అటవీ ప్రాంతంలోని వాగుల నీటిని సేవిస్తే వ్యాధులు నయమవుతాయి.
ఆయుర్వేద వైద్యశాల తరహాలో బ్లాక్ బెర్రీ ఏర్పాటు.
రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.
****
వైద్యశాలను ఏర్పాటు చేసిన తరహాలోనే పస్రా - తాడ్వాయి గ్రామాల మధ్యగల దట్టమైన
అటవీ ప్రాంతంలో బ్లాక్ బెర్రీ ఏర్పాటు చేయడం జరిగిందని,
అటవీ ప్రాంతాలలోని వాగులు వంకల ద్వారా ప్రవహిస్తున్న నీటిని సేవిస్తే పలు రకాల వ్యాధులు నయమయ్యే అవకాశం ఉందని రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
మంగళవారం కన్నాయిగూడెం, ఏటూరు నాగారం మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఏటూరు నాగారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ క్రూషల్ నిధుల ద్వారా అటవీ శాఖ ఏర్పాటు చేసిన బ్లాక్ బెర్రీ ఎంతో ముచ్చటగా ఉందని, పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే అవకాశం ఉందని అన్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలోని పలు రకాల వనమూలికలను తాకుతూ ప్రవహిస్తున్న నీటిని సేవించడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని, వ్యాధులను నయం చేయడమే
కాక ఆయుష్షును పెంచుతుందని అభిప్రాయపడ్డారు. జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, దేశ విదేశీయుల పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చి దిద్దుతున్నామని అన్నారు. జిల్లా కేంద్రానికి ప్రవేశిస్తున్న సమయంలోనే గట్టమ్మ తల్లి ఉండడం, అక్కడి నుండి కొంత దూరం రాగానే యునెస్కో గుర్తింపు పొందిన 800 సంవత్సరాల నాటి రామప్ప ఆలయం సరస్సు పర్యాటకులను కనువిందు చేస్తున్నదని అన్నారు.
రామప్పలో 70 కోట్ల రూపాయలతో కాటేజీలో ఏర్పాటుతో పాటు ఐలాండ్ నిర్మాణ పనులను పూర్తి చేస్తామని, అక్కడి నుండి కొంత దూరం రాగానే లక్నవరం సరస్సు, సరస్సులో ఉయ్యాల వంతెలతో పాటు మూడవ ఐలాండ్ ను సైతం ఇటీవలనే ప్రారంభించుకున్నామని వివరించారు. తాడువాయి మండలం మేడారం గ్రామంలోని సమ్మక్క సారలమ్మ జాతర, మల్లురు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, గోదావరిపై అతిపెద్ద వంతెన, దానికి సమీపంలోనే బోగత జలపాతం లాంటి పర్యాటక ప్రాంతాలతో పాటు దైవభక్తి కలిగిన ఆలయాలు, దట్టమైన అడవి ప్రాంతాలు ఉన్నాయని అన్నారు. రానున్న రోజులలో ఏజెన్సీ గ్రామాల్లో ట్రైబల్ హట్స్ ను ఏర్పాటు చేయబోతున్నామని, జిల్లాలోని పర్యాటక ప్రాంతాలపై పాత్రికేయులు విస్తృతంగా ప్రచారం చేయాలని సీతక్క కోరారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box