బి సి లు ఆలోచించండి ఆత్మగౌరవం, అధికారం కోసం పోరుబాటకు సిద్ధం కండి

 బి సి లు ఆలోచించండి

ఆత్మగౌరవం, అధికారం కోసం పోరుబాటకు సిద్ధం కండి    ఎందరో ప్రాణ త్యాగాలతో గద్దెనెక్కి కూర్చున్న కెసిఆర్ గత 10 ఏండ్లుగా బి.సి లను వాడుకొని వొదిలేసినట్లుగా గత 60 ఏండ్లలో ఎవరు వాడుకోలేదు. చిన్న రాష్ట్రాలు ఏర్పడితే, తెలంగాణ వస్తే అనగారిన వర్గాలకు ప్రత్యేకించి బి.సి లకు రాజ్య పాలనలో అవకాశాలు పెరిగి అభివృద్ధి చెందుతారని అందరూ ఆశించారు. కానీ గత 10 ఏండ్లుగా అనుకున్నది ఒకటి అయింది ఒకటి. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లు కెసిఆర్ ను నమ్మి రెండు సార్లు అధికారం ఇస్తే బి.సి లను అతి దారుణంగా అణచివేస్తున్నాడు. ఆయన అధికారం చేపట్టిన మొదట్లోనే స్థానిక సంస్థల్లో గతంలో బి.సి లకు ఉన్న  రిజర్వేషన్లను తగ్గించి తీవ్ర అన్యాయం చేసాడు. 2014 లో మొత్తం 119 ఎమ్మెల్యే సీట్లలో 24 స్థాణాల్లో మాత్రమే బి.సి లకు పోటీ చేసే అవకాశం కల్పించారు. జనాభాలో 60 శాతం ఉన్న బి.సి లకు ధర్మంగా అయితే 70 సీట్లలో పోటీ చేసే అవకాశం కల్పించాలి. ఏ లెక్కలో చూసిన, ఏ కోణంలో చూసిన తెలంగాణలో 70 సీట్లు బి.సి లకు కేటాయించాలి. తెలంగాణ ఉద్యమంలో ముందుండి వీరోచిత పోరాటం చేయడమే కాకుండా ఆత్మ బలిధానాలు చేసుకున్న త్యాగాపూరిత చరిత్ర కలిగిన బి.సి లను రాజ్యాధికారంలో అవకాశం కల్పించడంలో తీరని అన్యాయం చేస్తున్నారు. బి సి ల త్యాగాలతో తెలంగాణ గద్దెనెక్కి కూర్చున్న కెసిఆర్ ను సీట్ల విషయంలో నీలదీసే హక్కు బి సి లకు ఉంది. ఈ తరుణంలో రాజ్యాధికారంలో బి.సి ల వాటా కోసం రణం చేయాలి. ఆయా పార్టీల్లో కార్యకర్తలుగా, ఓటర్లుగా పనికి వచ్చే బి.సి లు ఎమ్మెల్యేలుగా పనికి రారా అని బి.సి ప్రజలు, నాయకులు ఆలోచన చేయాలి. ఆయా రాజకీయ పార్టీల వద్ద బి.సి లు బి.సి ల ప్రాధాన్యత గురించి చర్చించాలి. బి.సి లకు సముచిత స్థానం కోసం పోరు చేయాలి.

   ఇటీవల టిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన శాసన సభ అభ్యర్థులల్లో 22 మంది మాత్రమే బి.సి అభ్యర్థులు ఉండడాన్ని గమనించాలి. గత ఎన్నికల కన్నా రెండు సీట్లు తగ్గించాడు మన ప్రియతమ కెసిఆర్. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన మధుసూదనచారిని ఈసారి పక్కకు పెట్టాడు. గత ఎన్నికల్లో మధుసూదనచారిని ఓడించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి ని పార్టీలోకి లాక్కొని మధుసూదనచారిని పక్కకు నెట్టాడు. తన ఓటమిపై భయపడుతున్న కెసిఆర్ రెండు దిక్కుల పోటీ చేయాలని కామారెడ్డిలో పెఱిక కులానికి చెందిన ఏకైక సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ను తప్పించాడు. ఆధిపత్య కులాల కోసం ఆధిపత్య అభ్యర్థులను తప్పిస్తే న్యాయంగా ఉంటుంది. కానీ నోరు లేని బి.సి లను తప్పించడం చాలా దుర్మార్గం. ఇలాంటి చర్యలు, నిర్ణయాలు ఏ ఒక్కరికో ఇద్దరికో జరిగిన అవమానంగా చూడరాదు. రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల నలభై లక్షల బి.సి లకు అవమానకరం.


ఒకసారి సీట్ల కేటాయింపు పరిశీలిస్తే చాలా విషయాలు బోదపడుతాయి.  


    BRS  నుండి MLA అభ్యర్థులుగా ప్రకటించిన 115 లో కులాల వారీగా


OC -       58


రెడ్డి -       40

వెలమ -  11

కమ్మ-        5

వైశ్య-        1

బ్రాహ్మణ-  1


BC- 22


మున్నూరు కాపు- 10

యాదవ............    5

గౌడ- ................    4

బెస్త -................    1

పద్మ శాలి-...........  1

వంజర -................1


SC- 20


మాదిగ -   11

మాల -..     8

నేతకాని-.   1


ST -12


లంబాడ    7

ఆదివాసీ-  5


మైనార్టీ- 3


   మొత్తంగా కెసిఆర్ ప్రవర్తనను పరిశీలన చేస్తే తెలేది ఏంటంటే బి.సి లను ఏమాత్రం లెక్క చేయడం లేదని బోధపడుతుంది. అందులో కాస్త జన బలం ఉన్న కులాలలకు కొంతమేరకు అవకాశాలు కల్పించి మిగతా మెజార్టీ బి.సి కులాలను కెసిఆర్ లెక్క చేయడం లేదని అర్ధమవుతుంది. బిసి లను లెక్క చేయనప్పుడు బి.సి ల ఓట్లు కూడా అడగకూడదు. బి.సి లను అతిదారుణంగా మోసం చేసిన కెసిఆర్ ను, వారి టీమ్ ను రాబోయే ఎన్నికల్లో అంతే దారుణంగా, చిత్తుగా ఓడించి బదలా (బాకీ) తీర్చుకోవాల్సిన అవసరముంది.


బి.సి నాయకులు మూస ఉద్యమాలను వీడాలి 


    బి.సి లు ఎవరి కులానికి వారు రాష్ట్ర స్థాయి సభలు ఏర్పాటు చేసి జనాభా దామాషా ప్రకారం వారి కులానికి దక్కాల్సిన రాజకీయ వాటా గురుంచి డిమాండ్ చేస్తున్నారు. ఎస్సి, ఎస్టీ లకు రిజర్వేషన్లు కల్పించినట్లు చట్టసభల్లో బి.సి లకు రిజర్వేషన్లు కల్పించాలని గత 20 ఏండ్లుగా పోరాటం చేస్తున్న బి.సి లు చట్టం వచ్చేంతవరకు ఆయా రాజకీయ పార్టీలు వారి పార్టీల్లో జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం కులాల వారిగా యుద్ధ బేరీలు జరుగుతున్నాయి. యాదవ యుద్ధ బేరీ, పద్మశాలి గర్జన, మున్నూరు కాపు సమ్మేళనం జరిపి వారికి ప్రాతినిధ్యం కల్పించాలని ఇంటా బయట నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తూ వారి హక్కు కోసం రణం చేస్తున్నారు. వారికి తోడుగా ముదిరాజులు, పెరికలు, విశ్వ బ్రాహ్మణ, చాకలి తదితర బిసి కులాలు వారి డిమాండ్ ను ముందుకు తీసుకోచ్చే పనిలో ఉన్నారు. యాదవులకు ఏడు (7) ఎమ్మెల్యే సీట్లు కావాలని, ముదిరాజులకు 18 సీట్లు కేటాయించాలని, పెరికలకు ఐదు (5) సీట్లు, పద్మశాలీలకు 20 సీట్లు, గౌడ్ లకు 12 సీట్లు, విశ్వబ్రాహ్మణులకు ఐదు (5) సీట్లు డిమాండ్ కొనసాగుతుంది. అత్యంత వెనుకబడిన తరగతులు (ఎం.బి.సి) లలో ఇంతవరకు చట్టసభల్లో అడుగు పెట్టని కులాలు ఉన్నాయి.  మిగతా బిసి కులాలతో పాటు ఎం బి సి లు, సంచార కులాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కావాలని కూడా డిమాండ్ కొనసాగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మరోవైపు గతంలో లాగానే ఈసారి కూడా బి.సి నాయకులు మూస ఉద్యమాలు కొనసాగిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో వరుస సమావేశాలు, ప్రకటనలు కురిపిస్తున్నారు. బి.సి ముఖ్యమంత్రిని ప్రకటించిన పార్టీకి బి.సి ల మద్దతుంటుందని, ఎక్కువ బి.సి సీట్లు ఎవరు ఇస్తే వారికి బి.సి లు మద్దతు ఇవ్వాలని మూస ధోరణిలో సందేశాలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి బి.సి అయినంత మాత్రాన ఆ ముఖ్యమంత్రి ఆయన పార్టీ విధానాలను దాటి బి.సి లకు చేసేది ఏమి ఉండదు. ఎక్కువ సీట్లు బి.సి లకు ఇచ్చినా ఆ ఎమ్మెల్యేలు ఆ పార్టీని కాదని బి.సి లకు మేలు చేసేది ఏమి ఉండదు. చిత్తశుద్ధి కలిగిన బి.సి నాయకులు బి.సి. ముఖ్యమంత్రి, బి.సి ఎమ్మెల్యేలను డిమాండ్ చేస్తూనే బ.సి లను సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా అభివృద్ధి  చేసే మేనిఫెస్టోను డిమాండ్ చేయాల్సిన బాధ్యత మరువరాదు. బి.సి ల అభివృద్ధికి ధోహధపడే విషయాలను బి.సి నాయకత్వం ఒక మానిఫెస్టోగా తయారుచేసి రాజకీయ పార్టీల ముందుంచాలి. బి.సి ఉద్యమ నాయకత్వ అప్రోచ్, డిమాండ్లను పార్టీల మానిఫెస్టులో చేర్చే విధంగా ఉండాలి. 


యుద్ధం మిగులే ఉంది 


     తరతరాలుగా సమాజ మనుగడ కోసం ఎన్నో ఉత్పత్తులు చేసి, నేటికి ఉత్పత్తి, శ్రమలో కీలకంగా పాల్గొంటూ సేవా రంగంలో ఎనలేని సేవలు చేస్తున్న బి.సి లు నేడు బ్రతుకు పోరు చేస్తూ బతకలేక బలిదనాలు చేసుకుంటున్నారు. భారతదేశంలో మొగల్స్ చేస్తున్న దుర్మార్గాలపై ఆరె క్షత్రియ వీరుడు శివాజీ మహారాజ్ వీరోచిత పోరాటం చేసాడు. హైదరాబాద్ సంస్థానంలో నిజాం రాజులు, దొరలు, దేశ్ ముఖ్ లు చేసిన అణచివేతను గౌడ కులానికి చెందిన సర్ధార్ సర్వాయి పాపన్న తన యుద్ధంతో తిప్పికొట్టి గోల్కొండ కోటను కైవశం చేసుకున్నాడు. తెలంగాణ ప్రాంతంలో దొరల, రజాకర్ల దుర్మార్గాలపై గొల్ల కులానికి చెందిన దొడ్డి కొమురయ్య, చాకలి కులానికి చెందిన ఐలమ్మ వీరోచిత పోరాటం చేసారు. పద్మశాలి టైగర్ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణలో నిజాం పాలనపై, దేశంలో బ్రిటిష్ పాలనపై దీర్ఘాకాలిక పోరాటం చేసాడు. స్వాతంత్రానంతరం తెలంగాణ ప్రాంతంలో జరిగిన అణచివేతపై జరిగిన నక్సలైట్ల పోరాటంలో ఎందరో బి.సి లు నేలకొరిగారు. పోరాటం ద్వారానే బహుజన రాజ్యాధికారం సాధ్యమవుతుందని పోరులో ఒరిగిన కామ్రేడ్ మారోజు వీరన్న, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని బోధించి పోరాడిన విశ్వబ్రాహ్మణ ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మహానాయకుల చరిత్రను నెమరు వేసుకోవాల్సిన సందర్భమిది. తెలంగాణతో పాటు దేశ స్వాతంత్రం కోసం వల్లబాయి పటేల్ లాంటి బి.సి లు ఎందరో పోరాటం చేసారు. ఒకవైపు సమాజ మనుగడ కోసం ఉత్పత్తిలో కీలకపాత్ర పోషించడమే కాకుండా దేశంలో, రాష్ట్రంలో జరిగే యుద్ధంలో బి.సి లు ప్రధాన భూమిక పోషించారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న దేశంలో, రాష్ట్రంలో బి.సి ల ఉనికి కోసం, బి.సి ల విముక్తి కోసం చేయాల్సిన యుద్ధం మిగిలే ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల యుద్ధం ప్రజాస్వామ్యంగా ఉండాలి అంటే ఓటు యుద్ధం చేయాలి. విద్యాభివృద్ధిలో అంతంత మాత్రం ఉన్న బి.సి లు రాజకీయ చైతన్యం లేక, అభివృద్ధికి ఆమడ దూరంలోనున్న బిసి ప్రజలచే ఓటు యుద్ధం చేయడం చాలా కష్టం. అయినా బి.సి నాయకులకు ఈ యుద్ధం అనివార్యం.


ఎలాంటి యుద్ధం చేయాలి


    బి.సి లల్లో వచ్చిన చైతన్యం ఇప్పుడిప్పుడే ఉద్యమ రూపం దాల్చుతుంది. ఆ చైతన్యం రాజకీయ శక్తిగా మారడానికి మరింత సమయం పడుతుంది. బి.సి శక్తి రాజకీయ శక్తిగా మారేంతవరకు బి.సి లకు ప్రధాన శత్రువులైన పార్టీలను ఓడించడంలో బి.సి లు కీలకపాత్ర పోషించాల్సిన అవసరముంది. శత్రువు (పాలకులు) బలవంతులు, దుర్మార్గులు అయినప్పుడు వారిని ఓడించే శక్తి సమకూరనప్పుడు మొదట ఆ దుర్మార్గ పాలకులను, పార్టీలను ఓడించాలి. ఆ తర్వాత గెలుపు సాధ్యమవుతుంది. రాజకీయ యుద్ధం చేయాల్సిన ప్రస్తుత తరుణంలో బి.సి లను రాజకీయ చైతన్యం చేయాల్సిన అవసరముంది. బి.సి శక్తి రాజకీయ శక్తిగా మారేంత వరకు బి.సి ఉద్యమకారులకు కొన్ని ఎత్తగడలు అవసరం. బి.సి నాయకులు ప్రస్తుతం ఉన్న పార్టీల్లో వారికి దక్కాల్సిన వాటా కోసం వారు అంతర్గతంగా పోరాటం చేస్తూనే బహిర్గతంగా ఉన్న బి.సి శక్తులతో సత్సంబంధాలు కొనసాగించాలి. వారి శక్తి మేరకు బి.సి ఉద్యమానికి సహకరించాలి. ఉద్యమకారులు కూడా చిత్తశుద్ధితో ప్రణాళిక బద్ధంగా, వ్యూహత్మాకంగా బి.సి ఉద్యమాన్ని రాజకీయాలను మిలితం చేసుకొని ముందుకు సాగాలి. ఏ వ్యూహం రచించి అమలు చేసినా అది బి.సి లకు ఉపయోగపడేవిధంగా ఉండాలి.


కులాల వారిగా రాజకీయ చైతన్య యాత్ర 


   ముఖ్యంగా కులాలున్న  మన సమాజములో కులాల వారిగానే బి.సి ప్రజలను రాజకీయ చైతన్యం చేయాలి. కులాల వారిగా విభజించి ఎన్నో ప్రలోబాలకు గురిచేస్తున్న పాలకవర్గాల కుట్రలను అడ్డుకోవడానికి ఉద్యమకారులు కూడా కులాన్ని కూడగట్టడానికి ఉపయోగించుకోవాలి. భారీ బి.సి సభలు పెట్టి వారి వారి జనాభా దామాషా ప్రకారంగా వారికి అన్ని రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఉద్యమకారులు ఆ డిమాండ్ ను సాధన కోసం బి.సి లను కులాల వారిగా రాజకీయ చైతన్యం చేయాలి. అందుకోసం ప్రతి కులం నుండి ఉద్యమ నాయకత్వం, మేధావులు ముందుకొచ్చి రాజకీయ చైతన్య యాత్ర చేయాలి. కులాల వారిగా రాజకీయ చైతన్య యాత్రలు చేయడం ద్వారా అన్ని ప్రాంతాలకు చెందిన ఉద్యమకారులు గుర్తింపు కావడంతో పాటు చైతన్యం చెంది ఐక్యత చేకూరుతుంది. అంతిమంగా బి.సి నాయకత్వానికి, బి.సి ప్రజలకు విశ్వాశం పెరిగి బి.సి శక్తి రాజకీయ శక్తిగా మారుతుంది. కులాల వారిగా చైతన్య యాత్ర చేయడం వల్ల ఆయా కులాలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా జరుగుతున్న అన్యాయాలపై చర్చ జరిపే అవకాశముంటుంది. ఆయా ఆధిపత్య కులాల రాజకీయ పార్టీలు, నాయకులు బి.సి లకు చేస్తున్న అన్యాయాలను, బి.సి లను వాడుకుంటున్న తీరును బహిర్గతం చేసి ఆయా రాజకీయ పార్టీలను ఎండగట్టే అవకాశం కూడా ఎన్నికల సమయంలో దొరుకుతుంది. ప్రజాస్వామ్యంలో కీలకపాత్ర పోషించే ఎన్నికల సమయంలో సర్వ సమస్యలకు పరిష్కార మార్గమైన రాజ్యాధికారం కోసం రణం చేయ బి.సి లు బయలుదేరండి.


గద్దరన్న బాట నేటి అవసరం


   మార్కిస్ట్, కమ్యూనిస్టుగా, మావోయిస్టుగా ఉద్యమ జీవితాన్ని మొదలు పెట్టిన గద్దరన్న పరిణామ క్రమంలో ఆ ఉద్యమానికి, సిద్ధాంతానికి పునాది అయిన బుద్ధిజాన్ని స్వీకరించాడు. దేశంలో కులముంది కులం ద్వారానే అణచివేత అధికమవుతుందని గమనించిన గద్దరన్న అనగారిన కులాల ఐక్య వేదిక "టి మాస్" లో కీలకపాత్ర పోషించాడు. బహుజన రాజ్యం ద్వారానే బహుజన ప్రజలకు విముక్తి సాధ్యమవుతుందని విశ్వశించి మార్క్స్, మహాత్మ జ్యోతిరావు పూలే, అంబేద్కర్ ల సిద్ధాంత కలయిక అయిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (BLF) కు గద్దరన్న అండగా నిలబడ్డాడు. నమ్మి అధికారం అప్పజెప్పిన కెసిఆర్ ను దించడం కోసం తనపై తుపాకీ గుల్ల వర్షం కురిపించిన చంద్రబాబును సైతం కౌగలించుకున్నాడు గద్దరన్న. ఎన్ని ప్రయత్నాలు చేసినా తొండి చేసి రెండవ సారి గద్దెనెక్కిన కెసిఆర్ ను దించడం కోసం తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా కెసిఆర్ ను ఓడించగలిగే శక్తులన్నింటితో గద్దరన్న కలిసి పని చేసాడు. లక్ష్యం కోసం అంకితబావంతో ఉద్యమించిన గద్దరన్న ఎత్తుగడలు నేటి బి.సి ఉద్యమానికి దిక్సూచి కావాలి. గద్దరన్న ఎంతో అనుభవంతో పాడిన బానిసలారా లెండిరా, ఈ బానిస బతుకులు వద్దురా అనే పాట ప్రస్తుత బి.సి రాజకీయాలకు చాలా రిలవెంట్ గా ఉంటుంది. ఇప్పటికైనా బి.సి లు బానిస రాజకీయాలను వీడి స్వతంత్ర, స్వాభిమాన రాజకీయాలు చేయడానికి నిర్మించుకుని ఓటు యుద్ధం ద్వారా రాజ్యాధికారం చేపట్టినప్పుడే బి.సి లకు విముక్తి జరుగుతుంది.గుర్తింపు ఐక్యత చైతన్యం  రాజ్యాధికారం 


శోదించు బోధించు సమీకరించు పోరాడు సాధించు.


సాయిని నరేందర్

న్యాయవాది

బి.సి స్టడీ ఫోరం వ్యవస్తాపక చైర్మన్

హన్మకొండ

9701916091

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు