయ కలశాలు..

నటనా కళాశాలలు..


ఇవన్నీ ఒక ఎత్తయితే..

ఆమె పెదాలు..

ఒక్క విరుపు..

అదెంత మైమరపు..

అదే మత్తు..

అదే గమ్మత్తు..

దాంతోనే హీరోలు చిత్తు..

నిర్మాతలకు కీమత్తు..!

వినోదమైనా..విషాదమైనా..

విరాగమైనా..సరాగమైనా..

ఆమె మోమున

ఇట్టే కదిలే భావాలు..

మన మనోభావాలకు

ప్రతిరూపాలు..


నిజానికి ఆమె మేను 

నాయిక లక్షణాలకు

సరిపోలేది కాదు..

ఆమె తరంలోనే

అపురూప సౌందర్య రాశులైన జమున..

కృష్ణకుమారి..రాజశ్రీ..

సరోజాదేవి..సంధ్య..

నవరస విదుషీమణి భానుమతి..

ఆపై అంజలీదేవి..

కొంతలో కొంత దేవిక..

అంతకు ముందు కాంచనమాల..కన్నాంబ..

ఇలా ఎందరున్నా

సావిత్రి సావిత్రే..


వాస్తవానికి సావిత్రి కంటే

వాణిశ్రీ నటనకు అవకాశం ఉన్న పాత్రలు చాలా పోషించింది..ఆమె అభినయించని జోనర్ లేదు..నాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఆమె చేసినన్ని

ఇంకెవరూ చెయ్యలేదు..

చీరకట్టు..తలకట్టు..

వీటిలో ఎవరైనా గాని ఓనిశ్రీ ముందు తీసికట్టు..అలాగే స్టెప్పులు..ఎన్టీఆర్..

ఎయెన్నార్..శోభన్..కృష్ణ..

కృష్ణంరాజు..ఎవరితో గెంతినా ఆ హీరోలను మించి

ఉరకలెత్తిన టాలెంట్ వాణిశ్రీ సొంతం..ఇవేవీ చెయ్యకపోయినా సావిత్రి అంటే ఓ స్పెషల్..

అదంతే..


ఒళ్లుగా ఉన్నా ఆమె నాయిక..అభిసారిక..

ఎవరెన్ని పాత్రలు చేసినా

మాయాబజార్ శశిరేఖ..

మార్చేసింది సినిమా 

రూపు రేఖ..

పార్వతి..ఆ అభినయం చూస్తే పోలేదా మతి..

చిన్న పిల్ల మోము..

ఎన్ని భావాలు..

ప్రేమ..చిలిపిదనం..విషాదం..

తన కంటే వయసులో పెద్దవారైన పిల్లలకు సంబంధించి అమ్మతనం..

ఈ సినిమాలో మహాభినయమే సావిత్రి మూలధనం..!


అంత లావుగా ఉన్నా నిర్దోషి..కంచుకోట..

మనుషులు..మమతలు..

విచిత్రకుటుంబం..

చిన్ననాటి స్నేహితులు..

ఇలాంటి సినిమాలు

సావిత్రి అభినయం కారణంగానే హిట్టయ్యాయి.

ఇక రక్తసంబంధం

సినిమాలో చెల్లెలి పాత్ర..

అలా ఎవరైనా చెయ్యగలరా..బహుశా ప్రపంచ సినిమా చరిత్రలోనే 

రాధ పాత్ర ప్రత్యేకమైనదేమో.

తన హీరో ఎన్టీఆర్ అన్నయ్యగా..తాను చెల్లిగా

పాత్రలు పోషించడమే సాహసమైతే ఎన్టీఆర్ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువైనా

ఆయనతో సమానంగా

తన పాత్రను పోషించి

మెప్పించిన అభినయ పరాకాష్ట..రక్తసంబంధం..!


అమ్మ పాత్రలకు వచ్చేపాటికి

మద్యపానం కారణంగా మొహం మారినా అభినయం  అద్భుతమే..అమ్మమాట..

గోరింటాకు..ఇలా ఎన్నో సినిమాల్లో అమ్మగా జీవించిన సావిత్రమ్మ..!.


అభినయానికి ఆమె చిరునామా..

హిట్టుకు తెరనామా..

సావిత్రి...

ప్రేక్షకలోకం ఎప్పటికీ

మరచిపోని ఓ అనుభూతి..

ఇంట్లో మనిషి..

వెండితెర శాశ్వత పట్టమహిషి..!


సురేష్ కుమార్ ఎలిశెట్టి

    9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు