అమరవీరులకు నివాళి..అది కూడా పెళ్లిరోజున..

 


సుధా నారాయణమూర్తి అనే నేను ప్రత్యక్షంగా చూసి ఎంతో అపురూపంగా అనుభూతించి రాసిన ఒక చక్కని దృష్టాంతమిది.ఇది నేను మాస్కోలో చూసింది.మన దేశంలో కూడా అచ్చంగా ఇలాగే కాకపోయినా ఇలా పాటిస్తే బాగుణ్ణు అనిపించిన 

అపూర్వ సంప్రదాయం.

ఆరోజు ఆదివారం..

సరే అలా పార్క్ వరకు వెళ్దామనిపించి బయలుదేరి కనిపించిన పార్కులోకి ప్రవేశించాను.అలా వెళ్ళకపోయి ఉంటే జీవితంలోనే ఒక గొప్ప అనుభూతిని మిస్ అయి ఉండేదాన్ని.


సన్నగా వర్షం కురుస్తోంది.చాలా చల్లగా ఉంది.నా ఎదురుగా అప్పుడే పెళ్లయిన ఒక జంట.ఇంకా పెళ్లి బట్టల్లోనే ఉన్నారు.ఆ జంటకి అంతకు కొంతసేపటి ముందే పెళ్లి అయిందనే సంగతి వాళ్ళ గెటప్పులు చూస్తే అర్థం అయింది.పెళ్లి అయిన కాసేపటికే స్మారక పార్కుకి ఎందుకు వచ్చినట్టు..నాకు అర్ధం కాక ఆసక్తిగా అక్కడ జరుగుతున్నది చూస్తున్నాను.


ఆ జంటలో కుర్రాడు మిలిటరీ యూనిఫారం ధరించి ఉన్నాడు.అది నాకు మరీ అబ్బురంగా అనిపించింది.


ఆ పార్క్ రష్యా యుద్ధ అమరవీరులకు సంబంధించింది.అంతకు ముందే వివాహబంధంతో ఒక్కటైన ఆ జంట ఆ వెంటనే

ఇలాంటి ప్రదేశానికి ఎందుకు వచ్చారో..నాకైతే అర్థం కాలేదు.మన దేశంలోనైతే అలా రావడం అపశకునంగా

భావిస్తాం.నన్ను మరింత ఆశ్చర్యానికి గురి చేస్తూ

ఆ కొత్త జంట అమరవీరుల విగ్రహాల ముందు పూలగుచ్చాలు ఉంచి నివాళులు  అర్పించారు.

అప్పుడు అనుకున్నాను.

అక్కడ ఉన్న విగ్రహాలు ఆ ఇద్దరి కుటుంబాల్లో ఎవరో ఒకరి బంధువులు..లేదా తల్లిదండ్రులవి అయి ఉంటాయేమోనని..

కాని కాదు..!


ఇక ఉత్సుకత ఆపుకోలేక అక్కడే ఉండి ఈ తంతును పర్యవేక్షిస్తున్న పెద్దాయన్ని పలకరించాను.ఆయన ఇంగ్లీషులో మాటాడడం నాకు కలిసివచ్చింది.ఆయన నా చీరకట్టు చూసి మీరు భారతీయులా అని అడిగాడు.నాకు గర్వంగా అనిపించింది.


ఇదంతా ఎందుకు ఇలా జరుగుతోంది..నా సందేహాన్ని నేరుగానే బయటపెట్టాను.


పెద్దాయన చెబుతున్నాడు..

"ఇది రష్యన్ల సాంప్రదాయం.

ఇక్కడ పెళ్ళిళ్ళు సాధారణంగా శని, ఆదివారాల్లో జరుగుతాయి.

పెళ్లి తంతు ముగిసిన వెంటనే నవదంపతులు దగ్గర్లోని ఇలాంటి స్మారక వేదికకు వస్తారు."


ఈ దేశంలో ప్రతి యువకుడు

ఒక వయసు వచ్చేపాటికి కనీసం రెండేళ్ల కాలం 

సైన్యంలో పనిచేయాలి.

ఆ తర్వాత ఏ ఉద్యోగం చేసినా గాని..ఎంత హోదాలో ఉన్నా గాని పెళ్లి నాడు సైనిక దుస్తులు ధరించాల్సిందే.


అది విని నేను స్థాణువు అయ్యాను.అప్రయత్నంగా నా నోటి నుంచి "ఎందుకలా"

అనే ప్రశ్న వెలువడింది.


దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు

కృతజ్ఞతాపూర్వకంగా..

అలాంటి వీరుల్లో మా తాతతండ్రులూ ఉంటారు.

కొందరు గెలిచిన యుద్ధాల్లో..ఇంకొందరు ఓడిన సమరాల్లో..

ఏ యుద్దమైనా దేశం కోసమే కదా..వారు చేసింది త్యాగమే అవుతుంది కదా..!


ఈ దేశంలో ప్రతి ఒక్కరూ

వారి త్యాగాన్ని తెలుసుకోవాలి..

వారి స్ఫూర్తిని గౌరవించాలి.

ఆ వీరుల ప్రాణత్యాగం వల్లనే

ఈరోజున మనమిలా ప్రశాంతంగా జీవించ గలుగుతున్నామని గుర్తెరగాలి.కొత్త జీవతాన్ని ప్రారంభించే ముందు 

వారి ఆశీస్సులు 

తీసుకోవాలి.

పెళ్లి కంటే దేశభక్తి ముఖ్యం ఇక్కడ.రష్యాలో ఎక్కడైనా గాని ఈ సంప్రదాయం అమలు జరుగుతుంది.


అంతా విన్నాక నా నోటి నుంచి మాట రాలేదు. 

కళ్ళమ్మట ధారాపాతంగా 

నీళ్ళు..ఎంత గొప్ప సంప్రదాయం.అస్సలు ఆ ఆలోచన ఎంత విశిష్టమైనది.

అమరవీరులకు నివాళి..అది కూడా పెళ్లిరోజున..వివాహం జరిగిన వెంటనే.. ఓహ్..!


అంతలోనే నా కళ్ల ముందు మన భారతీయ వివాహ

దృశ్యమాలిక కదలాడింది.సరే..ఏ దేశం సంప్రదాయాలు ఆ దేశానికి ఉంటాయి.వేటి ప్రత్యేకత వాటిదే.


అయితే మన దేశంలో ఎంతమందిమి ఇలా అమరవీరులను స్మరించుకుంటున్నాం.

నిజానికి మనకు కూడా అమరవీరుల సంస్మరణ దినాలు ఉన్నాయి.అయితే ఆ రోజున మనలో 

ఎందరం వీరజవాన్లను స్మరించుకుంటున్నాం.

అదేదో ప్రభుత్వానికి సంబందించిన కార్యక్రమంలా భావించి మనం పెద్దగా పట్టించుకోము.ప్రభుత్వాలు కూడా మొక్కుబడిగా చేసి చేతులు దులుపుకుంటాయి.


మనం మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం.. 

ఎటు నడిపిస్తున్నాం.

ఇలా అయితే భావి తరాల

ఆలోచనలు ఎలా ఉంటాయి.

వారి నడవడి ఏ విధంగా ఉండబోతోంది..?


ఈ అంశాలన్నీ నాలోనేనే తర్కించుకుంటూ బరువెక్కిన 

హృదయంతో పార్కు నుంచి బయటకు వచ్చాను.. రష్యన్ల

స్ఫూర్తిని మనసులోనే అభినందిస్తూ..


     స్వేచ్ఛానువాదం


  ఎలిశెట్టి సురేష్ కుమార్

      9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు