బలమైన బి సి లను గెలిపించుకుందాం బి సి రాజ్యాధికారానికి బాటలు వేద్దాం

 బలమైన బి సి లను గెలిపించుకుందాం బి సి రాజ్యాధికారానికి బాటలు వేద్దాం



    ప్రజాస్వామ్యంలో కీలకమైన ముఖ్యమైన ఎన్నికల గురుంచి చర్చించుకునే ముందు మన బి సి ల గురుంచి వివరంగా చర్చించుకోవాలి. బి సి ల బానిసత్వం గురుంచి తెలుసుకోవాలి. తరతరాల బి సి చాకిరి, అణచివేత గురుంచి చర్చుంచుకోవాలి. బి సి ల ఆత్మగౌరవం గురుంచి చర్చ జరగాలి. అంతిమంగా బి సి ల రాజ్యాధికారం గురుంచి చర్చ జరగాలి. మేమెంతమందిమో మాకంత వాటా అంటూ ఎన్నో ఏండ్లుగా పోరాడుతున్నప్పటికి బి సి లను పట్టించకున్నవారు లేరు. జనగణన కావాలని, చట్టసభల్లో బి సి  లకు రిజర్వేషన్లు కావాలని ఎంత మొత్తుకున్నా ఎన్ని పోరాటాలు చేసినా ఈ ప్రభుత్వాలు కిమ్మనడం లేదు. ఎన్నికల సమయంలో పార్టీలు ఇచ్చే సీట్లలోనైన బి సి లకు సముచిత స్థానం ఇస్తామంటున్న పార్టీలు మాట తప్పుతున్నయాయి. ఇలాంటి పరిస్థితిలో బి సి లు ఏమి చేయాలో చర్చ చేద్దాం రండి. 
   ఒకరేమో బి సి ముఖ్య మంత్రి అంటారు. ఒకరేమో బి సి లకు 70 సీట్లు ఇస్తామంటారు. ఒకరేమో బి సి లకు సిగ్గు లేదా అని మాట్లాడుతున్నారు. ఒకరేమో బి సి ముఖ్యమంత్రి అన్నందుకు బి సి ఓట్లన్నీ గంప గుత్తగా బిజెపి కి వేయాలని ప్రచారం చేస్తున్నారు. చివరకు దళితులు కూడా బి సి లు ఎటు వైపు ఓటు వేయాలో దిశ నిర్దేశం చేసే దుస్థితి ఏర్పడింది. బి సి జనగణన చేయని, బి సి లకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించని పార్టీ, పట్టుమని 10 సీట్లు కూడా గెలిచే అవకాశం లేని పార్టీ కూడా బి సి ని ముఖ్యమంత్రి చేస్తామని, బి సి లంతా మాకే ఓటు వేయాలని బి సి ప్రజలను గందరగోలపరుస్తున్నారు. 
    బి సి లకు ఇట్లాంటి దుస్థితి ఎందుకు ఏర్పడింది? ఈ పరిస్థితి నుండి ఎప్పుడు బయట పడుతాము? ఎలా బయట బయట పడుతాము? 
    బి సి లలో ఐక్యత లేనందునే ఇంతటి చులకన, ఇంతటి చిన్నచూపు, ప్రతివాడు మాట్లాడే దుస్తితి ఏర్పడింది. బి సి లలో ఎదిగిన వారు ఒక తాటి మీద లేకుండా తలా ఒక పార్టీలో ఉండడం, కులానికో సంఘం పెట్టుకోవడం వల్లనే బి సి ల గురుంచి ఇంత చులకనగా మాట్లాడుతున్నారు. బి సి లకు ఆత్మగౌరవం దక్కాలంటే అసెంబ్లీ తో పాటు అన్ని స్థాయిల్లో మన జనాభా దామాషా ప్రకారం మనం ఉండాలి. ప్రజా ప్రతినిధులుగా ఉన్నప్పుడే మనకు ఆత్మగౌరవం దక్కుతుంది. బి సి లలో ఐక్యత ఉంటేనే ఏదైనా సాధించవచ్చును. ఐక్యత - అధికారం - అభివృద్ధి - ఆత్మగౌరవం అనే ఎజెండాతో ముందుకు సాగాలి. 
ప్రస్తుత ఎన్నికల్లో బలమైన బి సి అభ్యర్థులను, సీనియర్ ఎమ్మెల్యేలను ఓడించడానికి అన్ని పార్టీల్లో ఉన్న ఆధిపత్య కులాలవారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గ స్థితిలో బి సి బిడ్డలుగా, బి సి మేధావులుగా, బి సి విద్యార్థులుగా, బి సి మహిళలుగా, బి సి కార్మికులుగా, బి సి రైతులుగా, బి సి ఉద్యోగులుగా, బి సి ప్రొఫెషనల్స్ గా, బి సి కుల సంఘాలుగా మనమంతా కలిసి బలమైన బి సి నాయకులను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన అవసరముంది. గెలుపుకు దగ్గరలో ఉన్నవారిని గెలిపించుకోవడానికి బి సి లు పార్టీలకు అతీతంగా కృషి చేయాలి. బి సి ల ఓటు బి సి లకు వేసుకొని బలమైన నాయకులను గెలిపించుకోవాలని విజ్ఞప్తి. గెలిచే అవకాశమున్న బలమైన నాయకులను కూడా మనం గెలిపించుకొకపోతే భవిషత్ లో మన బి సి ఉద్యమాలకు సహకారం కరువవుతుంది. బి సి లను ఓడించడానికి ఆధిపత్య కులాల వారు పార్టీలకు అతీతంగా ఏకమైనప్పుడు బి సి లు ఎందుకు కాకూడదు. ఆలోచన చేయండి. 
    పార్టీలు, సంఘాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా గెలిచే అవకాశమున్న మన బి సి లను గెలిపించుకొని రానున్న రోజుల్లో బి సి రాజ్యాధికారాన్ని సాధించుకుందాం అనే నినాదం తో ముందుకు వెలుదాం.

సాయిని నరేందర్ 
సామాజిక విశ్లేషకులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు