మనిషి అయుప్రమాణాలు వందల ఏళ్లకు పెరగనున్నాయి - ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్


 మనుషుల ఆయుప్రమాణాలు వందల ఏళ్లకు పెరిగే రోజులు వస్తున్నాయి.  విద్య, వైద్య, ఫార్మా రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు, భవిష్యత్తులో వచ్చే వినూత్న ఆవిష్కరణలతో మనిషి జీవించే కాలం పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ చెప్పారు. పాడైన అవయవాలు, చనిపోయే దశలో ఉన్న జీవకణాలను మార్చడం ద్వారా మనం 200, 300 ఏళ్లు జీవించే వీలుంటుందని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మనిషి సగటు జీవితకాలం 35 సంవత్సరాలుండగా ప్రస్తుతం 70 ఏళ్లుందన్నారు.

ALSO READ ఇన్పోసిస్ కోసం స్టోర్ రూములో నారాయణ మూర్తి

జేఎన్టీయూ హైదరాబాద్లో శుక్రవారం జరిగిన 12వ స్నాతకోత్సవం లో ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సోమనాథ్ గౌరవ డాక్టరేట్ స్వీకరించి స్నాతకోపన్యాసం చేశారు. దేశంలో భారీ వ్యయంతో నిర్మిస్తున్న సినిమాలతో పోలిస్తే అంతరిక్ష రహస్యాలను తెలుసుకునేందుకు ఇస్రో చేస్తున్న పరిశోధనలు తక్కువ ఖర్చుతో పూర్తవుతున్నాయని వివరించారు.

ఈ ఏడాది పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీలను గ్రహాల కక్ష్యల్లోకి పంపుతున్నాం. వీటిద్వారా తుపాన్లు, భారీ వర్షాలు ఎప్పుడు, ఎక్కడ వస్తాయన్నది కచ్చితంగా తెలిసే అవకాశాలున్నాయి. అంతరిక్షంలోకి మనుషులను పంపే మిషన్ గన్యాన్ను ఈ ఏడాదిలోపు పూర్తి చేయనున్నా మని తెలిపారు.

సూర్యగ్రహంపై చేస్తున్న ప్రయోగం శనివారం సాయంత్రం 4 గంటలకు మొదలవుతుందని చెప్పారు. విద్యార్థులు బావిలో కప్పల్లా ఉండకూడదని, కృత్రిమమేధ, మిషన్ లెర్నింగ్ ప్రభావం ఇప్పటికే చదువులు, పరిశోధనలపై పడిందని గుర్తించాలన్నారు. రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు అత్యాధునిక రోబోలు సృష్టిస్తే వాటిని భవిష్యత్తులో ఇస్రో తరపున అంగారక, శుక్రగ్రహాలపై చేయనున్న ప్రయోగాల్లో వినియోగించుకుంటామని తెలిపారు. 54 మంది విద్యార్థులకు ఆయన బంగారు పతకాలను ప్రదానం చేశారు. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, రెక్టార్ గోవర్ధన్, ఆచార్యులు, విద్యార్థులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఛాన్సలర్ హోదాలో గవర్నర్ తమిళిసై వీడియో సందేశం పంపించారు. దేశంలోనే అత్యుత్తమ సాంకేతిక విశ్వవిద్యాలయంగా జేఎన్టీయూ నిలిచిందని పేర్కొన్నారు.

నేనూ ఒకటి, రెండు పరీక్షల్లో ఫెయిలయ్యా..

ఏదైనా సబ్జెక్ట్ ఫెయిలైతే పిల్లలపై తల్లిదండ్రులు, స్నేహితుల ఒత్తిళ్లు తీవ్రంగా ఉంటున్నాయి. ప్రస్తుతం నేను ఈ స్థితిలో ఉన్నందుకు అన్నీ విజయాలు సాధించానని మీరు అనుకుంటారు. కానీ నేనూ ఒకటి, రెండు పరీక్షల్లో ఫెయిలయ్యా అని డాక్టర్ సోమనాథ్ తెలిపారు. స్నాతకోత్సవానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదురయ్యే అపజయాలు నిజంగా విజయానికి మెట్లేనని అన్నారు. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతమైందంటూ విశ్వవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. అంతకుముందు రెండుసార్లు ఫెయిల్ అయిన అంశాన్ని అందరూ మర్చిపోయారు. అపజయాలను విద్యార్థులు సోపానంగా మలుచుకోవాలి. నేను కూడా రాకెట్లు, ఉపగ్రహాలు తయారు చేసేటప్పుడు తప్పులు చేశా. వాటిని నిజాయతీగా అంగీకరించి విజయం సాధించేందుకు ఏంచేయాలో ఆలోచించా అని వివరించారు. అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తి ప్రదర్శించే విద్యార్థుల కోసం యువిక పేరుతో సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టామని, ఇస్రో అధికారిక వెబ్సైట్లో పూర్తి వివరాలున్నాయని ఆయన వివరించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు