బి.సి సైకిల్ యాత్రకు సంఘీభావం



 బి.సి సైకిల్ యాత్రకు సంఘీభావం

ఐక్య ఉద్యమాలతోనే అధికారం సుసాధ్యం

బి.సి ఇంటలెక్చువల్ ఫోరం వరంగల్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్  డాక్టర్ కొంగ వీరస్వామి

ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ 


    తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్ల సాధనతో పాటు కామారెడ్డి డిక్లరేషన్ అమలు డిమాండ్ చేస్తూ గత 13 రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న బి.సి ఆజాధి సైకిల్ యాత్రకు వివిధ బి.సి సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. జనవరి 19 న జనగామ జిల్లా ఖిలాశపూర్ లో ప్రారంభమైన బి.సి సైకిల్ యాత్ర శుక్రవారం హనుమకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్ కు చేరుకున్న సందర్భంగా బి.సి ఇంటలెక్చువల్ ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ కొంగ వీరస్వామి, ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ లు సంఘీభావం తెలిపి మాట్లాడారు. బి.సి ఉద్యమకారులు బత్తుల సిద్దేశ్వర్లు, చాపర్తి కుమార్ ల బృందం చేస్తున్న సైకిల్ యాత్ర చాలా గొప్పదని, చట్టసభల్లో బి.సి రిజర్వేషన్ల కోసం గత పార్లమెంటు ఎన్నికల ముందు 400 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన వీరు స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కోసం ఆమరణ నిరహార దీక్ష చేసినారని, బి.సి. ఉద్యమానికి ఊపిరిలాగ నిలుస్తున్న  నాయకులకు మనం మద్దతుగా నిలవాల్సిన బాధ్యత వుందని అన్నారు. బి.సి ల సమస్య దేశ వ్యాప్త సమస్యని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఐక్య ఉద్యమాలు చేస్తూనే దేశ వ్యాప్తంగా జన గణనలో కుల గణన కోసం పోరు చేయాలని పిలుపునిచ్చారు. 

    సైకిల్ యాత్రకు సారథ్యం వహిస్తున్న బత్తుల సిద్ధేశ్వర్లు, ఛాపర్తి కుమార్ గాడ్గే మాట్లాడుతూ పల్లెను గెలిచి ఢిల్లీ మెడలు వంచాలని, స్థానిక సంస్థల్లో బి.సి లు ఎక్కువ సీట్లు గెలిచేందుకు హనుమకొండ జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 2 న జరుగు బి.సి రాజకీయ యుద్ధ బేరిలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి.సి ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర సహాయ కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేష్ మాట్లాడుతూ బి.సి లవి కాని ఎన్నో పోరాటాల్లో బి.సి లు ప్రాణ త్యాగాలు చేశారని, బి.సి ల కోసం బి.సి లు ఉద్యమం చేయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. సబ్బండ వర్గాల ఐక్యంగా ముందుకు సాగితే మన వాటా మనం సాధించవచ్చని అన్నారు. 

     ఈ కార్యక్రమంలో కర్పూరి ఠాకూర్ ఫౌండేషన్ నాయకులు గొల్లపల్లి వీరస్వామి, పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అద్యక్షులు డాక్టర్ చంద మల్లయ్య, వివిధ సంఘాల నాయకులు సిలువేరు శంకర్, దిడ్డి ధనలక్ష్మి, తాటికొండ సద్గుణ, కొంగ నరహరి, నవ్య, సతీష్, శోభారాణి గౌడ్, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు