జలమే జీవనం...!


 మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం

జలమే జీవనం...!

------------------------------------

జలమే మానవ జీవనానికి ఆధారం..ప్రాణాధారం..

నాగరికతకు నుడికారం..

నీరే లేని నాడు

నువ్వూ లేవు..

నేనూ లేను..!

అలాంటి నీరే ఇంకిపోతే

అందుకు నువ్వూ నేనూ 

కారణమైతే క్షమార్హమా..

ఆ విచక్షణ కలిగేదాకా

అసలు..మనముండేనా..!?


ఇప్పటికే ఆలస్యం..

మేలుకో అవశ్యం..

నీటిలో నిప్పు పుట్టించే

బుద్ధి మాని నీరే పుట్టించే 

ఆలోచన చెయ్యి..

జలయజ్ఞంలో వేస్తూ 

తలో చెయ్యి..!


పెరుగుతోంది భూమి తాపం

అయినా కలగదేమి

నీలో పశ్చాత్తాపం..

వానలు పడని ఈ కాలం

మండిపోయే ఎండాకాలం

వేధించే తుపానులు..

ముంచెత్తే సునామీలు..

ప్రకృతి సృష్టించిన ప్రమాదాలా..

మానవ తప్పిదాలా..!

చెట్లు నరికి..

పొలాలను బీడులు చేసి..

పంట భూములను 

రియల్ ఎస్టేట్ 

వ్యాపారకేంద్రాలుగా మార్చి

నువ్వే సృష్టించిన జనారణ్యం

ఇదంతా నీ పుణ్యం..!


వీరబ్రహ్మం చెప్పినట్టు 

నీరు కొనుక్కునే రోజు

వచ్చేసి చాన్నాళ్లయింది..

కొనడానికి కూడా నీరు

దొరకని ఆ రోజు ముంచుకొస్తే

ఊహకే అందని మారణహోమం..

అతి దారుణం..

శవాల తోరణం..

ప్రతి క్షణం చావుతో రణం..

చేసే దమ్ముందా!?


మేలుకో..

నిన్ను కాచే జనయిత్రి..

ఈ ధరియిత్రి..

అమ్మలోని గొప్పదనం..

ఆ నీటి చల్లదనం..

నీ ప్రాణ'ధనం'...

కలకాలం నిన్నంటి ఉండేలా..

నీ సంబరం మిన్నంటేలా!!


గుర్తుంచుకో..

ప్రతి నీటి చుక్క..

నీ బ్రతుకున వేగుచుక్క..

వ్యర్దం..నీకు అనర్థం..

ఈనాటి నీ పొదుపు

రేపటి నీ బంగారు 

భవితకు మదుపు..!


ఎలిశెట్టి సురేష్ కుమార్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు