కలంపై కత్తి..ఎవరి కుయుక్తి..!?

 కలంపై కత్తి..ఎవరి కుయుక్తి..!?



ఇవాళ రేపు..అందునా సోషల్ మీడియా వచ్చాక..దాని విస్తృతి పెరిగాక ప్రతివాడు 

తానే మీడియాగా మారిపోయి

నిజమైన మీడియాని

విమర్శించడం ఎక్కువైపోయింది.

అందునా మతం మత్తులో మునిగి తేలుతున్న కొందరికి

అయిన దానికి..కాని దానికి

జర్నలిస్టులను 

దుమ్మెత్తి పోయడం అలవాటైపోయింది.

నిజానికి ఇలా విమర్శించే వారిలో రాసే జనం ఎవరూ ఉండరు.ఎక్కడో ఎవరో 

ఒక పథకం ప్రకారం రాయించే ఆర్టికల్స్ ను చదివి..

ఒక్కోసారి పూర్తిగా చదవకుండా ఉత్తర క్షణంలో ఫార్వర్డ్ చేసేసి తమలో తాము దేశభక్తుల్లా ఫీలైపోవడం సోషల్ మీడియా ప్రభంజనంలో

పరిపాటైపోయింది.


*_ఇవన్నీ మీడియాకి కనిపించవా.._*


*_ఏం చేస్తోంది మీడియా.._*


*_ఇలాంటివి చూపించదా మీడియా.._*


*_అమ్ముడుపోయిన మీడియా..!_*


_ఇదీ వరస.._


ఈ తరహా ప్రశ్నల పరంపరతో ఆర్టికల్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి.వీటి కింద రాసే వారి పేరు ఉండదు.

ఇవన్నీ కొన్ని వర్గాలు 

పని కట్టుకుని చేసే 

విషప్రచారంలో భాగం.!



కొన్ని పార్టీలు ఇలాంటి ఆర్టికల్స్ రాయించుకోడానికి

టీమ్స్ ఏర్పాటు చేసుకుని ఉంటాయి.ఆ మధ్య మణిపూర్లో జరిగినటువంటి ఉదంతాలు చోటు చేసుకున్నప్పుడు 

ఆ బృందాలు వెంటనే 

తమ కలాలకు పని చెబుతాయి.

ఎవరో చెప్పే ప్లాటుకి అనుగుణంగా..

అనుకూలంగా స్క్రిప్టులు తయారవుతాయి.వీటిని సోషల్ మీడియాలో శరపరంపరగా వ్యాప్తి చేసేందుకు  కూడా ప్రత్యేక యంత్రాంగాలు ఉంటాయి.

ఒకసారి సోషల్ మీడియాలోకి చేరిందంటే

దాని జోరు..అది చూపే ప్రభావం ఎలా ఉంటుందో మొన్న మణిపూర్..

అంతకు ముందు కేరళ..ఢిల్లీ..ముంబై..

గుజరాత్..ఇలా ఎన్ని ఉదంతాల్లో చూడలేదు మనం..!?


అసలు విషయానికి వస్తే..

ఒక వార్తను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు జర్నలిస్టులు ఎంత కష్టపడతారో ఎందరికి తెలుసు.విషయం తెలిసేలా ఎక్కడికక్కడ సోర్సులు ఏర్పాటు చేసుకొని ఉంచుకోవాలి..

తెలిసిన వెంటనే హుటాహుటిన స్పాట్ కి చేరుకోవాలి..ఈలోగా ప్రాథమిక సమాచార సేకరణ..అక్కడికి వెళ్ళాక అదెంత హైరానా..

విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి..మనసులోనే విశ్లేషించుకోవాలి..ఇవన్నీ చేస్తూ ఎంతమందితోనో మాటాడాలి..ఎవరు నిజం చెబుతున్నారో..ఎవరు గాలి కబుర్లు మూటకట్టి అందిస్తున్నారో నిగ్గు చూడాలి..ఈలోగా డెడ్ లైన్లు..అవి పీక మీద కత్తి వంటివి..రాసేటప్పుడు ప్రతి అక్షరం.. పదం ఆచితూచి వేయాలి..లేదంటే విమర్శల వెల్లువ...కేసుల గొడవ..

ఎడిటర్ల చీవాట్లు..

యాజమాన్యాల చర్యలు..

ఇవన్నీ ఆలోచించుకుంటూ

అక్షరాలు పేర్చాలి. మీనమేషాలకు తావు లేని 

వ్యవహారం..!


నువ్వు ఇంట్లో తీరిగ్గా కూర్చుని పేపర్ చూసో..

ఠీవీగా టివి చూస్తూ తెలుసుకునే విషయం 

ఒక్కోసారి జర్నలిస్టులు ప్రాణాలను సైతం లెక్క చేయని సాహసంతో సేకరించే

వార్తగా నువ్వు గుర్తించవు..

కాశ్మీర్లో విద్రోహశక్తుల నుంచి ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా కలం..కెమెరా ఆగుతున్నాయా..

భోపాల్ గ్యాస్ లీకేజీ..

బొంబాయి విధ్వంసాలు..

పంజాబ్ ఆందోళనలు..

అస్సాం ఉద్యమాలు..

బోడో సమస్యలు .

గుజరాత్ అల్లర్లు..

హైదరాబాద్ మతకల్లోలాలు..

వానలు..వరదలు.. 

ఉప్పెనలు..ఉత్పాతాలు..

సునామీలు.. ప్రమాదాలు..

ఇలా ఎన్ని ఉదంతాలు..

ఇంకెన్ని సంఘటనలు..

మరెన్ని దుర్ఘటనలు..

జర్నలిస్టు లేనిదెక్కడ..

కరోనా సమయంలో చేసిన సేవలు తక్కువైనవా..

నిజానికి ఆ విపత్కర సమయంలో డాక్టర్లకు..ఆస్పత్రి సిబ్బందికి..పోలీసులకు..కలెక్టర్లకు..ఇతర రెవెన్యూ ఉద్యోగులకు..

పారిశుధ్య కార్మికులకు..

పరాకాష్టగా ప్రదానికి వచ్చిన పేరులో రవ్వంతైనా జర్నలిస్టులకు వచ్చిందా..

ఏ విపత్కర సమయంలోనైనా జర్నలిస్టు

ఇంట్లో కూర్చుంటే జరిగే పనా..నాలుగు గాలికబుర్లు

పోగేసి రాస్తే వార్తా..!

రాసే ప్రతి అక్షరం..

చూపే ప్రతి దృశ్యం వెనక తిరుగులేని చిత్తశుద్ధి..

అంతులేని శ్రమ..!


ఇంతా చేసి చాలా మంది

జర్నలిస్టులకు సరైన జీతాలే ఉండవు..ఉద్యోగ భద్రత అసలే నాస్తి..ఇన్సూరెన్సులు ఇళ్లే..ఒక్కోసారి నిద్రాహారాలు కరవై ఆరోగ్యం దెబ్బతింటున్నా విధినిర్వహణలో ఉండడం తప్పని సరి.. వేళాపాళా ఉండని కొలువు.. బ్రతుకు బరువు..!


*_జర్నలిస్టులు ఎలా తయారయిపోయార్రా.._*

ఇది సులభంగా అనేసే మాట.


వ్యాపారి కల్తీ చేస్తాడు..

అధిక ధరకు 

అమ్ము తాడు..

లాభాపేక్ష...

అది వ్యాపార ధర్మం..!


కొందరు ఉద్యోగులు ఒక్కోసారి పనే చెయ్యరు.

చేసినా సమయపాలన ఉండదు.పైగా కొందరైతే చెయ్యి తడపకపోతే మొహమే చూడరు.

అది ఉద్యోగ నీతి..రీతి..!


ఇక రాజకీయ నాయకుల

చరిత్ర చెబితే అదో పెద్ద పురాణం..వారు అనుభవిస్తున్న భోగాలు..

చవిచూస్తున్న వైభోగాలు..

చేసే అక్రమాలు..సంపాదించే ఆస్తులు..పదవుల కోసం వేసే వేషాలు..తప్పుడు పనులు..

వీటిపై ఎవరూ నోరెత్తరు..

నిలదీసే దమ్ము ప్రశ్నించే సత్తా ఎటూ ఉండవు.కనీసం అడగాలన్న ఇంగితం కూడా 

కిమ్మన్నాస్తి..

అది జనం రాజకీయం..

పైగా వాళ్ళు నాయకులు.. బలమైనోళ్లు..!


సమాజంలో ఇన్ని రకాల అవకారాలు ఉండగా ఒక్క జర్నలిస్టు బ్రతుకు చిత్రమే కనిపించిందా ఆధునిక విమర్శకులకు.. 

జర్నలిస్టులు దేనికీ అతీతులు కారు.తప్పులు చేయకుండా ఉండరు.

కొన్ని వ్యక్తిగతం కావచ్చు.అయితే చాలా మటుకు యాజమాన్యాల విధానాల ప్రభావం రాతకపై ఉంటుంది. జర్నలిస్టులు కాని యజమానులు..

జర్నలిస్టులమనే సంగతే మరచిపోయిన కొందరు ఎడిటర్లు..పత్రికలైతే

ప్రకటనల ఆబ్లిగేషన్లు..ఛానళ్ల టీఆర్పీ రేటింగులు..

ఇవన్నీ అక్షరాలకు అడ్డంకులే..

అయితే ఇదిగో.. 

ఇలా తిట్లకు..

చీదరింపులకు..విమర్శలకు  జర్నలిస్టులే బలిపశువులు..!


నిజానికి గోద్రా తరహా విధ్వంసాలు .మణిపూర్ మాదిరి ఉదంతాలు ఎవరి పనుపున..ఎవరి ప్రయోజనాల కోసం జరుగుతున్నాయో 

ఆ గట్టుమట్లను విప్పుతున్నదీ..

విప్పగలిగేది పాత్రికేయులు మాత్రమే..అయితే తప్పును నమ్మినంత సులువుగా నిజాన్ని ఒప్పని జనం 

అలాంటి వార్తలకు ప్రాధాన్యత ఇవ్వరు.

ప్రచారానికి ఒప్పరు.

కొందరి దృష్టిలో  అవి ఫార్వర్డ్ కి పాత్రమైనవి కావు..!



సురేష్ కుమార్ ఎలిశెట్టి

        జర్నలిస్ట్

     9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు