వరంగల్ హంటర్ రోడ్ కు ఆ పేరు ఎట్లా వచ్చిందో తెల్సా ?



హంటర్ రోడ్ ... స్థానికులు కొద్ది రోజులు ఎన్ కౌంటర్ రోడుగా పిలిచిన రోడ్...వరంగల్ హన్మకొండ..కాజిపేట త్రయినగరానికి సెంటర్ రోడ్....ఈ రోడ్డుకు హంటర్ రోడ్డుగా పేరెట్లా వచ్చిందో సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు కన్నెకంటి వెంకట రమణ కథనం చదవండి

 


 వరంగల్ సుభా సుబేదార్ గా సుదీర్ఘ కాలం పనిచేసిన 3 , మొదటి హిందూ సుబేదార్ రాజా మురళీధర్ ఫతే నవాజ్ బహద్దూర్ అనంతరం సయ్యద్ మొహియొద్దీన్ ఖాన్ మొహియొద్దీన్ యార్ జంగ్ వరంగల్ సుబేదార్ గా భాద్యతలను స్వీకరించారు.  క్రి.శ. 1920 ( 1330 ఫసలీ ) వరకు సుబేదార్ గా ఉన్న మొహియొద్దీన్ ఖాన్ కు హంటర్ సాబ్ అనే మరో పేరు కూడా ఉంది. ప్రస్తుత సుబేదార్ బంగ్లా నుండి కరీమాబాద్ లోని దర్గా కు ప్రార్థనలకై చేరుకోవడానికి హన్మకొండ అదాలత్ జంక్షన్ నుండి వన విజ్ఞాన్ మీదుగా వరంగల్ కరీమాబాద్ వరకు ఇతని కాలం లోనే దట్టమైన అడవి మార్గంలో ప్రత్యేక రహదారి నిర్మించాడు. కాజిపేట్, సుబేదార్ ప్రాంతాల్లోని వారికి వరంగల్ రైల్వే స్టేషన్ కు వెళ్లేందుకు ఈ మార్గం చాలా దగ్గరవుతుంది. వరంగల్ ఫోర్ట్ కు పోవడానికి  కూడా దగ్గరి దారి ఏర్పడింది. ఉరుసు కరీమాబాద్ కు పోవడానికి ఈ రహదారి నిర్మించినా, ఈ కరీమాబాద్ ప్రాంతంలో మత ప్రశస్తం గల పలు దర్గాలున్నాయి.
   కరీమాబాద్ లో హజరత్ మాషూక్  రబ్బానీ దర్గా ఉంది. ఢిల్లీని పాలించిన సికిందర్ లోడీ (1489 - 1517 } కాలంలో తెలుగు ప్రాంతానికి పెద్ద సంఖ్యలో మహ్మద్ మత ప్రవక్తలు తరలివచ్చారు. అలా తరలి వచ్చిన వాడు మషూక్  రబ్బానీ. ఇక్కడ ప్రతీ సంవత్సరం ఉర్సు జరుగుతుంది. ప్రతీ సంవత్సరం ఉర్సు జరుగుతుంది కాబట్టి ఉర్సు కరీమాబాద్ అని పిలువబడుతున్నాది. 
         వరంగల్ సుబేదార్ గా పనిచేసి హైదరాబాద్ కు బదిలీ పై వెళ్లిన మొహియొద్దీన్ ఖాన్ నిజామ్ క్లబ్ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. ఆరవ నిజామ్ మీర్ మహమూద్ అలీ ఖాన్ 1884 సెప్టెంబర్ లో నిజామ్ ప్రభుత్వంలోని అత్యున్నత అధికారులు, రాజ వంశీకులకు మాత్రమే సభ్యత్వం ఉండేలా ఈ నిజామ్ క్లబ్ ను అసఫ్ జాహి రాజ్య స్థాపకుడైన నిజామ్ పేరుతొ ప్రారంభించారు. ఈ క్లబ్ నిర్వహణకు సర్ఫేకాస్ ట్రెజరీ నిధులనుండి నెలకు వంద రూపాయల గ్రాంట్ ను మంజూరు చేశారు.ఈ క్లబ్ అధ్యక్షులుగా తన ప్రభుత్వంలోని ప్రధాన మంత్రి ఉండాలనే నిబంధన విధించారు.(వీరి గురించి పెద్దగా సమాచారం లభించలేదు)

కన్నెకంటి వెంకట రమణ ఉప సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు