గొప్ప సాంస్కృతిక నేపథ్యం ఉన్న మిత్ అయ్యవార్లు పై మంచి పరిశోధక గ్రంధం

 


*గొప్ప సాంస్కృతిక నేపథ్యం ఉన్న "మిత్ అయ్యవార్లు" పై మంచి పరిశోధక గ్రంధం*

_______________________________________________________________________

        కొన్ని సంస్థలు లేదా కార్యాలయాలు ఆయా సంస్థల అధినేతల వల్ల వాటికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సహజంగానే గొప్ప సంస్థగా ఉన్నప్పటికీ వాటిని నడిపించే అధికారి నిస్వార్థంగా చిత్తశుద్ధితో పనిచేస్తే వాటి కీర్తి మరింత ఇనుమడిస్తుంది. దీనికి ఉదాహరణ, తెలంగాణా భాషా, సాంస్కృతిక శాఖ. కల్చర్ శాఖ డైరెక్టర్ గా ఉన్న మామిడి హరికృష్ణ, ఈ సాంస్కృతిక శాఖను ఒక విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దారు. కళా సాంస్కృతిక రంగాల్లో ప్రధానమైన సినిమా, చిత్ర కల, జానపద కళలు, ఫోటో, చిత్ర లేఖనం ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా ప్రతీ కళ కూ ప్రత్యేక స్థానాన్ని రవీంద్ర భారతి వేదికగా కల్పించారు. ఇక, యువ చిత్ర దర్శకులను తీర్చి దిద్దడంలో ఈ శాఖ చేస్తున్న కృషి అమోఘం. హైదరాబాద్ కేంద్రంగా కాకుండా, రాష్ట్రంలోని ఏ నగరంలో ప్రధాన ఈవెంట్ జరిగినా అక్కడ మన సాంస్కృతిక ప్రదర్శనలు ఉండాల్సిందే. కేవలం, తెలంగాణా మాత్రమే కాదు మొత్తం భారత దేశంలో తెలంగాణ సంస్కృతీ, కళలకు ప్రాచుర్యం లభించడంతో మామిడి హరికృష్ణ పాత్ర ఎంతో ఉంది. ఇక, తీవ్ర ఆర్థిక వనరుల  కొరత ఉన్నా కనీసం ప్రతీ నెలకొక్క కొత్త పుస్తకం సాంసృతిక శాఖ తరపున ముద్రిస్తుంటారు.



    దీనిలో భాగంగా డా. ఆవాల వీణ పరిశోధక గ్రంథమైన 'మిత అయ్యల్ వార్లు భాషా సాహిత్య సాంస్కృతికాంశాలు- సమగ్ర పరిశీలన' ను "మిత అయ్యవార్లు - భాషా, సాహిత్యం,సామాజిక సంస్కృతీ" అనే పేరుతొ సాంస్కృతిక శాఖ అందమైన కవర్ పేజీలో ముద్రించింది. ఈ మిత్తుల అయ్యవార్ల ప్రదర్శనలను మా చిన్నప్పుడు చాలా చూసేవాళ్ళం.

      వైష్ణవ భక్తి ప్రచారంలో పన్నిద్దరు ఆళ్వారులుగా 12 మంది ఆళ్వారులు ప్రసిద్ధి గాంచారు. ఈ పన్నెండుమంది ఆళ్వారుల్లో ఏడవ ఆళ్వార్ 'తిరుప్పాణాళ్వారు' సంతతి వారే ఈ మిత అయ్యవార్లుగా (స్థానికంగా మిత్తుల అయ్యవార్లు అని పిలుస్తారు ) చెప్పుకుంటారు. షెడ్యూల్డు కులాలలో ఉన్న 61 ఉపకులాల్లో ఒకటి మిత అయ్యవార్లు.  కొన్ని ప్రాంతాల్లో వీరిని మాల దాసరిలు, మిత అయ్యవార్లు వేరువేరుగా గుర్తించినా మిత అయ్యవార్ల దగ్గర కడ్డీ తంత్రీ వాయిద్యం ఉంటుంది. ఈ మిత్తుల అయ్యవార్లు ఎక్కువగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో ప్రధానంగా కనిపిస్తారు. ప్రస్తుతం వీరు కనుమరుగవుతున్నారు. తెలంగాణాలో ప్రతి కులానికి ఒక ఆశ్రిత కులం తప్పకుండా ఉంటుంది. ఆ ఆశ్రిత కులానికి ఓకే ప్రత్యేకమైన కళారూపం, ప్రతీ కళా రూపానికి ఒక ప్రత్యేకమైన సంస్కృతి, చరిత్ర, వారసత్వం ఉంటాయి. ఇలాంటి విశిష్ట జీవన సాంస్కృతిక  విలువలు గల ఎన్నో ఆశ్రిత కులాలలో ఒకటైన, మిత్ అయ్యవార్ల జీవన చరిత్ర లాంటి గ్రంధాలు మరెన్నో రావాల్సి ఉంది. ఇప్పటి తరానికి తెలియాల్సి ఉంది. ఈ విషయంలో  "మిత అయ్యవార్లు - భాషా, సాహిత్యం,సామాజిక సంస్కృతీ" అనే పరిశోధక గ్రంధం ప్రచురించడం పట్ల భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ కు అభినందనలు. ఈ గొప్ప పుస్తకాన్ని నాకు బహుకరించడం పట్ల ధన్యవాదాలు.

*******************************************************************************************************

    తేదీ. 22 .01 .2025

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు