నెమలిని వేటాడిన కేసులో ములుగు డీఎస్పీ తండ్రి అరెస్ట్-తుపాకీతో పాటు 34 బుల్లెట్లు స్వాధీనం

 


నెమలిని వేటాడిన కేసులో ములుగు డీఎస్సీ తండ్రితో పాటు మరో యువకుడిని జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి తుపాకీ, 34 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే డీఎస్పీ తండ్రి గతంలో జింకను వేటాడిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు.


జగిత్యాల జిల్లాలో నెమళ్ల వేట వెలుగులోకి వచ్చింది. తుపాకీతో నెమలిని వేటాడి చంపిన ఇద్దరిని పెగడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో ములుగు డీఎస్పీ తండ్రి ఉండడం కలకలం సృష్టిస్తుంది. గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన నలువాల సత్యనారాయణ(63), మల్యాల మండల కేంద్రానికి చెందిన జవ్వాజి రాజు (33) ఇద్దరు పెగడపల్లి మండలం దోమలకుంట శివారులో తుపాకీతో నెమలిని కాల్చి చంపారు.‌ నెమలిని కారులో తరలిస్తుండగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. వారి నుంచి కాల్చి చంపిన నెమలితోపాటు 0.22 SPORTING RIFLE అని రాసి ఉన్న తుపాకీ, 34 తూటలు, ఒక గొడ్డలి, AP15 BN 8093 నెంబర్ గల కారును స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం, లైసెన్స్ లేకుండా తుపాకీతో ఫైరింగ్ చేయడంపై ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. వన్యప్రాణిని వేటాడిన ఇద్దరిని పట్టుకున్న పెగడపల్లి పోలీసులను జగిత్యాల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు