జ్యోతిరావు పూలే స్ఫూర్తితో చట్టసభల్లో వాటా సాధించాలి

 


జ్యోతిరావు పూలే స్ఫూర్తితో చట్టసభల్లో వాటా సాధించాలి

పూలే ఆదర్శంగా సమాన విద్యను సాధించాలి

పూలే స్ఫూర్తితో సమాజికన్యాయ పోరాటం


జ్యోతిరావుపూలే 134వ వర్ధంతి సభలో నాయకులు సాయిని నరేందర్, జిలుకర శ్రీనివాస్, తాడిశెట్టి క్రాంతి కుమార్


    వేల సంవత్సరాల నుండి విద్యకు, ఆస్తికి, అధికారానికి దూరమైన ఎస్సి, ఎస్టీ, బి.సి, మైనార్టీ ప్రజలు స్వాతంత్రం వచ్చి 77 ఏండ్లు అయినా అదే దుస్థితి కొనసాగుతుందని, మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో 90 శాతంగా ఉన్న ప్రజల విముక్తి కోసం ఐక్యంగా పోరాటం చేయాలని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, విముక్త చిరుతల కచ్చి పార్టీ తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్, పూలే యువజన సంఘాల సమాఖ్య అద్యక్షులు తాడిశెట్టి క్రాంతి కుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ జిల్లాల ఫూలే యువజన సంఘం, ఆల్ ఇండియా ఓబిసి జాక్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కేంద్రం బి.ఆర్ అంబేద్కర్ సెంటర్ లో బుధవారం జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే 134 వర్ధంతి కార్యక్రమంలో వారు పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడారు.



    భారతదేశ ఆధునిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని ఆయన అన్ని రంగాల్లో తన ప్రతిభను చూపెడుతూ బహుజన వర్గాల ప్రజలకు ఆశాజ్యోతి గా నిలిచారని, విద్యతోనే సమూల మార్పు చెందుతుందని మహిళలకు, ఎస్సి, ఎస్టీ బి.సి లకు విద్యను నేర్పించి ఎన్నో పాఠశాల నెలకొల్పి సత్యశోధక్ సమాజ్ ద్వారా విప్లవాత్మమైన మార్పును తీసుకొచ్చారని ఆయన ప్రేరణతో చత్రపతి సాహు మహారాజ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్లు విద్యను ప్రోత్సహించి రిజర్వేషన్లను కల్పించారని అన్నారు. ఎన్నో మహోన్నత కార్యక్రమాలకు దిక్సూచి అయిన పూలే స్ఫూర్తితో బహుజన వర్గాల హక్కులు సాధించుకోవాలని అన్నారు. రైతులు, కూలీలు, కార్మికుల హక్కుల కోసం ఎన్నో సంఘాల ఏర్పాటు చేసి పోరాటం చేశారని అన్నారు.

    జ్యోతిబాపూలే ను అంబేద్కర్ గురువుగా ప్రకటించుకున్న గొప్ప నాయకుడని, విద్య లేనందునే విజ్ఞానం, చైతన్యం, నైతికత లేకుండా పోయిందని తద్వారా శూద్రులు అణచివేయబడుతున్నారని అన్నారు. ప్రజల బానిసత్వాన్ని ఆనాడే గుర్తించిన పూలే గులాంగిరి గ్రంథం వ్రాయడమే కాకుండా వీధి నాటకాల ద్వారా ప్రజలను ఎంతో చైతన్యం చేశారని, దురాచారాల పేరుతో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను, అవమానాలను ఎదురించిన పూలే దంపతులకు నేటి సమాజం ఎంతో రుణపడి వుందని అన్నారు. 

   ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఒబిసి జాక్ వైస్ చైర్మన్ పటేల్ వనజ మాట్లాడుతూ సమాజంలో సగబాగమైన మహిళల అభివృద్ధి కోసం పూలే దంపతులు చేసిన త్యాగపూరిత పోరాటం చేశారని, వారి విద్యా పోరాటం వల్లనే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని, అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలను చట్టసభల్లోకి రాకుండా బిజెపి పాలకులు కుట్రలు చేస్తున్నారని, మహిళా బిల్లులో బి.సి కోటా గురుంచి దేశవ్యాప్త పోరాటానికి మహిళలు సిద్ధం కావాలని అన్నారు. బి.సి జపం పాడుతున్న ప్రధాని మోడీ బి.సి లకు అన్యాయం చేస్తూ ఇ డబ్లు ఎస్ రిజర్వేషన్లతో ఆధిపత్య వర్గాలకు మేలు చేస్తున్నారని అన్నారు. జనగణనలో కులగణన చేర్చాలనే బీసీల డిమాండ్ ను పక్కదోవ పట్టిస్తూ అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఒక్కటిగా కలిసుండే బహుజన ప్రజలను మతాల పేరుతో చీల్చుతున్న బిజెపి కుట్రలను పసిగట్టి ఐక్యంగా పోరాటం చేసి హక్కులతో పాటు బహుజన రాజ్యాధికారం సాధించననాడే పూలే కు నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుందని ఆమె అన్నారు. 

   ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఒబిసి జాక్ వైస్ చైర్మన్ పటేల్ వనజ, బుద్ధిస్ట్ సొసైటీ నాయకులు మిద్దేపాక ఎల్లన్న, పబ్లిక్ గార్డెన్ మాజీ అద్యక్షులు వల్లాల జగన్ గౌడ్, న్యాయవాదులు యగ్గడి సుందర్ రామ్, మహేందర్, వివిధ సంఘాల నాయకులు తాటికొండ సద్గుణ, సింగారపు అరుణ, జల్లెల కృష్ణమూర్తి, నారాయణగిరి రాజు, రాజు యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, సురాసి విక్రమ్, నలుబాల రవికుమార్, కర్రే చంద్రశేఖర్, కొండి కృష్ణ గౌడ్, అనిశెట్టి సాయి తేజ, నలుబోల సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు