అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ హన్మకొండ కాకతీయ జూలాజికల్ పార్క్ లోని అడవి జంతువులను దత్తత తీసుకున్నారు.
నీల్గాయ్, సాంబార్ డీర్, చౌసింగా, అడవి దున్నలను ఒక్కోటి చొప్పున దత్తత తీసుకున్నారు. ఈ మేరకు కాకతీయ జూ పార్క్ అసిస్టెంట్ క్యురేటర్ మయూరి హన్మకొండ రాంనగర్ లోని మంత్రి కొండా సురేఖ గారి నివాసానికి వచ్చి వన్యప్రాణల దత్తత ప్రక్రియను పూర్తి చేశారు.
సంవత్సర కాలానికి ఒక్కో వన్యప్రాణికి ఆహారం, సంరక్షణ కోసం రూ. 50 వేల చొప్పున మొత్తం నాలుగు వన్యప్రాణులకు కలిపి రూ. 2 లక్షలను మంత్రి సురేఖ ఆన్లైన్ లో చెల్లించారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, జూలలోని వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి పక్షి ప్రేమికులు, జంతు ప్రేమికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వ్యక్తులు, సంస్థలు, సంఘాలు వారి వారి సామర్థ్యాన్ని బట్టి చిన్న చిన్న పక్షులు, తాబేళ్ళు మొదలు పులుల వరకు మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం చొప్పున దత్తత తీసుకుని, వాటి సంరక్షణ బాధ్యతలను చేపట్టవచ్చిన మంత్రి సురేఖ తెలిపారు. జంతు ప్రేమికులు అటవీ అధికారులను సంప్రదించి వన్యప్రాణుల దత్తతకు సంబంధించిన మార్గదర్శకాలను అనుసరించి, వారి వారి ఇష్టానుసారం జంతువులను దత్తత తీసుకునే వెసులు బాటును అటవీశాఖ కల్పిస్తున్నదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. వన్యప్రాణుల దత్తత కోసం చేసిన చెల్లింపులకు ఆదాయ పన్ను మినహాయింపు, ఇతర ప్రయోజనాల పై ప్రజలకు అవగాహన కల్పించాలని అటవీ అధికారులకు మంత్రి సురేఖ సూచించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box