బి.సి లకు ఇచ్చేది భిక్ష కాదు రాజ్యాంగ హక్కు


స్థానిక సంస్థల్లో వాటా ఇచ్చే వరకు వదలం


అన్ని పదవుల తీసుకున్న అగ్ర కులాలు స్థానిక సంస్థల్లో అవకాశం కూడా ఇవ్వరా? 


బి.సి లు బానిసత్వం వీడాలి తెగించి పోరాటం చేయాలి


బి.సి చైతన్యం కోసం గ్రామాలకు తరలాలి


రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య


బి ఆర్ ఎస్ నాయకులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్


బి.సి జనసభ అద్యక్షులు రాజారాం యాదవ్


ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ 


    తరతరాలుగా ఎంతో శ్రమ కోరుస్తూ దోపిడి రాజకీయ పార్టీల జెండాలు మోస్తున్న బి.సి లకు ఇచ్చేది భిక్ష కాదని రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఆ హక్కులు సాధించడం కోసం ప్రతి బి.సి ఉద్యమించాలని, ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు తెగించి పోరాటం చేయక తప్పదని రాజ్యసభ సభ్యులు, జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ - కుల జనగణన అనే అంశంపై హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బి.సి కుల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బి.సి జనసభ అద్యక్షులు రాజారాం యాదవ్ అధ్యక్షతన గురువారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రులు, ఎం.పి, ఎమ్మెల్యే, రాష్ట్ర స్థాయి పదవులన్ని అనుభవిస్తున్న ఆధిపత్య కులాలు కనీసం స్థానిక సంస్థల్లో కూడా బి.సి లకు అవకాశం ఇవ్వరా? ఈ దేశం ఏమైనా ఆధిపత్య పార్టీల జాగీరా? అని ఆయన ప్రశ్నించారు. బి.సి ల విద్యాభివృద్ధికి రెండు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వని పాలకులు బడా కార్పొరేట్ సంస్థలకు ఏకంగా 16 లక్షల కోట్ల రూపాయల బకాయిలను మాఫీ చేసిందని ఇలాంటి దుర్మార్గ పాలనపై బి.సి లు దండెత్తడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇకముందు జరగనున్న చారిత్రిక పోరాటంలో ప్రతి ఒక్క బి.సి భాగస్వామ్యం కావాలని అన్నారు. 

    ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పట్టణాల్లో జరుగుతున్న సమావేశాలు, చైతన్యం గ్రామాల్లోని ప్రజలకు చేరకపోవడం వల్ల దోపిడి చేస్తున్న వారికే అణగారిన ప్రజల ఓట్లు వేస్తున్నారని ఈ స్థితి మారనంత వరకు అణగారిన ప్రజలకు విముక్తి జరగదని ఆయన అన్నారు. అణగారిన ప్రజలకు చైతన్యం లేక, శక్తి లేక మండల్ కమీషన్ అమలుకు 13 ఏండ్లు పట్టిందని, బి.సి ల ఓట్లు ఎక్కువగా ఉన్నా, బి.సి లు ఎందుకు గెలవలేకపోతున్నారో ఆలోచన చేయాలని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో పొందుపరచిన అన్ని అంశాలతో పాటు కుల జనగణన సాధించుకోవాలని, మేమంత మందిమో మాకంత వాటా న్యాయమైన, ధర్మమైన డిమాండ్ సాధన కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని అన్నారు.

     బి.సి జనసభ అద్యక్షులు రాజారాం యాదవ్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన కుల జనగణన చేయకుండా, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలు జరపాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీని బి.సి సంఘాల ధర్నాలు చేసి ప్రశ్నించడం వల్ల వెనక్కి తగ్గిందని, అధికారం చేపట్టి ఆరు నెలలు అయినా జనగణన గురుంచి ఊసెత్తని ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. న్యాయ స్థానం పేరు చెప్పి స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను ఇవ్వకుండా చూస్తుందని, ఇబిసి లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే అడ్డురాని న్యాయ స్థానాలు ఇక్కడ వస్తాయా అని ప్రశ్నించారు. తెలంగాణ సాధన కోసం ఆర్ ఎస్ యు నుండి ఆర్ ఎస్ ఎస్ వరకు ఏకమైనట్లు కామారెడ్డి డిక్లరేషన్ తో పాటు చట్టసభల్లో బి.సి వాటా సాధన కోసం పార్టీలకతీతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. 

   ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ తెలంగాణలో బి.సి అభివృద్ధికి దోహదం చేసే కామారెడ్డి డిక్లరేషన్ అంశాల సాధనకు జరుగబోయే ఉద్యమంలో రాష్ట్రంలోనున్న బి.సి లు కదంతొక్కాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో 42 శాతం వాటా సాధనతో పాటు రానున్న రోజుల్లో చట్టసభల్లో బి.సి వాటా సాధన ద్వారానే బి.సి ల విముక్తి సాధన జరుగుతుందని అన్నారు. 

     ఈ కార్యక్రమంలో మేకల కృష్ణ స్వాగతోపాన్యాసం చేయగా ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇ వెంకటేష్, హిందూ బి.సి మహాసభ అద్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్లు, అఖిలభారత యాదవ మహాసభ కార్యదర్శి రమేష్ యాదవ్, వివిధ సంఘాల నాయకులు చాపర్తి కుమార్ గాడ్గే, సంజీవ్ నాయక్, బోల్ల కరుణాకర్, జగన్ మోహన్ ముదిరాజ్, సీనియర్ జర్నలిస్టు రమణ కుమార్, హరిత్ రూడ, పీతం ప్రదీప్ కుమార్, అనంతుల రామ్మూర్తి గౌడ్, కాండ్ర నరసింహ యాదవ్, దేశం మహేశ్ గౌడ్, అల్లం సతీష్, అశోక్ పోచం, రాజు, జిల్లా నరేందర్, విద్యార్థి నాయకులు కిరణ్ కుమార్, లింగం, దత్తాత్రేయ, ఏటిగడ్డ అరుణ, డాక్టర్ కీర్తిలత గౌడ్, శ్రీహరి యాదవ్, పాక శ్రీనివాస్ యాదవ్, నారోజు రత్నం చారి, ఐలేష్ యాదవ్, నాగరాజు, కామేశ్వర్ రావు, ఏలేశ్వరం వెంకటేష్ తదిరులు పాల్గొని ప్రసంగించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు