అప్పుడు..ఇప్పుడు.. ఎప్పుడూ..ఆగడు..!

 


అప్పుడు..ఇప్పుడు..

ఎప్పుడూ..ఆగడు..!


(Happy birthday sattibabu)


💐💐💐💐💐💐💐💐


ఔను...


మొన్నటి ఎన్నికల్లో సత్తిబాబు 

ఓడిపోయాడు.. నలుగురితో

పాటు సత్యనారాయణ..

164 మందిలో తానూ ఒకడిగా..!


ఏంటి..సత్తిబాబు ఓడిపోయాడా..నిజమేనా..

జనానికి ఆయన వ్యూహరచనపై అంత నమ్మకం..పోనీ అనుమానమే అనుకోండి..వైసీపీ ఘోర పరాజయం అంతా ఒక ఎత్తు..

సత్తిబాబు ఓటమి ఒక షాకు..

పెద్ద షేకు..!


ఎన్నికలకు ముందు కూడా

వైసీపీలో ఎవరు గెలిచినా లేకున్నా సత్తిబాబు గెలిచేస్తాడు..ఇదీ ఊహాగానం.

అదీ ఆయన స్టామినా..


ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 ఎన్నికల్లో కూడా

ఇలాంటి షాకే..అప్పుడు కూడా చాలామంది కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు సత్తిబాబు కూడా ఓడిపోయారు.అయితే ఆ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్ అభ్యర్థుల్లో సత్తిబాబుకే ఎక్కువ ఓట్లు వచ్చాయి.అది సత్తిబాబు

కెపాసిటీ..!


గడచిన అయిదేళ్లలో 

సత్తిబాబు తన నియోజకవర్గానికి.. సొంత జిల్లాకు అందుబాటులో లేరన్నది వాస్తవమే.అందుకు ఆయన ఆరోగ్య ఇబ్బందులు కొంతవరకు కారణం.ఆయన పెద్దగా అందుబాటులో లేకపోయినా చీపురూపల్లిలో

అభివృద్ధి కార్యక్రమాలకు ఎటువంటి ఢోకా లేదు.

అదీ ఆయన నెట్వర్క్..!


చీపురుపల్లి నియోజకవర్గం 

2004-14 మధ్యకాలంలో..

అలాగే 2019-24 మధ్య చాలా

ప్రగతి సాధించింది.పూర్తి క్రెడిట్ సత్తిబాబుదే.అయినా మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభంజనం ముందు సత్తిబాబు కూడా తల వంచక తప్పలేదు.


ఇప్పుడు..కిం కర్తవ్యం..?


మొన్నటి ఎన్నికలలో వైసీపీ పరాజయం తర్వాత జగన్ ఏం చెయ్యబోతున్నారు..అనే విషయం కంటే సత్తిబాబు

ఏం చేస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే సత్తిబాబు అనే వ్యక్తి ఊరికే కూర్చునే రకం కాదు.ఆయనకు గోళ్ళు కోరుక్కునే అలవాటు ఉంది..

అది నిజమే కాని గోళ్ళు గిల్లుకుంటూ ఉండిపోయే క్యారెక్టర్ కాదు. ఏదో చేయబోతున్నారు..చేస్తారు

కూడా.. అది సంచలనమే.

ఆయన వైసీపీకి గుడ్ బై చెబుతారనే కథనాలు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి.

పక్కా సమాచారం లేదు.

ఆయన ఏ పార్టీలోకి వెళ్లినా ఆ పార్టీకి ఆయన పెద్ద బలమే..

ఆయన నిజంగా వైసీపీని వదిలితే విజయనగరం జిల్లా

వరకు ఆ పార్టీ ఖాళీ అయిపోయినట్టే.ఎందుకంటే వైసీపీలో ఆయన కుటుంబ సభ్యుల ప్రాబల్యం ఎక్కువ.

జిల్లా అంతా ఆయన మందీ

మార్బలమే.గతంలో ఆయన కంటే ముందుగా జిల్లాలో కాంగ్రెస్ నుంచి వైసీపీకి చాలా మంది జంప్ అయినా సత్తిబాబు నిష్క్రమణతో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయినంత పనైంది.

ఇప్పుడు సత్తిబాబు వైసీపీకి రాంరాం చెబితే ఆ పార్టీ పరిస్థితి కూడా అలాగే మారుతుందన్నది నిస్సందేహం.


ఇంతకీ సత్తిబాబు ఏం చెయ్యబోతున్నారు.ముందే చెప్పుకున్నట్లు ఆయన ఖాళీగా కూర్చోరు. ఏదో చేస్తారు..

ఇప్పటికిప్పుడు టిడిపి.. జనసేన ఆయన కోసం ఎర్రతివాచీ వేసే సీన్ ఉండదు.

అయితే పవన్ కళ్యాణ్..చిరంజీవితో బొత్సకు

మంచి సంబంధాలు ఉన్నాయి.

కాకపోతే బిజెపికి సంబంధించి ఢిల్లీలో సత్తిబాబుకి మంచి లాబీ ఉందన్నది నిస్సందేహం.

రాష్ట్రంలో నాయకత్వ లేమితో ఎప్పుడూ ఇబ్బంది పడే కమలం పార్టీ సత్తిబాబు వంటి పెద్ద నాయకున్ని తీసుకుంటే నాయకత్వ లోటు తీరినట్టే అవుతుంది.గతంలో కూడా సత్తిబాబు బిజెపిలో చేరే ప్రయత్నాలు చేసినట్టు వార్తలు ఉన్నాయి.ఇప్పటికైతే బీజేపీ

అటు టిడిపి..ఇటు వైసీపీతో 

మిత్రధర్మంలో ఉంది గనక

వైసీపీ నుంచి ఎవరిని తీసుకోవాలన్నా మూడు పార్టీల

సమిష్టి నిర్ణయంగానే ఉండవచ్చు.చూడాలి..


అదే సత్తిబాబు అండ్ మాతృసంస్థ కాంగ్రెస్ లోకి వెళ్లిపోవాలని అనుకుంటే మాత్రం తలుపులు తెరిచే ఉంటాయని భావించవచ్చు.


ఏదిఏమైనా సత్తిబాబు భవిష్యత్ కార్యాచరణ విషయంలో రానున్న ఒకటి రెండు నెలల్లో క్లారిటీ రావచ్చు.


సరే..ఇప్పటికైతే ఈరోజున సత్తిబాబు జన్మ దినం గనక

ఆయన వైభోగమే కావచ్చు..

గత వైభవం అవ్వొచ్చు..

రేపటి ప్రాభవమే అనుకోవచ్చు..వాటి గురించి నాలుగు ముక్కలు చెప్పుకుందాం..


స్నేహితుడా..స్నే"హితుడా"..!


అదేమిటో..

ఆయన గురించి  రాస్తుంటే అక్షరాలు పరిగెడతాయి..

పదాలు కదం తొక్కుతుంటాయి..

వాక్యాలు కావ్యాలై..

భాష గుండె ఘోషగా..

మా మైత్రికి భాష్యంగా..

వ్యాసాలు అలవోకగా..

కవితలు కరతలామలకంగా..

ఆయన శైలికి సరిపడా..

ఆయన నైజానికి సరితూగేలా అమరిపోతుంటాయి.


ఔను మరి..

ఎన్ని రాసి ఉంటాను 

ఆయన గురించి..

ఎంతగా చేసి ఉంటాను..

ఆయన విజయాల వర్ణన..

లేస్తూ ఆయన డస్సిపోలేదు..

రాస్తూ నేను ఆలసిపోలేదు..

నా కలం  బాగా ఎరిగినది ఆయన బలం.

అది మహానది..

ఆగనిది..ఆపలేనిది..!


సత్తిబాబు ప్రస్థానంలో ఆయన స్వస్థానంలో 

నేనూ ఉన్నాను..

మిత్రుడిగా..ప్రేమపాత్రుడిగా..

ఆయన ప్రతి విజయం 

నాకు సంబరం..

ఒక్కోసారి ఆయన నాకు కూడా అందనంత దూరం..కాని ఆ మనసు నాకు తెలుసు..

అది స్నేహాన్ని 

చెయ్యదు అలుసు..

అహం ఎరుగదు..

అయితే అహరహం జరిగే 

సేవా క్రతువులో తీరిక లేని తనం..అయినా వీడని 

మంచితనం.. వీడిపోని ఆత్మీయత..చెరిగిపోని గుర్తులు..చెదరిపోని జ్ఞాపకాలు..!

       

అతగాడి ఎదుగుదలకు 

నేనే సాక్ష్యం..

పెద్ద కుటుంబం..

ఆ కుటుంబం మీద ఆధారపడి ఇంకెందరో బంధుగణం..

తెలిసిన జనం..

అయితే ఆ బాధ్యతలను చూసుకోడానికి కొండంత అండ..మేరునగం తండ్రి గురునాయుడు ఉన్నారు.

అటు కాదు తన ఆలోచన..

ఎదగాలి..పది మందికి ఉపయోగపడేలా..

సాధించాలి.అందుకు దారులు శోధించాలి..!

      

రాజకీయాల్లో గాడ్ ఫాదర్ లేని సత్తిబాబు 

అది బాదర్ చెయ్యలేదు.

తన అరంగేట్రానికి తానే వేదికలు సెట్ చేసుకున్నారు.

ఎదగడానికి మెట్లు ఎంచుకున్నారు.

తన మార్గంలో ఎదురైన పువ్వులను కళ్ళకు అద్దుకున్నారు..

ముళ్ళను తానే అడ్డు తీసుకున్నారు.ఒకపక్క వ్యాపార విస్తరణ..

ఇంకో పక్క రాజకీయ అడుగులు..

రెంటినీ సమన్వయం చేసుకుంటూ వచ్చారు.

ఈ క్రమంలో ఆయన నడవలేదు..పరిగెత్తారు..

పరుగులు పెట్టించారు.

స్వపక్షంలో,విపక్షంలో నాటికి పాతుకుపోయి ఉన్న హేమాహేమీలను చూస్తూ పెరిగినా..చూస్తుండగానే వారిని దాటుకుంటూ ముందుకు వెళ్లిపోయారు.నిరంతర శ్రమ,మొక్కవోని పట్టుదల..ఎప్పటికప్పుడు మారిపోయే వ్యూహాలు.. వాటిపైనా సందేహాలు..

అంతలోనే 

కొత్త ఆలోచనలు..

వీటన్నిటినీ దగ్గరగా చూసిన,వాటిలో కొన్నింటిలో పాలుపంచుకున్న 

వ్యక్తిని నేను..!


ఆయన అంతరంగం..

కార్యరంగం..

మొదటి దానిలో హోరు..

రెండోదానిలో జోరు..

నాకు ఎరుకే..ఆది నుంచి అతగాడు చురుకే..!

          

సత్తిబాబుకు గోళ్ళు కొరికే అలవాటు..మామూలుగా ఎవరైనా ఖాళీగా ఉన్నప్పుడు గోళ్ళు గిల్లుకుంటూనో..

కొరుక్కుంటూనో ఉంటారు.అయితే సత్తిబాబు గోళ్ళు కొరుకుతుంటే ప్రత్యర్థులు నీళ్ళు నమలాల్సిందే..ఆయన ఆలోచిస్తున్నారనడానికి 

అది సంకేతం.అది ఆయన వ్యూహరచనకు ఆనవాలు..గోళ్ళు కొరకడం ఆపితే మొదలయినట్టే వ్యూహాల అమలు..అలా గోళ్లు కొరుకుతూనే నేర్చుకున్నాడు ఓనమాలు..

అది అలవాటు కాదు..

అల"వేటు"..!

      

మొత్తానికి.. అపజయాలకు కృంగక,విజయాలకు పొంగక..ఒత్తిడులకు లొంగక సాగిన సత్తిబాబు ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరం...

అందులోనే విజయయాత్ర,

విహారయాత్ర,తీర్థయాత్ర..

దండయాత్ర..అన్నీ నిండి నిభిడీకృతమై ఉన్నాయి.

ఆయన యాత్ర కొందరికి చేదుమాత్ర..నాకు తెలిసి అలుపెరుగని ఆ మలుపుల యాత్రే ఆయన సక్సెస్ సూత్ర!


ప్రియమిత్రుడు సత్తిబాబు

జన్మదినం సందర్భంగా

హృదయపూర్వక అభినందనలు ..

మనఃపూర్వక

శుభాకాంక్షలతో..

          సురేసు..

(ఆయన నన్ను చనువుగా పిలిచేది అలాగే)

     9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు