సంపన్న రాష్ట్రంలో పేదలు ఎందుకు పెరుగుతున్నట్లు

 

సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి

   


మిగులు బడ్జెట్ కలిగి సంపన్న రాష్ట్రం అని చెపుతున్న తెలంగాణలో పేదలు ఎందుకు పెరుగుతున్నారని, ఇంకా తెల్ల రేషన్ కార్డుల కోసం, పెన్షన్ల కోసం ప్రజలు ఎందుకు ఎదురుచూస్తున్నారని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణ పీపుల్స్ జాక్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అధ్యక్షతన శనివారం హన్మకొండ జిల్లా కేంద్రం హరిత హోటల్ లో "పదేళ్ల తెలంగాణ-ప్రజల ఆకాంక్షలు-కర్తవ్యాలు అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో పాలకులే ప్రభుత్వ భూమిని వారి అనుయాయులకు కట్టబెడుతున్నారని అన్నారు. హైదరాబాద్ పట్టణంలో 485 చెరువులు, కుంటలు అన్యాక్రాంతం అయ్యాయని అలా అన్యాక్రాంతమైన చెరువుల పట్ల గడిచిన 10 ఏండ్లలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమి లేవని, సమైక్య రాష్ట్రం అంతమొందేవరకు అన్యాక్రాంతమైన భూములెన్ని? తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అన్యాక్రాంతమైన భూములెన్ని? సంపద ఎవరి చేతి నుండి ఎవరి చేతిలోకి వెళ్లేయో సమీక్ష జరపాలని అన్నారు. ఆత్మగౌరవం ఎవరికి కావాలి? ఆత్మగౌరవ భవనాలు ఎవరికి ఇవ్వాలని వారి స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూములను అప్పనంగా ఉన్నత వర్గాలకు అప్పజెప్పడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లేనని అన్నారు.  



   50 లక్షల పెన్షన్లు వారు ఇస్తే మేము రెండున్నర కోట్ల రూపాయల పెన్షన్లు ఇస్తున్నామని చెబుతున్న పాలకులు రాష్ట్ర సంపద ఏమవుతున్నట్లో చెప్పాలని అన్నారు. పాలకులు ఇవ్వడం ఎంటి? ప్రజలు తీసుకోవడం ఎంటి? ప్రజాస్వామ్య విలువలు ఎటుపోతున్నట్లు? తెలంగాణలో స్వేచ్ఛా, సమానత్వం, ప్రజల ఔన్నత్యం, న్యాయం, రాజ్యాంగ విలువలు అన్ని ఎక్కడ పోతున్నాయని ఆయన ప్రశ్నించారు.  

 



   నిజాం వ్యతిరేక పోరాటం ఎందుకు జరిగింది? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం ఎందుకోసం జరిగింది? తెలంగాణ అస్తిత్వం కోసం, సమానత్వం కోసం, ఆత్మగౌరవం కోసం మాట్లాడకుండా ఎదో కొన్ని సంక్షేమ పథకాల గూర్చి ప్రజలు ఎదురు చూడడం, వాటిని ఇస్తున్న పాలకులు వాటినే గొప్పగా చెప్పుకోవడం తెలంగాణలో అలవాటైందని అన్నారు. తెలంగాణ మేధావి వర్గం ఎందుకు మౌనంగా ఉంటున్నట్లు?ప్రశ్నించే శక్తి, పోరాట పటిమ ఉన్న తెలంగాణలో బజన పాలన కొనసాగుతుందని, బజన పాలన, బజన సంస్కృతి తెలంగాణది కాదని ఇలాంటి బజన పాలన కొనసాగితే భవిషత్ చాలా ప్రమాదంగా మారనుందని,  మేధావులు విద్యావంతులు గతం కన్నా ఎక్కువగా ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు.

   ఈ కార్యక్రమానికి హాజరైన టి పి జాక్ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అణచివేతపై ప్రతిఘటన చేసే బావాలు ప్రజలకు ఉండాలని, పాలకుల దుర్మార్గాలపై ప్రశించే హక్కు ప్రజలకు ఉండాలని అన్నారు. తెలంగాణలో ఆకాంక్షలు నెరవేరని క్రమంలో నిరసన తెలిపే ప్రదేశం కూడా లేకుండా చేసిన దుర్మార్గ పాలనపై ప్రజలు తిరుగుబాటు చేయాలని, తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న వారి ఆశయాల కోసం ఉద్యమకారులు పని చేయాలని పిలుపునిచ్చారు. అప్రజాస్వామ్య పాలన కొనసాగిస్తున్న బి ఆర్ ఎస్ పాలనను అంతం చేయాలని పిలుపునచ్చారు.

     తెలంగాణ సాధించుకున్నాం కానీ ఆ తెలంగాణలో ప్రజాస్వామ్య స్థాపన చేయలేకపోయామని అన్నారు. ప్రస్తుతం మనం పాలనను మార్చిన కూడ ప్రజల కోసం ఉద్యమకారులు నిరంతరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఎన్నికల కోసమే మాట్లాడి ఊరుకోదని పాలన మారిన తర్వాత కూడా సామాజిక, ప్రజాస్వామ్య పాలన కోసం పోరాడుతుందని అన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకొని  ఆకాంక్షలను నెరవేర్చుకోవడంలో ఆనాటి ఉద్యమకారులు మరో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 

    సీమాంధ్ర సంపన్నులకు మేలు చేసే పాలనను అంతమొందించే దిశగా ఉద్యమకారులు ముందుకు సాగాలని అన్నారు. మెజార్టీ విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ విద్యాసంస్థలు క్రమేణా మూసివేస్తున్నరని, ఉన్నత విద్యాలయాలను నిర్వీర్యం చేసి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను నెలకొల్పడాన్ని ఎదురించాలని అన్నారు. పోరాట ఖిల్లాగా పేరున్న ఓరుగల్లు నుండే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని ఉదృతం చేయాలని అన్నారు. పీపుల్స్ మానిఫెస్టోను అమలు చేస్తానని కాంగ్రెస్ ప్రకటించాలని, ప్రకటించిన ప్రకారం అమలు చేయకుంటే ప్రజా ఉద్యమకారులు పీపుల్స్ మేనిఫెస్టో అమలు కోసం పోరాటానికి సిద్ధం కావాలనిచేయాలని పిలపునిచ్చారు. 

   ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి మాట్లాడుతూ ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ పక్షులు వాలినట్లు ఇంతకాలం దుర్మార్గ పాలనలో కొనసాగిన నాయకులు నేడు కాంగ్రెస్ లోకి వస్తున్నారని పాలన మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన  మళ్లీ దోపిడి పాలన కొనసాగే ప్రమాదముందని అన్నారు. దొంగల రాజ్యం కొనసాగుతున్నపుడు పౌర సమాజం నిఘా పెంచిన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుందని అన్నారు. ధన చౌర్యం జరగకుండా పౌర సమాజం జాగ్రత్తగా ఉండాలని, దోపిడి పట్ల ప్రశ్నించే అవకాశం ఉండే పాలనను తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. దేశంలో మోడీ పాలన, తెలంగాణలో కె సి ఆర్ పాలనలో కనీసం ప్రశ్నించే స్వేచ్చ లేదని అన్నారు. మేలుకో తెలంగాణ ఏలుకో తెలంగాణ నినాదంతో తెలంగాణ పౌర సమాజం కథం తొక్కాలని పిలుపునిచ్చారు.

    ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయవాది నిరూప్ రెడ్డి, తెలంగాణ పీపుల్స్ జాక్ కో కన్వీనర్లు కన్నెగంటి రవి, అంబటి నగేష్, రవిచంద్ర, మైస శ్రీనివాస్, వి సి కె పార్టీ రాష్ట్ర అద్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్, టి పి జాక్ నాయకులు బి. రమాదేవి, కరుణాకర్ రెడ్డి లు మాట్లాడుతూ ప్రజల గొంతుకలను స్థిరంగా ఉంచడం కోసం ఉద్యమకారులు కృషి చేసి కె సి ఆర్ పాలనను అంతం చేయాలని అన్నారు. 

   ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు నల్లెల రాజయ్య, సోమ రామమూర్తి, సాంబరాజు మల్లేశం, చింతకింది కుమారస్వామి, చాపర్తి కుమార్ గాడ్గే, దిడ్డి ధనలక్ష్మి, శాగంటి మంజుల, కేడల ప్రసాద్, తెలంగాణ కొమరయ్య, ప్రవలిక, సౌందర్య, న్యాయవాదులు ఆనంద్ మోహన్, గునిగంటి శ్రీనివాస్, పులి సత్యనారాయన, చిర్ర సాంబశివరాజు గౌడ్, దయాల సుధాకర్, కిష్ట స్వామి, రాచకొండ ప్రవీణ్ కుమార్, ఎగ్గడి సుందర్ రామ్ తదతరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు