సకల అసమానతల నిర్మూలన కోసం అవిశ్రాంత కృషిసల్పిన డాక్టర్ జయగోపాల్
సంస్మరణ సభలో సంఘాల నాయకులు
తరతరాలుగా భారతదేశంలో సృష్టించి కొనసాగిస్తున్న వర్ణ వ్యవస్థ వల్ల ఏర్పడిన సకల అసమానతలను రూపుమాపడం కోసం భారత నాస్తిక సమాజం వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ జయగోపాల్ నిర్విరామ కృషి చేశాడని పలువురు వక్తలు అన్నారు. ఆదివారం హన్మకొండ జిల్లా కేంద్రం భీమారం పెరియార్ భవన్ భారత నాస్తిక సమాజం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ జయగోపాల్ సంస్మరణ సభలో విముక్త చిరుతల కక్షి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలకర శ్రీనివాస్, ఆల్ ఇండియా ఒబిసి ఛైర్మన్ సాయిని నరేందర్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ సమన్వయకర్త చార్వాక, హేతువాద సంఘం నాయకులు రమాదేవి, వేదాంత, భారత నాస్తిక సమాజం రాష్ట్ర కన్వీనర్ ఉప్పులేటి నరేష్, మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం అధ్యక్షుడు బైరి నరేష్ తదితర నాయకులు జయగోపాల్ సమాజహితం కోసం చేసిన త్యాగపూరిత పోరాటాన్ని కొనసాగించినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని వారు అన్నారు. రాబెర్ట్ గ్రీన్ ఇంగిర్ సాల్, చార్లెస్ బార్లే లాంటి అంతర్జాతీయ మానవ హక్కుల నేతలతో పాటు భారతదేశంలోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, పెరియార్ లాంటి మహనీయులను అధ్యయనం చేసి వారి భావజాలాన్ని ఆయుధంగా చేసుకొని పోరాటం చేయడమే కాకుండా ఇంగ్లీష్, తెలుగులో ఎన్నో రచనలు చేసి, ఎన్నో సమావేశాల్లో ప్రసంగాలు చేసి ప్రజలను చైతన్యం చేయడంలో జయగోపాల్ కృషి చాలా గొప్పదని వారు అన్నారు. కుల వివక్ష, వర్ణ వివక్ష, లింగ వివక్షతతో పాటు మూఢనమ్మకాల నిర్మూలన, మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసిన జయగోపాల్ భారతదేశంలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావాలని ఎంతో పోరాటం చేశారని తెలిపారు.
తీర్మానాలు
భారత సమాజంలో జరుగుతున్న పోరాటాలకు మద్దతు పలుకుతూ, జరుగుతున్న దుష్ట సంఘటనలపై తీర్మానాలు చేశారు. ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాటానికి మద్దతు తెలిపారు. కామారెడ్డిలో మహిళపై జరిగిన దాడిపై, వరంగల్ జిల్లాలో మంత్రాల నెపంతో తల్లి కొడుకులను హత్యను, దన్వాడ చర్చి పై ఆర్ ఎస్ ఎస్ చేసిన మూఖ దాడిని భారత నాస్తిక సమాజం ఖండిస్తున్నట్లు తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో భారత నాస్తిక సమాజం జాతీయ నాయకులు శ్యామల, రశీదు, జ్యోతికుమార్, రాష్ట్ర నాయకులు గుమ్మడిరాజుల సాంబయ్య, గుత్తికొండ చక్రాధర్, పెండ్యాల సుమన్, జాబాలి, యాదగిరి, వివిధ సంఘాల నాయకులు ఐతమ్ నగేష్, చాపర్తి కుమార్ గాడ్గే, పటేల్ వనజక్క, వెలుగు వనుతక్క, అరునక్క, రమాదేవి, అమ్మవొడి శ్రీనివాస్, సింగారపు అరుణ, స్వప్న, సంతోష్, అనిల్, రాసమల్ల లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box