సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా జరపాలి

 

అవనిలో సగమైన స్త్రీలకు అన్నిట్లో సగం వాటా రావాలి       డెబ్భై ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు లేవంటే కారణమేమిటి?  మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సి, ఎస్టీ, బి.సి, మైనార్టీ స్త్రీలకు ప్రత్యేక కోటా ఉండాలంటే కేంద్రం ఎందుకు అంగీకరించడం లేదు?  ఇప్పటికి మహిళల్లో సగానికి పైగా నిరక్షరాస్యులుగానే మిగిలిపోయారంటే కారణం ఎవరు? ప్రతి రెండు నిముషాలకు ఒక అత్యాచారం జరుగుతుందంటే దానికి బాధ్యత ఎవరిది? దేశ జనాభాలో సగ భాగమైన మహిళలు ఇంత దోపిడీ పీడనలకు గురవుతుంటే పరిష్కారం లేదా?  ప్రేమ పేరుతో మహిళల మీద జరుగుతున్న దాడులకు మహిళా సంఘాలు ఎందుకు పరిష్కారం చూపలేకపోతున్నాయి?  స్త్రీల విముక్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇస్తున్న దిశా నిర్దేశం ఏంటి?  ఇప్పటికీ మనకు ఒక జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు లేదు?  ఇన్నేళ్ళుగా జరుపుకుంటున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కులం వల్ల పీడనకు గురవుతున్న మెజార్టీ మహిళలకు విముక్తి ఎందుకు కలిగించలేకపోయింది?  జాతీయ, అంతర్జాతీయ మహిళా సంఘాలు వర్గ దృక్పధం నుండి తప్ప కుల వ్యవస్థ నిర్మూలన దృక్పథంతో స్త్రీల సమస్యను చూడలేకపోవడమే దీనికి కారణం. మహిళా విముక్తి కోసం పోరాటం చేసిన జాతిపిత మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే లు స్త్రీ పురుష సమానత్వం కొరకు ఏర్పాటు చేసిన సత్య శోధక్ సమాజములో నాయకురాలిగా పనిచేసిన తారాబాయి షిండే, హిందూ కోడ్ బిల్లు కొరకు మంత్రి పదవికి రాజీనామా చేసిన బాబాసాహెబ్ అంబేడ్కర్, స్త్రీలకు స్వాభిమానం కల్పించిన పెరియార్ లాంటి మహానీయులను ఇప్పటివరకు పట్టించుకోని కారణంగా దేశంలో స్త్రీలకు విముక్తి, సమానత్వం జరగడం లేదు. 

   మహిళా హక్కులు, లింగ వివక్ష, పని స్థలాల్లో లైంగిక వేధింపులు, గృహ హింస వంటి అమానుష వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతూ స్త్రీ పురుష సమానత్వం, రాజకీయ, సామాజిక సమానత్వం కోరుతూ వివిధ దేశాల మహిళలు ప్రతి ఏడాది మార్చి 8 న జరుపుకుంటున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం మన దేశంలో స్త్రీల పరిస్థితి గూర్చి ఆలోచించే అవసరాన్ని నొక్కి చెపుతుంది. ఈ దేశంలోని మహిళల విముక్తికోసం జీవితాంతం సైద్ధాంతిక పోరాటం చేసిన చదువుల తల్లి సావిత్రిబాయి 192 వ జయంతిని దేశ వ్యాప్తంగా జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహించుకోవాలి. జాతీయత, స్వదేశీ గురించి నిత్యం మాట్లాడే భారత ప్రభుత్వం, బిజెపి శ్రేణులు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇచ్చే ప్రాధాన్యత జాతీయ మహిళా దినోత్సవం  జరపడానికి ఎందుకు ఇవ్వడం లేదు?  సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించి జనవరి నెలంతా జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని దేశీయ మహిళా సంఘాలు డిమాండ్ చేయాలి. 

