ఈరోజు నా 67 వ పుట్టినరోజు.
జ్ఞాపకాలు నెమరు వేసుకునే సందర్భం:
——————-
ముద్రల కాలం:
——————-
చిన్నప్పుడు చందమామ లో చదివిన పరోపకారి పాపన్న కథలు జీవితం పై చెరగని ముద్ర వేసాయి. ఇతరుల అవసరానికి అప్పు చేసైనా వారికి సహాయం చేసే అలవాటు ఆరున్నర దశాబ్దాలుగా ఇంకా వెంటాడుతూనే వున్నది.డబ్బు కోసం కష్ట పడాలనే ఆలోచన కన్న ఎంతో ముందే సమాజం గురించి ఆలోచించడం పని చేయడం మొదలు పెట్టాను. (ముందు నా ఫెయిల్యూర్ గురించి చెప్పి తర్వాత రాజకీయాలు ఇతర విషయాలు చెప్తాను).
———————————————-
ఆర్ధిక పరిస్థితి-ఫెయిల్యూర్ స్టోరీ:
————————————————
డబ్బు కోసం వారసత్వంగా వచ్చే ఆస్తులు,ఆదాయం పైన ఆధారపడకూడదనేది నా జీవిత కాల నిర్ణయం.ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని నేను టచ్ చేయలేదు.
1979-84 సెప్టెంబర్ వరకు నేను పని చేసిన UCCRI-ML పార్టీ రూ॥ నాలుగు వందలు నెలకు ఇచ్చేది. పార్టీని వదిలిన తర్వాత 1984-86 మధ్య ఇంట్లో ఉన్న అందరమూ పేపర్ కవర్ లు చేసి వాటిని నేనే స్వయంగా అమ్మి డబ్బులు సంపాదించడం నేర్చుకున్నాను.ఇదే నా తొలి వ్యాపారం,చిన్న సంపాదన. చదువు పూర్తయ్యాక స్వతంత్రంగా జీవించాలను కున్నా 1986 నుండి ఎన్ని వ్యాపారాలు చేసినా నష్టాలు లేకుండా ఏవీ సాగలేదు. విప్లవ కవి జ్వాలాముఖి ఇంట్లో ఆయన మూడో కుమారుడు వాసు తో కలిసి ప్రారంభించిన అభిరుచి ఫుడ్స్ కల్తీ నూనెలు వాడే వారి తో పోటీపడలేక మూసివేయడం జరిగింది(కల్తీ నూనె వాడే “లఖాని”గత 40 ఏళ్లుగా బిజినెస్ ను ఎన్నో రెట్లు పెంచారు).
ఒకపక్క సమాజం కోసం సమయం ఇస్తూ (ఆదివాసీ లలో వయోజన విద్య)అదే సమయం లో న్యాయవాది గా మరోపక్క రాజకీయాలు చేసుకుంటూ నిజాయితీగా వ్యాపారాలు చేయడం రెండు పడవల మీద ప్రయాణం చేయడం వంటివి.ఫోకస్ చేయలేక వరుసగా వ్యాపారాల్లో నష్టాలు వచ్చాయి.
(కొందరికే సాధ్యమయ్యే మంచి పేరు,ఇంటి నిండా అనేక అంశాల పైన వేలాది పుస్తకాలు,దేశ విదేశాలలో లక్షలాది అభిమానులు మిగలడం నా మనసుకు తృప్తినిచ్చే అంశం)
నేను సంపాదించిన ప్రతి రూపాయి ఇతరులకు లాభం చేకూరడం ద్వారా రావాలని నేను ఆశిస్తున్నాను.అందుకే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మరియు అవగాహన కల్పించడానికి ఈ నెల లో (జనవరి 2025)NUHUB Pvt.Ltd.మొదలు పెట్టాను.
—————————————
నా రాజకీయ అనుభవాలు -1(1968-84)
—————————————
“విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు “నినాదం తో మెుదలైంది నా రాజకీయ ఉద్యమాల ప్రస్థానం.తొలిదశ తెలంగాణ ఉద్యమం,ఆనాటి విద్యార్థి ఉద్యమ నాయకుడు తిప్పన సిద్ధులు రోమాలు నిక్క పొడిచే ఉపన్యాసం తెలంగాణ కష్టాలను తెలియజేసింది 369 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు,ఉద్యమం అణచివేత తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మరిచి పోకుండా చేసింది.రాజకీయ పార్టీల, నాయకుల రంగులను తెలుసుకునేలా చేసిన చరిత్ర.ములుగు అడవుల్లో విప్లవోద్యమాన్ని దగ్గరగా చూసిన అనుభవం,నక్సలైట్ల పోలీసుల ఘర్షణలతో అట్టుడుకుతున్న కాలం.బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమం లో వేలాది ప్రజల ఊచకోత వార్తలు,నెత్తిపైన పెద్ద మోత తో వెళ్ళే విమానాలు అంతర్జాతీయ రాజకీయాల పై ఆసక్తి పెంచాయి.వరంగల్ లో ఏవివి కాలేజీ లో విద్యాభ్యాసం,చుట్టూ సినిమా హాళ్ళ ల్లో వచ్చే కొత్త సినిమాలు తొలి రోజే చూడటానికి కాలేజీ ఎగ్గొట్టిన లేదా అల్లరి చేసి “గెట్ అవుట్”అని లెక్షరర్ చే గెంటి వేయించబడటం,
ఇంటి పక్కన ఉన్న మిత్రుడు దివంగత రాజమల్లు డబ్బా దుకాణంలోని డిటెక్టివ్ ఇతర నవలలు సాహిత్యం మీద ఆసక్తి కలిగించాయి.విప్లవ రచయిత వరవరరావు అరెస్ట్ అయిన తరువాత నేను సికేయం కాలేజి లో డిగ్రీ చదివాను.ఆయన విడుదల కోసం కాలేజీ డే రోజున ముఖ్య అతిథి గా వచ్చిన కలెక్టర్ బాలరాజు తో పెద్ద గొడవ జరిగింది.లాఠీ ఛార్జ్,గాల్లో ఫైరింగ్ జరిగింది.ఈ ఘటనతో ప్రిన్సిపాల్ గా ఉన్న అంజయ్య ను తప్పించి తెలంగాణ వాది ప్రొఫెసర్ జయశంకర్ గారిని 1975 లో నియమించారు. ఈ పరిచయం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆయనకు నన్ను సన్నిహితున్ని చేసింది.
ఎమర్జెన్సీ కాలంలో జరిగిన దురాగతాలు,గిరాయిపల్లి లో నలుగురు విద్యార్థుల బూటకపు ఎన్కౌంటర్ ,కేరళ లో పోలీసులు చేసిన విద్యార్థి రాజన్ హత్య,ఇందిరాగాంధీ నియంతృత్వ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం పాతర తదితర అంశాల ప్రభావం నాపై పడింది.ఎమర్జెన్సీ సమయంలో ఒక మిత్రుడు నా గదిలో దాచిన గోనె సంచిలో ని శ్రీ శ్రీ,వరవరరావు ల , దిగంబర కవుల,ఇతర విరసం కవుల విప్లవ సాహిత్యం విప్లవోద్యమాల పట్ల కలిగిన ఆకర్షణ RSU-RYL,రైతు కూలీ సంఘం సభలకు హాజరయ్యేలా చేసింది.హైస్కూలు క్లాస్ మేట్ వేణుగోపాల్ ఆయన అన్న గారు డాక్టర్ హన్మంతరావు గతంలో నిర్వహించిన అరుణ తార లిఖిత మాస పత్రిక భాధ్యత నేను తీసుకున్న.వరంగల్ వాసవి గ్రంథాలయంలో ఒక నెల రోజుల పాటు వుంచి తరువాత వరవరరావు గారి ఇంట్లో ఉంచేది.అరుణతార పేరును విరసం అధికార పత్రిక గా పెట్టాలని అప్పటి విరసం కన్వీనర్ కేవి రమణారెడ్డి గారు నన్నడిగారు.1978 లో సృజన లో మొదటి కథ అచ్చయ్యింది.వరవరరావు గారు నన్ను శివసాగర్ కు పరిచయం చేసారు.అదే సమయంలో “మృణాళిని”పెన్ నేమ్ తో పద్మ గారు పరిచయమయ్యారు .ఆమె ద్వారా డివి రచనలు నాకు అందుబాటులోకి వచ్చాయి.ఏడాది పాటు సమావేశాలు హాజరవుతూనే డివి సాహిత్యం తో బాటుగా మావో,లెనిన్,కార్ల్ మార్క్స్ రచనలు చదివాను.పీపుల్స్ వార్(అప్పటికి ఇంకా సిఓసి పేరుతోనే ఉంది)సిద్ధాంతానికి ఆచరణ కు మధ్య తేడా గమనించాను. శివసాగర్( పీపుల్స్ వార్ నేత కేజీ సత్యమూర్తి)తో ఎన్ని సార్లు మాట్లాడినా కూడా నాకు సరైన సమాధానం రాలేదు.అనుకోకుండా పీస్ బుక్ సెంటర్ లో (కాచిగూడ లింగంపల్లి) ఒక రోజు కొండపల్లి సీతారామయ్య గారు కలిశారు.నా సందేహాల నివృత్తి కోసంఆయనతో కొద్దిసేపు మాట్లాడాను.నేను ఆయన చెప్పిన సమాధానం తో సంతృప్తి చెందలేదు.(1978 లో కొండపల్లి కండీషన్ బెయిల్ పై బయట ఉన్న సందర్భం).ప్రజాతంత్ర విద్యార్థి సంఘం (DSO)ఉద్యమం,వరంగల్ జిల్లా OPDR ,విప్లవోద్యమ బాధ్యతలు UCCRI (M-L)చేపట్టేలా చేసింది.కాకతీయ యూనివర్సిటీ”లా కాలేజీలోఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ లో ఎం.ఏ ఫిలాసఫీ లో సీట్లు సాధించినా విద్యార్థి ఉద్యమ అవసరాల దృష్ట్యా OU లో చదివాలని పార్టీ నిర్ణయించింది.కాలేజీ కి వెళ్లినా చదువు లక్ష్యం కాదు.నాలుగు సెమిస్టర్లలో 14 క్లాస్ లు మాత్రమే హాజరై డిస్టింక్షన్ తో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది.తెలుగు లో రాయడం,మార్క్సిజం పై అవగాహన ఉండటం వల్ల ఇది సాధ్యమైంది.
విప్లవ నేత కా॥దేవులపల్లి వెంకటేశ్వర రావు(డివి రావు) కు దగ్గరగా ఉండడం వలన ఆయన నాయకత్వంలోనే సాగిన తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఎన్నో విషయాలను తెలుసుకునే అవకాశం కలిగింది.డి వి గారు 67 ఆడియో క్యాసెట్ ల లో వివరించిన తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర ను 1983-84 లో అక్షరబద్ధం చేసే అవకాశం కలిగింది.ఆ చరిత్ర మెుదటి భాగం 1948 (పోలీస్ యాక్షన్) వరకు అచ్చయ్యింది.(ఎంతో ముఖ్య మైన రెండవ భాగాన్ని ఆ పార్టీ నాయకులు 40 ఏళ్ల తర్వాత కూడా ముద్రించడం లేదు).డివి గారి ఆదేశాల ప్రకారం “వడిసెల” సాహిత్య మాస పత్రిక సంపాదకునిగా భాధ్యత ఆనందాన్ని కలిగించింది.1974 జూలై 12 రాత్రి డివి హటాత్తుగా గుండె పోటు తో మరణించారు.తరువాత ఆయన సంస్మరణ సభలు జరిగాయి.17 జిల్లా ల్లో (అప్పటి ఆంధ్రప్రదేశ్ లోని)నాకు ప్రముఖ వక్త గా మాట్లాడే అవకాశం వచ్చింది. వడిసెల 3 వ సంచిక ను డివి సంస్మరణ సంచికగా ప్రచురించి ఆ తర్వాత పార్టీ నాయకుల వ్యవహార శైలి నచ్చక నేను 1984 సెప్టెంబర్ లో ఆ పార్టీ నుండి తప్పుకున్నాను.
——————————
న్యాయవాదిగా పదేళ్లు-తెలంగాణ మలిదశ ఉద్యమం,కేసిఆర్ పాలన..గురించి మరోసారి..
——————————
(From Face Book wall)
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box