చంపేసే మత్తుకు కావద్దు చిత్తు..!

 చంపేసే మత్తుకు 

కావద్దు చిత్తు..!

********

మత్తు..

అనుభవించేవాడికి గమ్మత్తు

తెలియని మహత్తు..

తెలుసుకునే పాటికి

జీవితాలు చిత్తు..

ఇది తెలిసినా 


జనం యావత్తు..

మానలేని మాయ జగత్తు..!


నరాలను దొలిచేస్తున్నా

రక్తం పీల్చేస్తున్నా

గుండె పిండేస్తున్నా

సొమ్ములు పోతున్నా

కుటుంబాలే నాశనమైపోతున్నా

ప్రాణాలే హరించేస్తున్నా

లెక్క చెయ్యని వ్యసనం..

బ్రతుకే నాశనం..!


ఈ మత్తు నేరాలకు ప్రేరణ

దుర్మార్గానికి అనుకరణ..

నిన్ను నిన్నుగా గాక

ఉన్మాదిగా..ఉన్మత్తునిగా..

సమాజానికి దూరంగా

తనకు బానిసగా..

పూర్తి వశంగా..

కడకు శవంగా...

మార్చేసే మత్తు..

వదలుకోలేవా..

నీ దారి మార్చుకోలేవా..!


నిన్ను నువ్వు 

ఒక్కసారి చూసుకో..

ఏదీ నిన్నటి నీ సోకు...

నీ చదువు ఇచ్చిన కళ...

ఇస్త్రీ నలగని బట్ట..

అందంగా దువ్విన క్రాఫు..

నున్నగా గీసిన గడ్డం...

అవన్నీ మాసిపోయి

బ్రతుకే మసిబారి..

భవితే మసకబారి

మారిపోలేదా నీ దారి..

చుట్టూ ఎడారి..!..


అవసరమా..

నీకు నువ్వు దూరమై..

నీలోని నిన్ను మరచి..

ఇహం విడిచి..

నీ అహం సైతం విస్మరించి

ఎందుకీ బ్రతుకు..!?


సమాజం నిన్ను ఇంకా దూరం పెట్టేలోగానే..

నీ చుట్టూ ఉన్నవాళ్లు 

నిన్ను అసహ్యించుకోక ముందే..

నీ అనుకున్న వాళ్ళు

నిన్ను వెలివేయక మునుపే

బయటకు వచ్చెయ్..

నీ చుట్టూ ఉన్న పొగలు..

రోత పుట్టించే పరిసరాలు..

అసహ్యించుకునే పరిస్థితులు

అన్నిటికీ దూరంగా..రా..

అలా వస్తే..చుట్టూ పరికిస్తే..

అందంగా ప్రకృతి..

అండగా నీ జగతి..

ఆహ్లాదంగా నీ ఆకృతి..

వికసించే నీ పరిణితి..

అప్పుడు..జీవితంపై

మళ్లీ పెరిగే ప్రీతి..

మారిన నీకు

జగమెల్ల ప్రణతి..ప్రణతి..!

_________


ఎలిశెట్టి సురేష్ కుమార్

     9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు