సాయన్న పోరాట స్పూర్తితో ఒబిసిల రాజ్యాధికార వాటా సాదిద్దాం - ఆల్ ఇండియా ఒబిసి జాక్ ఛైర్మన్ సాయిని నరేందర్
బహుజన వీరుడు పండుగ సాయన్న స్పూర్తితో చట్టసభల్లో బిసి వాటా కోసం సమరం చేయాలని ఆల్ ఇండియా ఒబిసి జాక్ ఛైర్మన్ సాయిని నరేందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం మిరిగోన్ పల్లి గ్రామంలో బహుజన వీరుడు పండుగ సాయన్న విగ్రహానికి పూలమాలలు వేసి చట్టసభల్లో బి.సి ల వాటా కోసం తలపెట్టిన మహా పాదయాత్రను విజయవంతం కోసం సన్నాహక యాత్రను ప్రారంభించి మాట్లాడారు. 18వ శతాబ్దంలో పీడిత ప్రజల విముక్తి కోసం వీరోచిత పోరాటం చేసిన పండుగ సాయన్న స్పూర్తితో భారతదేశంలోని బి.సి లను ఐక్యం చేసి చట్టసభల్లో వాటా సాధిస్తామని అందుకోసం జరిగే పాదయాత్రలో సబ్బండ కులాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలపునిచ్చారు. వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలం మరికల్, రంగారెడ్డి జిల్లా కుందుర్గ్ మండల కేంద్రం, షాద్ నగర్, జె పి దర్గా గ్రామాల గుండా సాగిన సన్నాహక యాత్రలో మరికల్ సర్పంచ్ ఎస్ పాండురంగయ్య, ఎం.పి.టి.సి దగ్గుల సత్యకుమార్ తదితరులు స్వాగతం పలికి పాదయాత్రకు మద్దతు పలికారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూ బి.సి మహాసభ వ్యవస్థాపక అద్యక్షులు బత్తుల సిద్దేశ్వర్లు మాట్లాడుతూ చట్టసభల్లో నానాటికీ తగ్గిపోతున్న బి.సి ల వాటా వల్ల సకల సామాజిక రంగాల్లో బి.సి ల వాటా తగ్గిపోయి వారి ఉనికికే ప్రమాదమని అన్నారు. చట్టసభల్లో వాటా ద్వారానే బి.సి ల అభివృద్ధి సాధ్యమవుతుందని వాటా కోసం జరిగే పాదయాత్ర విజయవంతానికి ప్రగతిశీల శక్తులు మద్దతు ఇవ్వాలని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో జరిగిన అన్ని పోరాటాల్లో కీలకంగా పాల్గొన్న బి.సి లు వారి హక్కుల కోసం, వాటా కోసం జరిగే పోరులో లక్షలాదిగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సలేంద్రం శివయ్య మాట్లాడుతూ బి.సి లల్లో ఐక్యత లేనందువల్లనే అణచివేతకు గురవుతున్నారని, మెజార్టీ ఓట్లు మనవైనప్పటికి రాజ్యంలో వాటా దక్కడం లేదని అన్నారు. ఐక్యతతో ఉద్యమాలు చేసి చట్టసభల్లో వాటా సాధించడం సాధిస్తే బి.సి ల జీవన స్థితిగతులు మెరుగుపడతాయని అన్నారు. చట్టసభల్లో వాటా సాధన కోసం జరిగే పోరాటంలో ముదిరాజ్ లు పెద్ద ఎత్తున పాల్గొంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఒబిసి జాక్ వైస్ ఛైర్మన్ వెలుగు వనిత, పటేల్ వనజక్క, నాయకులు చాపర్థి కుమార్ గాడ్గే, రమాదేవి, అరుణక్క, పద్మజాదేవి, అశోక్ పోషం, చొప్పరి పురుషోత్తం ముదిరాజ్, చింతలగారి వెంకటస్వామి, కోడి తిరుపతి, కొంగర నరహరి, బత్తుల రామనర్సయ్య, శిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ALSO READ Unveiling the Mirage: Decoding India's Budget Puzzle"
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box