    మన దేశంలో స్త్రీలు దుర్మార్గమైన దోపిడి, అణచివేతకు గురికావడానికి, రెండవ శ్రేణి పౌరులుగా పరిగణించబడడానికి బ్రాహ్మణ వాదమే కారణమని బాబాసాహెబ్ అంబేడ్కర్ సూత్రీకరించాడు. ఈ సూత్రీకరణను పట్టించుకోని మహిళా సంఘాలు పితృస్వామిక వ్యవస్థ స్త్రీల అణచివేతకు కారణమని, పితృస్వామిక బావాజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానించుకొని పోరాడుతున్నారు. బ్రాహ్మణీయ కుల వ్యవస్థ లేని పాశ్చాత్య దేశాల్లో స్త్రీల అణచివేతకు పితృస్వామ్యం కారణం. స్త్రీలను దారుణంగా అణచివేసే మనుధర్మం అక్కడ అమలులో లేదు. కానీ మన దేశంలో మనుధర్మం నిర్ధేశించిన అసమానతల కుల దొంతరుల సమాజం ఉంది. కులం ప్రతి మనిషి హక్కులను నిర్ధేశిస్తుంది, కులం ప్రతి స్త్రీ సామాజిక హోదాను నిర్ణయిస్తుంది. స్త్రీలకు ఆత్మ విశ్వాసం లేకుండా పోవడానికి, స్త్రీలకు స్వాభిమానం, స్వయం నిర్ణయాధికారం లేకుండా పోవడానికి కారణం కులం. కుల వ్యవస్థను సృష్టించి కాపాడుతున్నది మనుధర్మ శాస్త్రం. ఆర్య బాపండ్లు నిర్మించిన కుల వ్యవస్థ వల్ల ఈ దేశం సర్వ నాశనమైందనే వాస్తవాన్ని అంగీకరించడానికి ఆధిపత్య కుల మహిళా సంఘాలు, ఆధిపత్య స్త్రీ వాదులు సిద్ధంగా లేరు.  

   స్త్రీలందరూ ఒక్కటేననే బూటకపు వాదన వెనుక బ్రాహ్మణవాద కుట్ర ఉంది.  ఆర్య బ్రాహ్మణ స్త్రీలు, మూలవాసి స్త్రీలు(ఎస్సి, ఎస్టి, బి.సి, మైనార్టీ స్త్రీలు) స్వాభావికంగానే వేర్వేరు.  రాజకీయంగా జాతీయ స్థాయి నాయకులుగా ఎదిగిన స్త్రీలంతా ఆధిపత్య కులస్తులే. బహుజన రాజకీయ చైతన్యం వల్ల బెహేన్ జి మాయావతి, మాన్యశ్రీ మీరాకుమారి మాత్రమే అందుకు మినహాయింపు. రాజకీయంగా ఎదగాలని ఆరాటపడుతున్న ఆధిపత్య కులాల స్త్రీలు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రిజర్వేషన్ల వల్ల అగ్రకుల స్త్రీలే లాభ పడతారని చేస్తున్న విమర్శను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం చట్టం తేవాలని చూస్తుంది. దళిత బహుజన మైనార్టీ స్త్రీలకు ఈ చట్టంలో ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వాలని బహుజన స్త్రీలు అడుగుతున్న డిమాండ్ ను అగ్రకుల మహిళా సంఘాలు అవహేళన చేస్తున్నాయి. బిజెపి, కాంగ్రెస్, పార్టీలు కూడా ఈ డిమాండ్ ను తోసి పుచ్చుతున్నాయి. బి.సి లకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల జరిగిన నష్టం కళ్ళముందు కనపడుతుంటే  మహిళలకు కల్పిస్తున్న రిజర్వేషన్లలోె బి.సి మహిళల వాటా ఎంతో స్పష్టంగా చెప్పాలని అడగడంలో తప్పేముంది?  స్త్రీలంతా ఒక్కటేననే సంఘాలు ఎస్సీ, ఎస్టీ, బి.సి, స్త్రీల మీద అత్యాచారాలు, దాడులు జరిగినప్పుడు అగ్రకుల స్త్రీల మీద జరిగితే స్పందించినంత తీవ్రంగా ఎందుకు స్పందించరు?  కులాన్ని బట్టి స్పందించడమే మహిళలంతా ఒకటి కాదని నిరూపిస్తుంది. 

   బారత జనజీవనంలో  సగబాగమైన మహిళలను దశాబ్దాలుగా అణచివేసిన చరిత్ర వెనుక బ్రాహ్మణీయ (అ)ధర్మశాస్త్రం ప్రదానంగా పని చేసిందన్న సత్యం మరువ లేనిది.  "న స్త్రీ స్వాతంత్ర మర్హతి", "న స్త్రీ విద్యార్హతి" అంటూ రాజశాసనంగా మహిళపై పురుషాధిక్యతను స్థిరపరిచింది.  ఈ కారణంగా స్త్రీలు అనేక సాంఘీక కట్టుబాట్లకు, వివక్షలకు గురికావాల్సి వచ్చింది. ముఖ్యంగా అభివృద్ధికి దోహదపడే విద్యకు స్త్రీలను వేల సంవత్సరాల పాటు దూరం చేశారు. ఇప్పటికి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో స్త్రీలు అణచివేతకు గురవుతున్నారంటే దానికి ఆర్య బ్రాహ్మణ వాదమే కారణం. ఆర్య బ్రాహ్మణులు మెజారిటీ ప్రజలైన దేశ మూలవాసి స్త్రీలను బానిసలను చేసి అజ్ఞానంలో ఉంచుతున్నారని గుర్తించి మొట్టమొదటి సారిగా శూద్ర అతిశూద్రులకు పాఠశాలలు, వసతి గృహాలు ప్రారంభించిన మహాత్మ జ్యోతిబా పూలే వర్ణ ధర్మం, కుల ధర్మం బాపండ్ల కుట్రని, చదువుకునే హక్కు కుల మతాలకు అతీతంగా  స్త్రీ పురుషులకు సమానంగా అందించాలని వాదించి ఆచరించి స్త్రీ విముక్తి కోసం త్యాగపూరిత పోరాటం చేసిన ఈ విప్లవకారులని అగ్రకుల స్త్రీ వాదులు స్మరించుకోరు. 1848 లో జ్యోతిరావు పూలే స్థాపించిన పాఠశాలల్లో అధ్యాపకురాలిగా పనిచేసిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే శూద్ర అతిశూద్ర స్త్రీలకు విద్య నేర్పించి తొలి మహిళా ఉపాధ్యాయురాలైంది. ఆనాటి సమాజంలో ఉన్న సాంఘీక దురాచారాలను, అర్థంలేని కట్టుబాట్లను ధైర్యంతో ఎదురించిన సావిత్రిబాయి పూలే సమాజ బహిష్కరణకు గురైన విధవరాళ్లకు ప్రత్యేక వసతి కల్పించి వారికి రక్షణ కల్పించారు. అలాంటి బాధితులకు జన్మించిన కొడుకుని పూలే దంపతులు దత్తత తీసుకొని సమాజానికి గొప్ప సందేశాన్నిచ్చారు. స్త్రీలపై జరిగే అన్ని రకాల అణచివేతలపై మహిళా విముక్తి కోసం జరిగిన ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన తొలి మహిళా నాయకురాలు కూడా సావిత్రిబాయి పూలే.

   మానవ హక్కులు, పౌర హక్కుల అవగాహనతో పాటు ఆర్య బ్రాహ్మణ కుల వ్యవస్థకు మూలమైన బావాజాలం మార్చితే తప్ప స్త్రీ పురుష సమానత్వం సాధించలేమన్న మూలవాసి తత్వ చింతనను అవివృద్ధి చేసిన జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే బహుజన ప్రజలతో పాటు అన్ని వర్గాల స్త్రీలకు ఆదర్శం కావాలి.  స్తీల విద్య హక్కుల కోసం పాశ్చాత్య దేశాల్లో 1910 తర్వాత ఉద్యమాలు మొదలుకాగా అంతకన్నా కొన్ని దశాబ్దాల ముందే మన దేశంలో స్త్రీల స్వేచ్ఛ, సమానత్వం, స్వతంత్రం కోసం ఉద్యమం నడిపిన గొప్ప విప్లవవాది సావిత్రిబాయి పూలే. 1917 నుండి బాబాసాహెబ్ అంబేడ్కర్, పెరియార్ లు మహిళా హక్కుల కోసం ఉద్యమం నిర్వహించారు. సమాజ పరివర్తనం కోసం ఉద్యమించిన చాకలి ఐలమ్మ చరిత్రను ఆ క్రమంలోనే అర్ధం చేసుకోవాలి. మహారాష్ట్ర సతార జిల్లా నాయిగాన్ గ్రామం వ్యవసాయ కుటుంబంలో 1831 జనవరి 3 న జన్మించిన సావిత్రిబాయికి తన తొమ్మిదవ ఏట జ్యోతిరావు పూలే తో వివాహమైంది. చదువురాని సావిత్రిబాయి పూలే భర్త జ్యోతిరావు పూలే వద్ద చదువు నేర్చుకుని స్త్రీల విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసారు. సావిత్రిబాయి పూలే లాగా మన దేశ మహిళలు చదువుకోకపోవడం వల్లనే అభివృద్ధికి నోచక సమాజంలో గౌరవం లేక ఎన్నో అవమానాలకు, అత్యాచారాలకు గురవుతున్నారు. మహిళా రక్షణకు ఎన్నో చట్టాలు చేస్తున్న మన పాలకులు వారి అభివృద్ధికి, రక్షణకు, స్వాభిమానానికి కీలకమైన విద్యాభివృద్ధి గురుంచి మహిళా సంఘాలు, సామాజిక సంఘాలు డిమాండ్ చేయాలి.


పూలే సిద్ధాంతమే నేటి మహిళా సమాజానికి రక్ష


    ఆనాటి అమానవీయ సంఘటనలను ఎదురించిన పూలే దంపతులను ఆదర్శంగా తీసుకొని నేటి గృహ హింసపై, సామాజిక హింసపై పోరాటం చేయాలి. దంపతుల కలహాలతో నేడు 60 శాతం కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. సామాజిక, కుటుంబ అవగాహన లేక, మానవీయ విలువలు కోల్పోయి దంపతులు విడిపోవడంతో భవిషత్ తరం ఎంతో నష్టపోతుంది. ఈ పరిస్థితిని నివారించడానికి సావిత్రిబాయి స్పూర్తితో కుటుంబ వ్యవస్థను, మానవ సంబంధాలను కాపాడి మానవీయ సమాజ నిర్మాణం కోసం నేటి సమాజం కృషి చేయాలి. కుటుంబ కలహాలను నివారించడం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవరసరముంది. పూలే దంపతుల వల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న ఆధిపత్య వర్గాల స్తీలతో పాటు రిజర్వేషన్ల ద్వారా విద్య, ఉద్యోగ అవకాశాలతో లబ్ది పొందిన అణగారిన వర్గాల ప్రజలు "పే బాక్ టు సొసైటీ" అనే సిద్ధాంతంతో మహిళా సమాజాన్ని రక్షించాల్సిన అవసరముంది. ఈరోజు కొన్ని కుటుంబాల్లో రెండు నుండి ఆరు ఉద్యోగాలు చేస్తున్నారంటే, ఆధిపత్య వర్గ స్త్రీలు చట్ట సభల్లో స్థానం పొంది మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతున్నారంటే దానికి కారణం ఆనాటి పూలే దంపతుల త్యాగం, సాహసం. అలా లబ్ది పొందిన వారు మహిళా సమాజ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనప్పుడే దేశంలోని మహిళా విముక్తి సాధ్యమవుతుంది.


   చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సంధర్బంగా మహిళా ఉద్యమం కొత్త మార్గం నిర్ధేశించుకోవాలి. స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం, న్యాయం అనే ఆధునిక భావనతో ఈ దేశం నడవాలంటే అందుకు విరుద్ధమైన అసమానతల బ్రాహ్మనిజాన్ని, మనుధర్మానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఈ క్రమంలో మన దేశానికి ఒక మహిళా దినోత్సవం అవసరముందని గుర్తించాలి అందుకోసం చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూ ప్రభుత్వాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేయాలి. జాతీయ మహిళా దినోత్సవం ద్వారా ప్రజలను స్త్రీ పురుష సమాత్వం కోసం చైతన్యం చేసినప్పుడే మహిళలపై దాడులు, అత్యాచారాలు ఆగుతాయని, కఠినమైన శిక్షలు, ఎన్కౌంటర్ల ద్వారా మహిళలపై అత్యాచారాలు ఆగవని గుర్తించి ప్రతి ఒక్కరు ఆ దిశగా ఉద్యమించాలని కోరుతున్నాను.


(జనవరి 3 న సావిత్రిబాయి పూలే 192 వ జయంతి సందర్బంగా)
     సాయిని నరేందర్

  సామాజిక, రాజకీయ విశ్లేషకులు

     970191091

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు