సమయం లేదు మిత్రమా...

 


*_సమయం లేదు... మిత్రమా..!_*


(_సుధామూర్తి రచనకు_

_నా అనువాద ప్రయత్నం.._)


ఈ రోజు 

అలా మొదలైందో లేదో..

అప్పుడే సాయంత్రం 

ఆరై పోయింది..


సోమవారం..గడిచింది..

తర్వాత మంగళవారమే అనుకునేటప్పటికి 

శుక్రవారం 

వచ్చేసిందే..!


కళ్ళు మూసి తెరిచేలోగా

నెల గడచిపోయింది..


అరె..జనవరి..ఫిబ్రవరి..

ఇలా నెలలు దాటి 

డిసెంబర్ 

వచ్చేసిందా..?


జీవితంలో అప్పుడే యాభై..అరవై సంవత్సరాలు గడచిపోయాయి..!


మనల్ని కన్న తల్లిదండ్రులు..

సహాధ్యాయులు కొందరు..

చిన్ననాటి స్నేహితులు..

తెలిసిన అనేక మంది

కాలం చేసేశారు..


ఇప్పుడు వెనక్కి 

వెళ్ళేది అసాధ్యం..!


సరే..జరిగిందేదో జరిగిపోయింది..


మిగిలిన కాలాన్ని..

జీవితాన్ని 

ఆనందంగా గడిపే 

ప్రయత్నం చెయ్యాలి..


నచ్చిన పనులు చేద్దాం..


కాస్త సోగ్గా 

తయారు కూడా అవుదాం..తప్పేంటి..


మనం నవ్వుతూ ఉందాం..

తోటి వారిని 

సంతోష పెడదాం..

అలసిన హృదయాలకు 

నవ్వుల పూతమందు రాద్దాం..


శరీరం కొంతమేర సహకరించదేమో..


అయినా..


జీవితంలో 

మిగిలిన సమయాన్ని 

ఆనందంగా గడిపేందుకు ప్రయత్నిద్దాం..


అన్నట్టు..

అన్నిటికంటే ముఖ్యంగా..


జీవితంలో తర్వాత అనే పదాన్ని శాశ్వతంగా తొలగిద్దాం..


*_తర్వాత చూద్దాం.._*

*_తర్వాత చేద్దాం.._*

*_తర్వాత ఆలోచిద్దాం.._*


ఇలాంటి పదాలకు 

తావు ఇవ్వొద్దు..

వాయిదా పద్దతుంది దేనికైనా..

ఇదే మొదటి నుంచి 

మన ఫిలాసఫీ..

దానికి స్వస్తి పలుకుదాం..

ఎందుకంటే ఇక మన దగ్గర అంత సమయం లేదు..!


చూడండి..

తర్వాత ఎప్పుడూ 

మనది కాదు..

ఒక్కోసారి రాదు కూడా..


మనకి తెలియదా..

తర్వాత తాగాలనుకంటే

కాఫీ చల్లబడిపోతుంది..


తర్వాత అనేది వచ్చేపాటికి

మన ప్రాధాన్యతలు మారిపోవచ్చు..


మన రూపం..

శరీర తత్వం..

మారిపోతాయి..

ఓపిక..శక్తి తగ్గిపోతాయి..!


పగలూ..రాత్రులూ గడచిపోతాయి..

తేదీలు మారిపోతాయి..

క్యాలండర్ తిరిగిపోతుంది..

బ్రతుకే అంతం అయిపోతుంది..!!


అందుకే..అందుకే..

దేన్నీ కాలానికి వదలొద్దు..

వదిలితే..

చక్కటి అనుభూతులు..

మరిన్ని అనుభవాలు..

మంచి స్నేహితులు..

చక్కటి కుటుంబం..

అందమైన పరిసరాలు..

బోలెడన్ని రుచులు..

ఇంకా ఎన్నో..ఎన్నెన్నో

మిస్ అయిపోవచ్చు..


అందుకే మేలుకో..

తెలివి తెచ్చుకో..

ఈరోజే నీది..

ఈ క్షణం మాత్రమే  

నీకు అందుబాటులో

ఉంటుంది..


వాయిదాలు వేసే 

వయసు కాదు..

అయినా వాయిదాలతో

ఫాయిదా లేదు..


ఇదే ఇదే వాస్తవం..


శరీరం సహకరించకున్నా..


నచ్చిన ప్రదేశాలు 

చూసి వద్దాం..


ఇన్నాళ్లు ఏవైతే మిస్సయ్యాము 

అని బాధ పడ్డామో 

అవన్నీ చేసేద్దాం..


జీవితం మొదలే చిన్నది..

రోజు గడుస్తున్న కొద్దీ

ఇంకా ఇంకా చిన్నది..


చేదుగా అనిపించినా..

కరకుగా వినిపించినా 

ఇది నిజం..!


(స్వేచ్ఛానువాదం..)


*_సురేష్..9948546286_*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు