నిర్భయ నాస్తికవాది డాక్టర్ జయగోపాల్
గొప్ప మానవతావాది డాక్టర్ జయగోపాల్
ఆంధ్ర పెరియార్ గా ప్రసిద్ధి పొందిన డాక్టర్ జయగోపాల్ ఒక ప్రసిద్ధ హేతువాది, సామాజిక ఉద్యమ కారుడు, రచయిత. భారతదేశంలో మతపరమైన అంధ విశ్వాసాలను సవాలు చేసి అంధ విశ్వాసాలు, మూడాచారాలకు వ్యతిరేకంగా పోరాడటం, శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. స్వేచ్ఛాలోచన, తార్కిక విశ్లేషణ, మానవత్వం పట్ల అతని అచంచల నిబద్ధతయే అయన్ను హేతువాద ఉద్యమంలో అత్యంత ప్రభావశాలిగా మార్చింది. నిర్లక్ష్యం మరియు సామాజిక తిరస్కారంతో కూడిన బాల్యం ఉన్నప్పటికీ, డా. జయగోపాల్ జ్ఞానాన్ని, చరిత్రను అధ్యయనంలో తన ప్రయాణాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. బాల్య దశలోనే స్నానపు గదిలో రహస్యంగా పుస్తకాలు చదవడం నుండి మొదలైన తన ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాస్తిక నాయకుడిగా మారిన తీరు వెనుక ఆయనతో పాటు ఆయన సహచరి శారదమ్మ కృషి ఎంతో ఉంది. తన స్థైర్యం, మేధో మథనం, అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన తీరు సమాజానికి ఆదర్శం.
సంపన్న కుటుంబంలో వీరరాజు మహాలక్ష్మి లకు 1945 లో జన్మించారు. తండ్రి కఠినమైన, సంప్రదాయవాద వ్యాపారవేత్త, తల సాంప్రదాయ, మత విశ్వాసాలను పాటించేవారు. జయగోపాల్ ఐదుగురు సోదర సోదరీమణుల్లో రెండవవాడు. సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ, అతని మేధో కుతూహలం, మూడ ఆచారాలను ప్రశ్నించడం వల్ల ఇంట్లోనే తీవ్ర వివక్షతతో శిక్షలు వేసి తీరని అన్యాయం చేశారు. చిన్నతనంలో స్మాల్ పాక్స్ (మీజిల్స్) బారిన పడిన జయగోపాల్ గురుంచి వైద్య సలహా తీసుకోకుండా ఆయన చదువు అతని అనారోగ్యానికి కారణమని నమ్మి విద్యకు దూరం చేసారు. అజ్ఞానానికి లొంగిపోకుండా జయగోపాల్ స్నానపు గదిలో రహస్యంగా పుస్తకాలు, వ్యాసాలను చదివే వారు. తనకున్న ప్రతి అవకాశాన్ని తన జ్ఞానాన్ని విస్తరించడానికి ఉపయోగించాడు. ఈ జ్ఞాన దాహం ఆయన భవిష్యత్తును హేతువాదం వైపు నడిపింది. జయాగోపాల్ జీవితంలో అత్యంత దుర్మార్గమైన సంఘటన తన ఇంట్లోనే జరిగింది. మతపరమైన ఆచారాన్ని ప్రశ్నించినందుకు తండ్రి కోపంతో తలక్రిందులుగా వేలాడదీసి క్రూరంగా కొట్టాడు. జయగోపాల్ అరుపులు విన్న పొరుగువారు జోక్యం చేసుకున్నా తండ్రి మొండిగా ప్రవర్తించాడు. పిల్లవాడి ప్రాణాలకు భయపడిన పొరుగువారు తలుపు విరగగొట్టి జయగోపాల్ ను రక్షించారు. అప్పటికే క్రూరమైన దాడి వలన ఆయన శ్రవణ సామర్థ్యానికి శాశ్వత నష్టం కలిగించింది. పూర్తిగా చెవిటి వానిగా మార్చింది. చాలా సందర్భాల్లో రెండు రోజుల పాటు ఆహారం కల్పించలేదు. ఆకలితో బలహీనపడి రోడ్డుపై కుప్పకూలిపోయిన సంఘటనలు ఉన్నాయి.
చిన్న వయస్సు నుండే జయగోపాల్ తన వయస్సుకు మించిన బాధ్యతలను చేపట్టవలసి వచ్చింది. ఇంటి పనులు చేయడంతో పాటు తన చెల్లెల్ల బాధ్యతలను చూడటం, తన తండ్రి అద్దాల దుకాణంలో పని చేసేవారు. అయినా ఆయనపై క్రూరత్వం ఆపలేదు. ఇంత కష్టాల్లో ఆయనకి దొరికిన ఏకైక స్వావలంబన గౌరి పిన్ని. ఆమెకు పిల్లలు లేనందున తన స్వంత కుమారుడిలా చూసుకునేది. జయగోపాల్ ఆమెను ‘అమ్మ’ అని పిలవడం ప్రారంభించాడు. ఇది ఆయన తల్లికి అసూయను కలిగించింది. జయగోపాల్ గారిని కొట్టి, ఆమెను ఇంటికి రావడం మానిపించేసింది. ఆయనను నిజంగా ప్రేమించే ఏకైక వ్యక్తి నుండి వేరుపడటం తన చిన్న మనస్సుపై గాఢ ప్రభావాన్ని చూపింది. ఏడు సంవత్సరాల వయస్సులో దుకాణంలో పని చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా అద్దం ముక్కతో చేతిని కోసుకున్నాడు. వైద్య సంరక్షణ అందించకపోగా తిరిగి అద్దం విరగగొట్టినందుకు ఆయనను తీవ్రంగా కొట్టారు. వినికిడి లోపం కారణంగా పాఠశాలలో పాఠాలను అనుసరించడంలో జయగోపాల్ తరచుగా కష్టపడేవారు. తరగతిలో పాఠం చెప్తున్నప్పుడు వినలేకపోవడం వల్ల ఉపాధ్యాయుల ఆగ్రహానికి గురై శిక్షలు గురై తోటి విద్యార్థులు ఎదుట అవమానాల పాలయ్యాడు. మూడనమ్మకాలను ప్రశ్నించడం వల్ల తండ్రి సంపన్నుడైనప్పిటికి జయగోపాల్ కు సరైన బట్టలు కొనివ్వకపోవడం వల్ల ఆయన తోటి విద్యార్థుల ఎదుట తీవ్ర మనస్తాపం చెందారు.
ఒకరోజు రోడ్డుపై నడుస్తున్నప్పుడు చెత్త కుండీ దగ్గర ఎగురుతున్న కాగితాన్ని చూసిన జయగోపాల్ తనకున్న అలవాటు ప్రకారం దాన్ని తీసుకుని చదివాడు. ఆ వ్యాసం పెరియార్ ఇ.వి. రామసామి వ్రాసింది. ఆ వ్యాసమే జయగోపాల్ లో లోతుగా ప్రతిధ్వనించింది. ఆయనా ఆలోచనా విధానాన్ని మార్చింది. సామాజిక నియమాలను సవాలు చేయడానికి, అంధ విశ్వాసాలను రూపుమాపడానికి, శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం పని చేయడానికి ప్రేరేపించింది.
తొలి ప్రేమ-కడ దాకా నిలిచిన ప్రేమ
16 ఏళ్ల వయస్సు నుండి జయగోపాల్ ఒక అద్భుతమైన ప్రేమను అనుభవించారు. జయగోపాల్ జీవన సహచరి శారద కూడా జయగోపాల్ కుటుంబం లాగే సాంప్రదాయాలు, మతపరమైన నియమాలను తిరస్కరించిన మహిళ. ప్రగతిశీల దృష్టికోణాన్ని కలిగి ఉండేది. వారి ప్రేమ వ్యక్తిగత స్వేచ్ఛ, ఆలోచనలను గౌరవించే ఒక భాగస్వామ్య ఆలోచనపై ఆధారపడి ఉండేది. సాంప్రదాయాల కట్టడి ఉన్న సమాజంలో జయ గోపాల్ శారద లు పెళ్లి చేసుకొందామని నిర్ణయించుకున్నారు.పూజారి, తాళి లేకుండా కేవలం దండలు మార్చుకుని ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఈ పని జయగోపాల్ తండ్రికి దారుణమైన అవమానంగా అనిపించింది. ఈ నిరసనాత్మక చర్య జయగోపాల్ వారి కుటుంబం మధ్య అంతరాయాన్ని కలిగించింది. తన తండ్రి ఈ పెళ్లిని అవమానంగా భావించి కొడుకుతో సంబంధాన్ని తెంచేశారు. అయినప్పటికీ శారద జయగోపాల్ అచంచలంగా అండగా నిలిచింది. జయగోపాల్ తో జీవితమంటే కష్టాలు, సంఘర్షణలు, అవమానాలు తోడుగా వస్తాయనే అవగాహ్నతోనే శారద ఈ మార్గాన్న ఎంచుకుంది. వారి సంబంధం పరస్పర గౌరవం, సామాన్య ఆలోచనలతో కొనసాగింది. ఈ కష్టాల మధ్య కూడా శారద జయగోపాల్ పక్కన నిలబడి అతనికి ఎనలేని మద్దతునిచ్చింది. 2021 లో శారద కోవిడ్ తో మరణించారు. ఆమెను కోల్పోవడం జయగోపాల్ కు గాఢమైన దుఃఖాన్ని కలిగించినప్పటికీ ఆమెతో కొనసాగించిన దృఢమైన లక్ష్యంతో తన ప్రయాణాన్ని కొనసాగించారు. శారదతో కలిసి పంచుకున్న ఆకాంక్షలను, కృషిని గుర్తు చేస్తూ జయగోపాల్ తన లక్ష్య సాధన పట్ల నిబద్ధత చూపారు.
డా. జయ గోపాల్ త్యాగానికి, నిబద్ధతకు, సమాజ సేవకు మిశ్రితమైన జీవితం గడిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కాలేజీలో కార్యాలయ సహాయకుడిగా పనిచేస్తూ తక్కువ జీతంతో జీవనం సాగించినప్పటికీ, ఆయన ఆర్థిక భద్రత కంటే సామాజిక, మేధో ఉద్యమాలకు ప్రాధాన్యతనిచ్చారు. జయగోపాల్ ధన సంపాదనకంటే నైతికతకు ఎక్కువ విలువ ఇచ్చిన వ్యక్తి. ఆయనకు నౌకాదళ అధికారి వంటి ఉన్నత ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లభించినప్పటికీ తిరస్కరించారు. ప్రభుత్వ విధానాలు మతపరమైన నమ్మకాలను ప్రోత్సహిస్తాయని, తాను ప్రభుత్వ వ్యవస్థలో ఉంటే సత్య నిష్ఠను పాటించలేనని అర్థం చేసుకుని ఉద్యోగ అవకాశాలే కాకుండా, భూములు, భవనాలు, ఆస్తుల రూపంలో దాతల నుంచి వచ్చిన భారీ విరాళాలను కూడా ఆయన తిరస్కరించారు. పలువురు అభిమానులు, ఆయన నాస్తికత ప్రచారాన్ని గుర్తించి ఆర్థికంగా ఆదుకోవాలని ప్రయత్నించినప్పటికీ, ఆయన వాటిని స్వీకరించలేదు. ఆయన దృష్టిలో ధనం స్వీకరించడమంటే స్వీయ ప్రయోజనాల కోసం జీవించడమే అవుతుంది. ఆస్తిని, డబ్బును నిరాకరించినప్పటికీ, ఆయన అంతర్జ్ఞానం, విజ్ఞానం, నైతిక విలువలతో సంపన్నుడయ్యారు. తన చివరి రోజువరకు ఒక చిన్న అద్దె ఇంట్లో జీవించారు, కొన్ని జతల బట్టలు మాత్రమే కలిగి ఉండే ఆయన వద్ద అపారమైన పుస్తక సంపద ఉండేది. భౌతిక ఆస్తిని వెనుక వేసుకోవడం కంటే, సత్యాన్ని నమ్ముకుని నిజాయితీగా బతకడం ఆయన జీవిత సిద్ధాంతంగా మార్చుకున్నారు. తన చివరి శ్వాస వరకు ఆర్థిక లాభాలకు దూరంగా, సామాజిక మార్పు కోసం పాటుపడిన సంఘ సంస్కర్తగా నిలిచారు.
డా. జయగోపాల్ చిన్నతనంలోనే అనేక మత గ్రంథాలను విశ్లేషించారు. పెరియార్, అంబేద్కర్, రాబర్టు గ్రీన్, ఇంగర్సాల్, బెట్రాండ్ రస్సెల్ వంటి ప్రముఖులు ఆయనకు ఆదర్శం. వారి రచనలను అధ్యయనం చేయడం ద్వారా ఆయనలో తీవ్ర ఆలోచనాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంగర్సాల్ రచనల ద్వారా అతనికి నాస్తిక భావనలో ఒక దృఢమైన అవగాహన, ఆలోచనా స్వాతంత్ర్యం అభివృద్ధి చెందింది. ఇదే సమయంలో, పెరియార్ రామసామి యొక్క సామాజిక పోరాటం, మరియు అతను ప్రతిపాదించిన సామాజిక న్యాయ సిద్ధాంతాలు, సమాజంలో వున్న అన్యాయాలకు, కులం, వర్గం, మతం, అంటరానితనాలకు వ్యతిరేకంగా నిలబడే మార్గదర్శకత్వాన్ని జయగోపాల్‌కు అందించాయి. ఈ ప్రభావాల ఆధారంగా, అతను తన యువ వయసులోనే సమాజంలో ఉన్న వివిధ రుగ్మతలను, అసమానతలను సవాలు చేయాలని, నిరసించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయం ఆయన్ను కుటుంబం నుండి దూరం చేసింది. కుటుంబంతో గడిపే సమయాన్ని లేకుండా చేసింది. సమాజంలో కొత్త ఆలోచనలు, విప్లవాత్మక దృక్కోణాలను స్వీకరించడంలో మరింత బలాన్ని అందించింది. విప్లవ భావాలు, పోరాట ప్రేరణ కారణంగా అతని తండ్రి డా. జయగోపాల్ పై హత్యా ప్రయత్నాలు చేశారు. దొంగతనం వంటి నిందలు కూడా వేశారు. అయినప్పటికీ, ఈ ప్రతికూలతలు అతని ఆలోచనా స్వేచ్ఛ, విప్లవాత్మక దృఢ సంకల్పాన్ని బంధించడంలో అసమర్థమయ్యాయి.
జయగోపాల్ చిన్నతనం నుండి మొదలైన ఆలోచనా మార్పులు, వివిధ స్ఫూర్తిదాయక వ్యక్తుల ప్రభావం, వ్యక్తిగత, సామాజిక పోరాటం ఒక విప్లవాత్మక దృక్కోణాన్ని, సమాజానికి ఒక కొత్త దిశను సూచించే మార్గదర్శకత్వాన్ని కలిగించాయి.
భారత నాస్తిక సమాజం స్థాపన
సమాజంలోని అసమానతలు, మూఢవిశ్వాసాలు, సామాజిక అన్యాయాలను సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో జయగోపాల్ 1972 ఫిబ్రవరి 13న విశాఖపట్నంలో 'భారత నాస్తిక సమాజం' (భా.నా.స.) ను స్థాపించారు. సి. పావనమూర్తి (అంబేద్కర్ మిషన్), తుమ్మల వేణుగోపాలరావు, కృష్ణాబాయి, శారద, రంగనాయకమ్మ, పొలిశెట్టి హనుమయ్య గుప్త (గాంధేయవాది), టి శ్రీరామమూర్తి, కె.యన్. చలం మున్నగు ప్రతిష్టాత్మకమైన వ్యక్తులు ఈ సంస్థకు వెన్నుదన్నుగా నిలిచారు. ప్రారంభ దశలో భా.నా.స. ప్రధానంగా స్థానిక స్థాయిలోనే కార్యకలాపాలు సాగించినప్పటికీ డా. జయగోపాల్ చొరవ, అంకితభావం, పట్టుదల, దృఢ సంకల్పం, కృషితో సంస్థ అనతి కాలంలోనే దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించి, జనాదరణ పొందింది. భా.నా.స కు ప్రముఖ కవి శ్రీశ్రీ శాశ్వత సభ్యతం తీసుకున్న మొదటి సభ్యుడు. సిద్ధాంతం, ఆచరణకు సమాన ప్రాధాన్యత ఇచ్చి నాస్తిక సిద్దాంతాలను బలంగా స్థాపించారు. ఇతర రాష్ట్రాల్లోని భావజాల ఉద్యమాలతో సోదర సంబంధాలు ఏర్పరచడంలో ఆయన చేసిన పని ఒక సమగ్ర, సంఘీభవించబడిన సంఘాన్ని సృష్టించడానికి దోహదపడడింది. డా. జయగోపాల్ నాస్తిక మరియు హేతువాద చర్చలకు సరైన దిశను నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించారు.
పరారైన బాలశివయోగి
1977 నుండి 1980 మధ్య కాలంలో విశాఖపట్నంలో రాష్ట్ర రాజకీయ నాయకులలో ఒక అవతారమూర్తిగా వెలసిన 'బాలశివయోగి' పై భా.నా.స. బహిరంగ సభలు, వివిధ చర్చా సమావేశాలు, విమర్శలు నిర్వహించింది. అందుకు విద్యార్థి సంఘాలు కూడా అండగా నిలిచాయి. ఆనాడు ఆంధ్రా యూనివర్సిటీలో యస్.ఎఫ్.ఐ. విద్యార్థి నాయకుడుగా ఉన్న నేటి సిపిఎం కేంద్ర కమిటీ నాయకులు బి.వి రాఘవులు జయగోపాల్ కు తోడుగా నిలిచి పెద్ద ఉద్యమం చేశారు. ఈ చర్యలు బాలశివయోగి గూర్చి ఏర్పడిన ప్రాచుర్యాన్ని ఒకవైపు తగ్గించడమే కాకుండా ప్రజల్లో ఆలోచనా శక్తిని పెంచాయి. ప్రజా ఉద్యమం వల్ల బాలశివయోగి విశాఖపట్నం వదిలి పరారయిన సంగతి అప్పట్లో పత్రికల్లో సంచలన వార్తలుగా ప్రతిధ్వనించాయి.
బయటపడిన బాబాల బండారం
పుట్టవర్తి సాయిబాబా మహిమలను ఎండగట్టెందుకు పూనుకున్న జయగోపాల్ ప్రేమానంద్ తో కలిసి 15 రోజుల విజ్ఞానయాత్రలో పాల్గొని 262 మంది భా.నా.స. కార్యకర్తలతో పుట్టవర్తి ప్రాంతానికి చేరుకున్నప్పుడు అక్కడ ఉన్న స్థానిక పోలీసులు వారిని అరెస్టు చేసి బుక్కపట్నం పోలీసు స్టేషనులో నిర్బంధించారు. ఇది సమాజంలో రాజకీయ వర్గాలలో నాస్తిక సిద్ధాంతాలపై ఉన్న విరోధాన్ని మరింత గాఢం చేసిన ఘటనగా నిలిచింది. 1976 లో ఎ.టి. కోవూరు గారితో కలిసి 'బాబాల బండారం' అనే అంశంపై చేసిన ప్రదర్శన విశాఖపట్నంలో భారీగా ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ ప్రదర్శన వల్ల సంబంధిత వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసారు .
ఎన్ టి ఆర్ - డా. జయగోపాల్
1985లో ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్.టి.రామారావు తిరుపతి పట్టణానికి 'వాటికన్' ప్రతిపత్తిని కల్పించాలని, చిత్తూరు జిల్లాను 'బాలాజి జిల్లా' గా పేరు మార్పు చేయాలని ప్రకటించారు. ఆ నిర్ణయం సమాజంలో లౌకిక స్ఫూర్తికి వ్యతిరేకమని, భవిష్యత్తులో ఇతర మత సముదాయాల వారికి కూడా ఇలాoటి కోరికలు కలగవచ్చనే భయాన్ని రేకెత్తించింది. ఈ అంశంపై దేశంలోని ప్రముఖ మేధావులు, సంఘ సంస్కర్తల మద్దతుతో భా.నా.స. ఆందోళనలను ముఖ్యమంత్రికి తెలియజేసి ఒత్తిడిని పెంచడంతో ఆ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవలసి వచ్చింది. 1994లో అదే ముఖ్యమంత్రి తిరిగి అధికారంలోకి వచ్చి, పాత ప్రతిపాదనను మరోసారి తెరపైకి తెచ్చినప్పుడు భా.నా.స. తమ నిరసన పత్రాన్ని 1995 ఫిబ్రవరి 6న ముఖ్యమంత్రికి సమర్పించారు. ఈ పత్రంపై సంతకం చేసిన వారిలో జార్జ్ ఫెర్నాండెజ్ (కేంద్ర మాజీ రక్షణ మంత్రి) ప్రొ. బి.జి.వర్షీస్, ప్రొ. రజనీ కొఠారి, రాజనీతి శాస్త్రవేత్త డా. నిరంజన్ ధర్, రచయిత, పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ లతో పాటు 150 మందికి పైగా ప్రముఖులు ఉన్నారు. తద్వారా ఆ నిర్ణయాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకున్నారు. ఈ ఉద్యమం డా. జయగోపాల్ చైతన్య కాంక్ష, సామాజిక బాధ్యత, లౌకికత, నాస్తికత్వంపై వారి అంకితభావాన్ని, సమాజంలో ఉన్న మతపరమైన, రాజకీయ, సాంస్కృతిక ప్రతిరోధాలను ఎదుర్కోవడంలో వారు ఎలా ముందంజ వేసారో తెలియ జేస్తాయి.
ఆర్ఎస్ఎస్ - జయగోపాల్
1999 నుంచి 2003 మధ్యకాలంలో హిందూ మిలిటెంట్ శక్తులు ఆయుధ శిక్షణ ద్వారా క్రైస్తవులు, ముస్లింలకు వ్యతిరేకంగా క్రూసేడ్‌ను విస్తృతంగా వ్యాపింపచేశాయి. ఈ తీవ్రవాద శక్తులు ఆయుధాలు, గ్రెనేడ్లు, త్రిశూలాలతో శిక్షణ ఇస్తున్నాయి, దీనిని అరికట్టాల్సిన అవసరముందని జయగోపాల్ భారత ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతి, 50 మంది పార్లమెంటు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయం లోక్‌సభ, రాజ్యసభలో చర్చకు వచ్చిన తర్వాత, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వెంటనే హిందూ మిలిటెంట్ శక్తులు తమ దుష్ట చర్యలను నిలిపివేశాయి. ఇది భారత లౌకికవాద సిద్ధాంతాల విజయంగా నిలిచింది.
నాస్తిక యుగం మాస పత్రిక
"నాస్తిక యుగం" అనే తెలుగు మాసపత్రిక ద్వారా ఆయన నాస్తికత్వం, మానవతావాదం, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేశారు. ఈ పత్రిక ద్వారా ఆయన మూఢనమ్మకాలపై, మత మూఢ విశ్వాసాలపై, దోపిడి పద్ధతులపై శాస్త్రీయంగా ఖండించేవారు. తత్వాలు, మానవ హక్కులు, లౌకికత వంటి విషయాలపై ఆయన రాసిన వ్యాసాలు ప్రజలను కొత్త ఆలోచనల వైపు నడిపించాయి. ఏజ్ ఆఫ్ ఎతీజం అనే ఆంగ్ల ద్వైవార్షిక పత్రిక ను కూడా కొన్నాళ్ళ పాటు నడిపారు. తన రచనలతో మాత్రమే కాకుండా జయ గోపాల్ ప్రత్యక్షంగా సామాజిక సేవలో నిమగ్నమయ్యే జయగోపాల్ దేశవ్యాప్తంగా సభలు నిర్వహించడం, ఉపన్యాసాలు ఇవ్వడం, ప్రమాదకరమైన మత మూఢనమ్మకాలను ఎండగట్టడం ద్వారా ప్రజలను మేలుకొల్పే ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. సామాజిక సేవలో భాగంగా జలప్రళయాలు, భూకంపాలు, తుఫాన్ల వంటి ప్రకృతి విపత్తుల్లో బాధితులను ఆదుకునేందుకు నిధుల సేకరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన గృహ హింస, మూఢనమ్మకాలు, బాణామతి బాధితులు (మంత్రగత్తె ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు) వంటి సామాజిక సమస్యలపై బలంగా స్పందించారు. గ్రామాల్లో ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో మహిళలు తప్పుడు ఆరోపణలతో మంత్రగత్తెలుగా ముద్ర వేసి హింసకు గురవుతున్న సమస్యను ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారు. బాధితులకు న్యాయపరమైన, మానసిక మద్దతును అందించి వారి జీవితం తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో ప్రార్థనల, మంత్రాల పేరుతో ప్రజలపై మానసికంగా, శారీరకంగా దాడి చేసే పలువురి మోసాలను జయగోపాల్ ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు కొన్ని అజ్ఞానపూరిత ఆచారాలను అనుసరించి ఆరోగ్య సమస్యలు లేదా ఇతర కష్టాలను పరిష్కరించడానికి మంత్రాలు, ప్రార్థనలు లేదా పూజలు చేయించుకునే వారిని చైతన్యపరిచేవారు. ఆయన అందించిన ప్రజా అవగాహన కార్యక్రమాలు ప్రజలను మోసాలకు గురి కాకుండా, ఆరోగ్య విధానాలను పాటించడానికి మార్గనిర్దేశం చేశాయి. ప్రముఖ హక్కుల ఉద్యమ నేత బాలగోపాల్ హక్కుల ఉద్యమంలోకి రాకముందే, ఉత్తరాంధ జిల్లాల్లో మానవహక్కుల కోసం నిలిచి అనేకచోట్లకు నిజనిర్ధారణకు వెళ్లి ప్రభుత్వ అధికారులతో బాధితుల తరపున పోరాడిన వ్యక్తి జయగోపాల్.
బాబ్రీమసీద్ కూల్చివేత
బాబ్రీ మసీదును కూల్చివేసేందుకు మతతత్వ శక్తులు ఒక ప్రణాళిక రూపొందించగా దీని వెనుక ఉన్న నిజాన్ని బహిర్గతం చేయడానికి డాక్టర్ జయగోపాల్, భా.నా.స అప్పటి కార్యదర్శి బి. రామకృష్ణ రాష్ట్రవ్యాప్తంగా ‘శంబూక యాత్ర’ చేపట్టారు. ఈ యాత్రలో, వారు రామ రథయాత్ర కారణంగా ఎదురుకానున్న అల్లకల్లోలాలు, దోపిడీలు, హింసా చర్యల గురించి ప్రజలకు వివరించారు. హిందూ ఇతిహాసాలలో కులవ్యవస్థను ఉల్లంఘించినందుకు శంబూకుడు రాముడిచే శిరచ్చేదానికి గురైన కథను ప్రస్తావిస్తూ, తత్వబోధ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ ప్రచారాన్ని అడ్డుకోవడానికి హిందూ మతోన్మాద శక్తులు జయగోపాల్ ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డగించి సహాయకుడిని లాక్కెళ్లి డీజిల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. డా. జయగోపాల్ తన బహిరంగ ప్రసంగాలలో హెచ్చరించినట్లుగానే, 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేయబడింది. దాంతో దేశవ్యాప్తంగా హింసాకాండ చెలరేగి, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. బాబ్రీ మసీదు విధ్వంసం జరుగుతున్న సమయంలో డాక్టర్ జయగోపాల్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ లౌకికవాద సిద్ధాంతాల కోసం ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు.
శ్మశాన నిద్ర
ఆయన చేపట్టిన మరో విశేషమైన కార్యక్రమం "శ్మశాన నిద్ర". గ్రామీణ ప్రాంతాల్లో భూతాలు, దయ్యాలు ఉన్నాయనే భయాన్ని తొలగించడానికి, ప్రజలను శ్మశానంలో రాత్రంతా ఉండేలా చేయడం ద్వారా భయాలను పోగొట్టే ఉద్యమాన్ని ప్రారంభించారు. మత మోసగాళ్లు, తాంత్రికులు ప్రజలను భయపెట్టే ప్రవర్తనకు చెక్ పెట్టే శక్తివంతమైన కార్యక్రమంగా నిలిచింది.
"వార్త"లో చెలరేగిన దుమారం
డా. జయగోపాల్ నైజం నిజంగా విశిష్టమైనది. ఏదైనా విషయాన్ని నిర్భీతిగా, సూటిగా చెప్పటం ఆయన ప్రత్యేకత. కులం, మతం విషయాలపై ఆయనకు ఉన్న పరిజ్ఞానం చాలా ఎక్కువ. ఆయన ఏ మతం గురించి మాట్లాడినా లేదా రాసినా మెతకదనం లేకుండా తన ఆలోచనలు వెల్లడించే తీరు ఆయనలో ప్రత్యేకతను చూపిస్తుంది. 1997 అక్టోబర్ 16న 'వార్త' దినపత్రికలో ‘స్త్రీల అణచివేతలో ఇతర మతాలకు తీసిపోని ఇస్లాం’ అనే వ్యాసాన్ని డా. జయగోపాల్ రాశారు. ఈ వ్యాసం ఇస్లాం గురించి ఆయనకు ఉన్న పరిజ్ఞానం ఎంతో విశాలమైనదని తెలియజేస్తుంది. ఆ వ్యాసం అప్పటి కాలంలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. చాలా మంది ముస్లిం రచయితలు ఈ వ్యాసాన్ని ఖండిస్తూ ఆ పత్రికకు లేఖలు పంపించారు. ఐదు రోజులపాటు, ‘వార్త’ పత్రికలో డా. జయగోపాల్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. కొన్ని ఆంధ్రా జిల్లాల్లో ‘జయగోపాల్ డౌన్ డౌన్’ అనే నినాదాలతో ముస్లింలు నిరసన ప్రదర్శనలు చేసారు. కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చి డా. జయగోపాల్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కొంతమంది ముస్లిం వర్గాలు ‘వార్త’ పేపర్లను, ఆఫీసు లను తగలబెట్టారు. ఆ సమయంలో ‘వార్త’ పత్రికకు సంపాదకులుగా ఉన్న ఎ.బి.కె. ప్రసాద్ కూడా ఒత్తిడికి లోనై డా. జయగోపాల్ దగ్గరికి ఒక ప్రతినిధిని పంపి, ‘రచయిత క్షమాపణ’ తెప్పించుకున్నాడు. డా. జయగోపాల్ ఆ క్షమాపణలో ముస్లింలను నొప్పించడం తన ఉద్దేశం కాదని, తన హేతుబద్ధ విమర్శ సంఘసంస్కరణాభిలాషతో మాత్రమే సమర్పించారని స్పష్టం చేసారు. ఆ వివరణలో డా. జయగోపాల్ ‘క్షమాపణ’ రాసి పెట్టమని ఎడిటర్ అడిగినా, తనది ‘వివరణ’ మాత్రమేనని, క్షమాపణ చెప్పనని చెప్పారు. కానీ దానిని ‘క్షమాపణ’ గా మార్చి, ‘ముస్లింల మనోభావాలను నొప్పించినందుకు చింతిస్తున్నాను’ అని వ్రాసి పత్రిక ప్రచురించింది. భావవ్యక్తీకరణలో ఆయన ఎప్పుడూ క్షమాపణలు చెప్పే పని చెయ్యలేదు.
సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ స్థాపన
శాస్త్రీయ ఆలోచన విధానాన్ని విద్యార్థి దశ నుండే పెంపొందించే లక్ష్యంతో భా.నా.స అనుబంధ సంస్థగా 17 ఫిబ్రవరి 2004 లో సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ను జయగోపాల్ స్థాపించారు. విద్యార్ది దశ నుండే పిల్లలకు తర్కశక్తి, పరిశోధనాత్మక ఆలోచన, విశ్లేషణాత్మక దృష్టికోణాన్ని అలవర్చుకోవడానికి శాస్త్రీయ విద్యార్థి విభాగాన్ని స్థాపించారు. మూఢనమ్మకాలను నిర్మూలించి శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించడం పాఠశాల స్థాయి నుండే జరగాలని బావించి విద్యార్థి సంస్థను నెలకొల్పాడు.
ఇంటర్నేషనల్ కమిటీ టు ప్రొటెక్ట్ ఫ్రీ థింకర్స్ ఏర్పాటు
ప్రపంచవ్యాప్తంగా ఫ్రీ థింకర్స్ (స్వేచ్ఛ ఆలోచకులు) యొక్క హక్కులను రక్షించేందుకు, మతపరమైన ఒత్తిడుల నుండి సురక్షితమైన వాతావరణాన్ని ఏర్పరచేందుకు ఇండియా, అమెరికా, కెనడా, జర్మని దేశాల నుండి ఉద్యమo ఏర్పడిన ఉద్యమ శక్తుల కలయికనే ఇంటర్నేషనల్ కమిటీ టు ప్రొటెక్ట్ ఫ్రీ థింకర్స్. ఇది జూన్ 8, 2004 లొ జయగోపాల్ ఆలోచనతో స్థాపించపడినది. భారతదేశం, ఏషియా, నాన్ ఇస్లామిక్ దేశాల్లో ఈ ఉద్యమ ప్రభావాన్ని విస్తరించేందుకు, డా. జయగోపాల్ నాయకత్వంలో స్థానిక సంఘాలు, విద్యావేత్తలు, మేధావులు, సామాజిక కార్యకర్తల సహకారంతో ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపేవారు. ఎందరో ఆలోచనాపరులను, మతానికి వ్యతిరేకం గా పోరాటం సాగించిన వాళ్ళను జైళ్ళలో నిర్భందించి తీవ్ర చిత్ర హింసలకు గురి చేస్తున్న ప్రభుత్వం నుండి మత దాడుల నుండి, ఊరి శిక్షల నుండి కాపాడారు. ఎందరినో మరణ శిక్ష నుండి సాధారణ ఖైదుకు మార్చేందుకు కృషి చేశారు. ఈ విధంగా ప్రపంచమంతటా సాంఘిక, రాజకీయ, మరియు సాంస్కృతిక రీతుల్లో స్వేచ్ఛ ఆలోచనలను ప్రోత్సహించేందుకు, అన్యాయాలకు వ్యతిరేకంగా సక్రమమైన ప్రతిచర్యలను తీసుకోవడానికి ఈ ఉద్యమం ఎంతో కృషి చేసేలా చేయడంలో డా. జయగోపాల్ పాత్ర కీలకమైంది.
ప్రతిష్టాత్మక "పెరియార్" విగ్రహ ప్రతిష్ఠ
పెరియార్ సామాజికన్యాయ ఆలోచనలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న గుర్తుగా ఆయన ప్రతిమను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో తొలిసారిగా నెలకొల్పబడింది. భారత నాస్తిక సమాజం వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ జయగోపాల్, భా.నా.స సభ్యులు, మానవతావాదులు, రేషనలిస్టు కార్యకర్తలతో కలిసి ఈ ప్రతిమను ఏర్పాటు చేయడానికి ముఖ్యపాత్ర పోషించారు. ఈ కార్యక్రమానికి ద్రవిడ కజగం అధ్యక్షుడు, పెరియార్ సిద్దాంతాలను తమిళ నాట ముందుకు తీసుకెళ్తున్న డా కె వీరమణి హాజరై 4, మార్చి 2012 న ఆవిష్కరించారు. డా. జయగోపాల్ నిరంతర శ్రమ, నిర్విరామ ఆలోచన ఫలితమే విశాఖ తీరం లొ ఉన్న పెరియార్ విగ్రహం.
ఇప్పటి ప్రముఖ ఉద్యమ నాయకులు జయగోపాల్ ఒకప్పటి శిష్యులే
ప్రస్తుతం ఉన్న అనేక మంది ప్రముఖ నాయకులు ఒకప్పుడు భా.నా.స లో భాగస్వాములుగా ఉండి డాక్టర్ జయగోపాల్ వద్ద నాస్తికత్వం, రేషనలిజం, మానవతా విలువల పాఠాలు నేర్చుకున్నవారే. ఆయన బోధనతో ప్రేరణ పొందినవారే. ఆ ప్రేరణతో వారు అస్తిత్వ బంధనాలు తెంచుకొని సైన్స్, విజ్ఞానం, సమానత్వ మార్గంలో నడవడం ప్రారంభించారు. ఆయన శిష్యులుగా ఉండి, తర్వాత కొత్త సంస్థలను ఏర్పరచుకుని స్వతంత్రంగా పనిచేసినా జయగోపాల్ దానికి నొచ్చుకోలేదు. ప్రజాసేవ చేస్తున్నారని తెలుసుకుని గర్వపడ్డారు. వారు నా వద్ద నేర్చుకున్న ఆలోచనలు ప్రజల వికాసానికి ఉపయోగ పడుతున్నాయంటే అది నా విజయమేనని భావించేవారు. ఎవరు ఎన్ని సంఘాలు పెట్టినా, ఎన్ని సంఘాల్లో పనిచేసినా ఆయనకు కావలసింది ప్రజలను చైతన్య పరచడమే.
డా. జయగోపాల్ గురించి ప్రచురించిన గ్రంధాలు వ్యాసాలు
డా. జయగోపాల్ గారు ఒక సామాజిక తిరుగుబాటుదారుడిగా 1974లో భారత హేతువాద సంఘం, మద్రాస్ ప్రచురించిన సంకలనంలో “నా పూర్వీకుల మతాన్ని ఎందుకు వదులుకున్నాను అనే వ్యాసం రచించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తెలుగు అకాడమీ ప్రచురించిన 'హేతువాదుల, నాస్తికుల, మానవతావాదుల చరిత్ర' లో ఆయన నాస్తిక చైతన్యం గురించిన ప్రస్తావన ప్రచురించబడింది. ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ అండ్ ఎథికల్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఐహెచ్ఐయూ అధ్యక్షుడు రాయ్ బ్రౌన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లెవీ ఫ్రాగెల్ డా. జయగోపాల్ కు ఆ పుస్తక తొలి ప్రతిని అందించారు.
డాక్టర్ ఫింజీయర్ హూర్త్ ఎతీజం ఇన్ ఇండియా అనే పుస్తకంలో జయగోపాల్, భా.నా.స గురించి వ్రాశారు. ఆ పుస్తకం ఇండియన్ సెక్యులర్ సొసైటీ, బాంబే (1998) ప్రచురించింది. 1972లో మద్రాసులో జరిగిన తమిళనాడు హేతువాద వేదికలో డా. జయగోపాల్ చేసిన ప్రసంగం ప్రేక్షకులను వేదికపై ఉన్న నాయకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంలో ఆయన ఎనిమిది అంశాల ప్రణాళికను ప్రముఖ శాసనసభ సభ్యులు, మేధావులు, రచయితలు, ప్రేక్షకుల ముందుకు సమర్పిoచారు. ఈ సదస్సుకు నాస్తిక ముఖ్యమంత్రి డా. ఎం. కరుణానిధి అధ్యక్షత వహించారు. ఆ వ్యాసం కరుణానిధిని అబ్బురపరిచింది. డా. జయగోపాల్ ప్రసంగం మోడరన్ రేషనలిస్ట్ పత్రికలో 1972 లో ప్రచురించబడింది.
జయగోపాల్ విశిష్ట రచనలు
మత విశ్లేషణ, నాస్తికత్వం పై రచనలు 1. క్రైస్తవం బానిసత్వం (1983) 2. సత్య సాయిబాబా రహస్యాలు (1999) 3. క్రీస్తు చారిత్రక పురుషుడా? (2008) 4. మహిమలు అతీంద్రియ శక్తులు ఒక పరిశీలన (2003), కుల వ్యవస్థపై విశ్లేషణ, సామాజిక సంస్కరణ రచనలు : కుల నిర్మూలన సాంస్కృతిక విప్లవం (1983), కులనిర్మూలన భారత రాజ్యాంగం (1998), పెరియార్ ఇ వి రామసామి జీవిత సంగ్రహం (2016), ఆధునిక విప్లవవాది పెరియార్ (2009)
మూఢనమ్మకాలపై పరిశోధనాత్మక రచనలు: భయమే బాణామతి (1991), జ్యోతిష్యం సైన్సా మూఢనమ్మకమా? (2001), జ్యోతిష శాస్త్రం నిజంగా శాస్త్రమేనా? మూఢనమ్మకమేనా?, ఆత్మ పునర్జన్మ భయాలు భ్రాంతులు మూఢనమ్మకాలు - శాస్త్రీయ పరిశీలన (2007)
చరిత్ర, శాస్త్రీయ పరిశీలన రచనలు: మహాభారత యుద్ధం చారిత్రకమా? కాల్పనికమా? (2015), విశ్వమంటే ఏమిటి? (2018), జీవం ఆవిర్భావం - పరిణామం (2021), థ మిసరీ ఆఫ్ ఇస్లాం (2004), ఈ గ్రంథం జర్మన్ మరియు పోలిష్ భాషల్లో ప్రచురించబడింది.
డా.జయగోపాల్ పొందిన ప్రసిద్ధ అవార్డులు
డా. అంబేద్కర్ చేతనా అవార్డు, మానవవాది రచనా మంచ్ (మానవవాద రచయితల అసోసియేషన్) పంజాబ్ వార్షిక వేడుకల్లో డా. జయగోపాల్ కు అవార్డును ప్రదానం చేసింది. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ మేధావులు, కవులు, రచయితలు పండుగ వాతావరణంలో పాల్గొన్నారు. "సమాజంలోని బలహీనవర్గాల ప్రయోజనాల కోసం, హేతువాదాన్ని వ్యాప్తి చేయడంలో ఆయన చేసిన విశేష కృషికిగాను ఈ అవార్డు లభించింది. జిల్లా కలెక్టర్ పవార్ జియాన్సింగ్ బాల్ ప్రొ. సురేంద్ర అజ్ఞాత, రచయిత్రి సోమా సబ్లోక్ తదితరులు డా. జయగోపాల్ ను ప్రశంసించారు.
తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన నవ్య సాహిత్య పరిషత్ అనే సాహిత్య సంస్థ సమాజ చైతన్యానికి చేసిన కృషికి గాను 2008 లో డా. జయగోపాల్ "సాహిత్య పురస్కారం" తో సత్కరించింది.
విశాఖపట్నంలోని 'జై భీమ్ కల్చరల్ ఆర్గనైజేషన్' డా. జయగోపాల్ కు కులం, అంటరానితనం, మూఢనమ్మకాలు, అనమానతల నిర్మూలనకు చేసిన కృషికి సామాజిక తిరుగుబాటుదారునిగా అభివర్ణిస్తూ ప్రశంసా పత్రంతో సత్కరించింది. విశాఖపట్నం లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంఘం డా. జయగోపాల్ ను "తెలుగు పెరియార్"గా అభివర్ణిస్తూ ఘనంగా సత్కరించారు. జర్నల్ అఫ్ బ్రేవ్ మైండ్స్ (ఒట్టావా, కెనడా) చీఫ్ ఎడిటర్ జయగోపాల్ 2005 సంవత్సరానికి గాను "పెన్ ఆఫ్ బ్రేవ్ మైండ్" అవార్డును ప్రదానం చేశారు. ఆయన రేషనలిజం, మానవతావాదం, మరియు సామాజిక సంస్కరణల్లో చేసిన విశేషమైన కృషికి గాను "ఆంధ్ర పెరియర్" అనే గౌరవ పదవిని పొందారు. తమిళనాడులో మతతత్వానికి వ్యతిరేకంగా పెరియర్ ఈ.వి. రామసామి చేసిన ఉద్యమాలను పోల్చి, జయగోపాల్ ఆంధ్రప్రదేశ్‌లో నాస్తికవాదానికి నూతన దారి చూపిన నేతగా గుర్తింపు పొందారు. జయగోపాల్ మరణానంతరం వారికి తమిళనాడు ద్రవిడ కజగం వారు జయగోపాల్ మూడనమ్మకాల నిర్మూలనకు చేసిన అవిశ్రాంత శ్రమ, అలుపెరుగని పోరాటానికి ఫలితం గా “పెరియార్ ” అవార్డును ప్రధానం చేయాగా వారి కుటుంబ సభ్యులు అందుకున్నారు.
డా. జయ గోపాల్ 2024 ఫిబ్రవరి 7న, 80 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఆయన మానవతావాద సిద్ధాంతాలను పాటిస్తూ, తన మృతదేహాన్ని వైద్య పరిశోధన కోసం దానం చేశారు. తన కళ్లు కంటి ఆసుపత్రికి అందజేసి, ఇద్దరికి చూపు ఇవ్వగలిగే సేవ చేశాడు. ఆయన చివరి క్షణం వరకూ తన శరీరం కూడా సమాజ హితార్థమే అని చాటిచెప్పారు. జయగోపాల్ జీవితం మనందరికీ ప్రేరణదాయకం. ఆయన చూపిన విజ్ఞానం, త్యాగం, ధైర్యం, మానవతా విలువలే నిజమైన మార్గదర్శకాలు. తన జీవిత కాలంలో ఆయన అమెరికా విశ్వవిద్యాలయం నుండి పొందిన "డాక్టర్" అనే బిరుదును గాని ఇంటి పేరును గాని వాడలేదు. కోట్ల విలువైన సంపదను వదులుకుని అతి సామాన్య జీవితం గడిపారు. కానీ ఆయన సేవలను గుర్తించి, ఆయన పేరుకు ముందు "డాక్టర్" బిరుదు ఉంచడం ఆయనకు మనం అర్పించే గౌరవ సూచకం. డాక్టర్ జయ గోపాల్ కథ మనందరికీ ఆదర్శం. కేవలం 6 వ తరగతి వరకు మాత్రమే చదివిన ఈ వ్యక్తి, ప్రపంచాన్ని ఉప్పొంగించే విధంగా విజ్ఞానాన్ని, సైన్స్‌ను, మానవతా విలువలను ప్రజలకు చేరువ చేసాడు. ఆలోచనలలోని విశాలత్వం, ఆత్మవిశ్వాసం, విజ్ఞానం, ప్రజలను విజ్ఞానవంతుల్ని చేయాలనే ఆలోచనా ఆయన్ని ఎన్నో పుస్తకాలు రాయించాయి. ఆయనకి ఇచ్చిన "హానరరీ డాక్టరేట్" అనేక పురస్కారాలు ఆయన సమాజానికి ఇచ్చిన సేవలకు, ప్రజల్ని చైతన్య వంతులని చేయాలనే దిశగా చేసిన అలుపెరుగని పోరాటాలకు నిదర్శనం. తెలుగు, ఇంగ్లీషు, తమిళం, హిందీ భాషల్లో మాట్లాడడం ఆయనకు ఉన్న భాషా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ భాషల్లో రాసిన పుస్తకాలు, వ్యాసాలు ఇతర రచనలు ప్రజలలో విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. అంధవిశ్వాసాలను ధిక్కరించి, సత్యాన్ని, విజ్ఞానాన్ని అనుసరించమని ఆయన ఇచ్చిన సందేశం ఎప్పటికీ సంబంధితమే.
మన సమాజం ఇంకా మూఢనమ్మకాల అంధకారంలో చిక్కుకుని ఉన్నప్పుడు డాక్టర్ జయ గోపాల్ చూపించిన మార్గం మనకు మార్గదర్శకంగా నిలుస్తుంది. మతాచారాల పేరుతో జరుగుతున్న అన్యాయం, భయాలు, పిరికితనం మనలను అంగుళం ముందుకు నడిపించవు. జయగోపాల్ అన్నట్లు సైన్సు, తర్కం, విజ్ఞానం ఈ మూడు సిద్ధాంతాలే సమాజాన్ని నిజమైన పురోగమనానికి నడిపించగలవు. ఆయన చెప్పిన మరో విషయం భయమే అజ్ఞానానికి మూలం. మన జీవితాలను భయం కమ్మివేయకూడదు. దెయ్యాలు, శాపాలు, బాణామతులు వంటి మూఢనమ్మకాలు బలహీనుల నమ్మకాలు మాత్రమే. వాటిని జయించాలంటే మన ధైర్యం, విజ్ఞాన పాఠాలే ఆయుధాలు కావాలి.
డాక్టర్ జయ గోపాల్ చేసిన త్యాగం, జీవిత పోరాటం విస్మరించలేనిది. ఆయన ప్రతి కార్యకలాపం మానవ వికాసానికి అంకితమైనదే. సమాజంలోని బాధితులకు మానసిక బలాన్ని అందిస్తూ, ఆర్థిక సహాయం చేస్తూ ఆయన జీవితాన్ని సామాజిక సేవకే అంకితం చేశారు. ఆయన జీవితం అజ్ఞానంపై విజ్ఞాన విజయం. డా జయ గోపాల్ అన్నట్లు మనం ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా హింసించబడుతున్న లక్షలాది మంది ప్రజలకు ఆత్మగౌరవంతో జీవించే హక్కు కల్పించేందుకు వారిని చేరువ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికీ విజ్ఞానం అందుబాటులోకి రావాలి. ప్రతి గ్రామం, ప్రతి పల్లె, ప్రతి చిన్న పట్టణం అందులోని ప్రజలందరూ అంధ విశ్వాసాలను వీడి సైన్సు, తర్కబద్ధ ఆలోచనలను స్వీకరించాలని ఆయన జీవితాంతం కోరుతూనే ఉన్నారు. ఇది ఆయన మన మీద పెట్టిన చాలా పెద్ద బాధ్యత. ఆయనను నిజంగా గౌరవించాలంటే, మనం తను చూపిన బాటలో నడవాలి. విజ్ఞానం, మానవతా విలువలను బలంగా నమ్మాలి. అంధ విశ్వాసాలను నిలదీయాలి. విజ్ఞానానికి, సైన్సుకు ప్రాముఖ్యతనివ్వాలి. ప్రతి ఒక్కరు ప్రశ్నించే ధైర్యాన్ని పెంపొందించుకోవాలి. ప్రతి ప్రశ్న ఒక మార్పు తీసుకురాగల శక్తిని కలిగి ఉంటుంది. మత, ఆధ్యాత్మిక శక్తులు, మోసపూరిత వ్యవస్థల తత్వాలపై పోరాడేందుకు మనలాంటి వారిందరినీ ఒకచోట చేర్చుకోవాలి. భారత నాస్తిక సమాజానికి, సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ కు ప్రజల సహాయ సహకారాలు, నైతిక కట్టుబాటు అవసరం. ఆయన శరీరం లేకపోయినా, ఆలోచనలు అమరం.
ఆయన చూపిన మార్గం మన సమాజానికి చిరస్మరణీయం.
ఆయన స్ఫూర్తి మనందరినీ ఉత్తమ పౌరులుగా, విజ్ఞానవంతులుగా మారుస్తుంది. జయగోపాల్ జీవం ముగిసినా, ఆయన ఆలోచనలకు మరణం లేదు. సత్యం, విజ్ఞానం వైపుకు ప్రజలను నడిపించడమే ఆయనకు మనం ఇవ్వగల నిజమైన గౌరవం.
(ఫిబ్రవరి 9 న విశాఖపట్నంలో జయగోపాల్ మొదటి వర్థంతి సందర్భంగా)
రచన :
....జె స్వప్న,
సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box