భారతీయ జర్నలిజం ధృవతార మానికొండ చలపతిరావు పుస్తకావిష్కణ..
భారతీయ జర్నలిజంలో ధృవతారగా వెలిగిన మానికొండ చలపతిరావు భావితరాలకు మార్గదర్శి అని మేఘాలయ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కొట్టు శేఖర్ కొనియాడారు. అత్యున్నత వృత్తి ప్రమాణాలకు, నైతిక విలువలకు ఆయన పెట్టింది పేరని కీర్తించారు. అటువంటి మహనీయునిపై తెలుగులో వచ్చిన ఏకైక సంకలం బహుశా ఇదేనని అన్నారు. భారతీయ జర్నలిజం ధృవతార మానికొండ చలపతిరావు పేరిట సీనియర్ జర్నలిస్టు ఆకుల అమరయ్య రాసిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. మిరియాల వెంకట్రావ్ ఫౌండేషన్ ప్రచురించిన ఈ పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్ యూసూఫ్ గూడలోని మహమ్మద్ ఫంక్షన్ హాలులో జరిగింది. ఈ సభకు సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మానికొండ చలపతిరావు జర్నలిజం వృత్తి ప్రమాణాలతో పాటు జర్నలిస్టుల జీవన స్థితిగతుల మెరుగుదలకు చేసిన అపార కృషిని వివరించారు. జర్నలిస్టులకు ఇవాళ అంతో ఇంతో వృత్తిపరమైన భద్రత, వేజ్ బోర్డు, ప్రెస్ కౌన్సిల్ వచ్చిందంటే అది మానికొండ చలపతిరావు ఆనాడు చేసిన పోరాట ఫలితమేనని చెప్పారు. భారత తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో మానికొండ చలపతిరావు ఎలియాస్ ఎంసీకి 33 ఏళ్ల పరిచయం ఉందని, నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రికకు 3 దశాబ్దాలకు పైగా సంపాదకత్వం వహించినా ఏనాడూ ఎడిటోరియల్ వ్యవహారాలలో యాజమాన్యాన్ని తలదూర్చనివ్వని ధీరుడు మానికొండ చలపతి రావు, పద్మభూషణ్ లాంటి అవార్డును సైతం ఆయన తిరస్కరించారని వక్తలు కొనియాడారు. ఈ పుస్తకంలోని 30 వ్యాసాలు ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యమని కొట్టు శేఖర్ అన్నారు.
నెహ్రూ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన కేవీ రఘునాధరెడ్డి చెప్పినట్టు మానికొండను తూచడానికి ఎవరి వద్దా తూనికరాళ్లు లేవని పుస్తక రచయిత అమరయ్య అన్నారు.
పుస్తకావిష్కరణ అనంతరం పుస్తక రచయితను మిరియాల వెంకట్రావ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీలు కఠారి అప్పారావు, అరవా రామకృష్ణ, చందు జనార్దన్, పి.రామమోహన్ నాయుడు తదితరులు సన్మానించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box